సెంటర్, స్టేట్ మధ్య కోల్.. వార్​

by Shiva |   ( Updated:2024-06-21 02:36:30.0  )
సెంటర్, స్టేట్ మధ్య కోల్.. వార్​
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య 49:51 నిష్పత్తిలో జాయింట్ వెంచర్‌గా ఉన్న సింగరేణిలోని బొగ్గు బ్లాకులను వేలం వేసేందుకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మరో సారి సిద్ధమవుతోంది. 2015లో కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన కోల్ మైన్ స్పెషల్ పర్పస్ చట్టం, మైన్స్ అండ్ మినరల్ డెవలప్‌మెంట్ అండ్ రెగ్యులేషన్ చట్టంలోని నిబంధనల మేరకు నాలుగు బొగ్గు బ్లాకులను వేలం వేయాలని 2021 ఆగస్టులో నిర్ణయం తీసుకున్నది. అదే ఏడాది డిసెంబర్ 15న ముహూర్తాన్ని ఫిక్స్ చేసింది. కానీ ప్రైవేటు సంస్థలు ముందుకు రాకపోవడంతో పాక్షిక ప్రయోజనమే మిగిలింది. ఇప్పుడు మరోసారి శ్రావణ్‌పల్లి బ్లాకును వేలం వేసేందుకు సెంట్రల్ గవర్నమెంట్ రంగం సిద్ధం చేసింది. సికింద్రాబాద్ ఎంపీగా గెలిచిన కిషన్‌రెడ్డి ఇటీవల బొగ్గు గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన తన చేతుల మీదుగా వేలం ప్రాసెస్‌ను నేడు లాంఛనంగా ప్రారంభించనున్నారు. అయితే ఈ ప్రతిపాదనను విరమించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేసింది. నామినేటెడ్ పద్ధతిలో సింగరేణికే కేటాయించాలని ఒత్తిడి తెస్తున్నది.

పలు మార్లు లేఖలు.. 72 గంటలు బంద్

తెలంగాణలో అతి పెద్ద ప్రభుత్వరంగ సంస్థగా ఉన్న సింగరేణిని నిలబెట్టుకోవాలన్నది కాంగ్రెస్, బీఆర్ఎస్ డిమాండ్లు. కొయ్యలగూడెం (బ్లాక్-3), సత్తుపల్లి (బ్లాక్-6), శ్రావణ్‌పల్లి, కల్యాణఖని (బ్లాక్-6) బ్లాకులు వేలం వేయాలని కేంద్రం డెసిషన్ తీసుకున్నప్పుడే అప్పటి సీఎం కేసీఆర్ డిసెంబర్ 2021లో ప్రధాని మోడీకి లేఖ రాశారు. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అప్పుడు కాంగ్రెస్ ఎంపీగా ఉన్న రేవంత్‌రెడ్డి సైతం డిసెంబర్ 11, 2021న ప్రధానికి లేఖ రాసి మూడవ విడత వేలం ప్రక్రియలో సింగరేణి బ్లాకులను ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. ఈ నాలుగు బ్లాకుల్ని నామినేటెడ్ పద్ధతిలో సింగరేణికే అప్పగించాలని సూచించారు. కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి సైతం ఇదే అంశాన్ని పార్లమెంటు వేదికగా ప్రస్తావించి కేంద్రం నిర్ణయాన్ని తప్పుపట్టారు. సింగరేణి కార్మిక సంఘాలు సైతం 72 గంటల బంద్ పాటించి నిరసన వ్యక్తం చేశాయి.

ఉద్దేశం లేదంటూనే..

ఓ వైపు సింగరేణిని ప్రైవేటీకరించే ఉద్దేశం లేనే లేదని, రాష్ట్ర ప్రభుత్వానికి 51% వాటా ఉన్నందున అక్కడి నుంచి ఆమోదం లేకుండా ఇది జరిగే అవకాశమే లేదని నవంబర్ 12, 2022న రామగుండంలో నిర్వహించిన సభలో ప్రధాని మోడీ స్పష్టతనిచ్చారు. అప్పట్లో కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి సైతం సింగరేణి ప్రైవేటీకరణ అంశమే ఉత్పన్నం కాదని క్లారిటీ ఇచ్చారు. సింగరేణి మొత్తం 45 మైన్ల ద్వారా ఉత్పత్తి చేస్తున్న బొగ్గులో దాదాపు 80% థర్మల్ విద్యుత్ ప్లాంట్లకే సప్లై చేస్తున్నది. కేవలం తెలంగాణకు మాత్రమే పరిమితం కాకుండా తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సైతం సింగరేణి బొగ్గు ఆధారంగా మారింది. ఓ వైపు బొగ్గు బ్లాకులను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టే పాలసీ తీసుకొచ్చి ఉద్దేశపూర్వకంగా సింగరేణిని చంపేస్తున్నారని ఆరోపిస్తున్న విపక్షాలు... ఆ బ్లాకుల్ని ప్రభుత్వరంగ సంస్థగా ఉన్న సింగరేణికే నామినేటెడ్ పద్ధతిలో ఇవ్వాలని డిమాండ్ చేశాయి.

మరో సారి విజ్ఞప్తి చేసేందుకు సర్కారు రెడీ

బొగ్గు బ్లాకుల వేలం నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ పదో విడత వేలాన్ని ప్రారంభించే సమయంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి విజ్ఞప్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అవుతున్నది. రాజకీయాలకతీతంగా రాష్ట్ర ప్రయోజనాలతో ముడిపడి ఉన్న ఈ అంశాన్ని కేంద్రానికి లేఖ రూపంలో వివరించాలని అనుకుంటున్నది. అన్ని పార్టీలకు చెందిన ప్రతినిధులను అఖిలపక్షం పేరుతో ఢిల్లీకి తీసుకెళ్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. వివాదానికి కేంద్ర బిందువుగా సింగరేణి మారడంతో రాజకీయ పార్టీల మధ్య పొలిటికల్ ఘర్షణకు తావిచ్చినట్టు అయ్యింది. తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉంటానని కేంద్రం పదే పదే చెబుతున్నా బొగ్గు బ్లాకులను ప్రయివేటు సంస్థలకు దారాదత్తం చేయడం వివాదాస్పదమైంది. రాష్ట్ర ప్రయోజనాలంటూ కాంగ్రెస్, జాతి ప్రయోజనాలంటూ బీజేపీ సమర్థించుకుంటున్నాయి.

ఆ నాలుగు బ్లాకులను మళ్లీ సింగరేణికే ఇవ్వండి

మొత్తం దక్షిణ భారతదేశానికే సింగరేణి బొగ్గు సరఫరా అవుతున్నది. థర్మల్ ప్లాంట్లతో కరెంటు ఉత్పత్తి అవుతున్నది. కల్యాణ ఖని, సత్తుపల్లి, కొయ్యలగూడెం, శ్రావణ్‌పల్లి బ్లాకుల్లో బొగ్గు వెలికితీత సర్వేకు సింగరేణి రూ.70 కోట్లు ఖర్చు చేసింది. బొగ్గు రవాణా కోసం రూ.750 కోట్లతో సత్తుపల్లి-కొయ్యలగూడెం రైల్వే లైన్ వేయించింది. మొత్తం 45 మైన్‌ల ద్వారా ఏటా 80 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తున్నది. ఇకపై అదనంగా మరో 11 మిలియన్ టన్నుల ఉత్పత్తి పెంచేలా ప్రణాళికలు ఉన్నాయి. థర్మల్ ప్లాంట్‌నూ సింగరేణి రన్ చేస్తున్నది. ప్రైవేటు సంస్థలకు వేలం రూపంలో కట్టబెట్టే బదులు సింగరేణికే ఇవ్వండి’. (డిసెంబర్ 11, 2021న ప్రధాని మోడీకి రేవంత్‌రెడ్డి రిక్వెస్ట్)

తెలంగాణకు సింగరేణి జీవనాడి

‘తెలంగాణకు సింగరేణి జీవనాడి. రాష్ట్రం ఏర్పడే నాటికి విద్యుత్ డిమాండ్ 5,661 మెగావాట్లు మాత్రమే. ఏడేండ్ల తర్వాత (2021 మార్చి) అది 13,688 మెగావాట్లకు పెరిగింది. నిరంతరాయ విద్యుత్ సరఫరా కోసం థర్మల్ ప్లాంట్లకు బొగ్గు సప్లై తప్పనిసరి. సింగరేణిలోని బొగ్గు నిక్షేపాలను, వెలికితీతను దృష్టిలో పెట్టుకునే రాష్ట్ర ప్రభుత్వం అనేక పాలసీలు తీసుకున్నది. మైనింగ్ లైసెన్సులూ ఇచ్చింది. ఇది కేంద్రానికి సైతం తెలుసు. కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బ్లాకుల్ని వేలం వేసే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. (కేసీఆర్, మాజీ సీఎం, 2021 డిసెంబర్ 8న ప్రధాని మోడీకి రాసిన లేఖ)

సింగరేణిని ప్రైవేటీకరించే ఆలోచన లేదు

‘సింగరేణి సంస్థను ప్రైవేటీకరించే ప్రతిపాదన లేదు. హైదరాబాద్‌లో కూర్చున్న కొందరు (బీఆర్ఎస్ నేతలను ఉద్దేశిస్తూ..) అసత్య ప్రచారం చేస్తున్నారు. కార్మికులు వారి మాటలు నమ్మొద్దు. సింగరేణిలో తెలంగాణ వాటా 51% ఉన్నది. కేంద్రానికి ఉన్నది 49 శాతమే. సింగరేణిని కేంద్రం కంట్రోల్ చేయడం సాధ్యం కాదు. ఇంతకాలం అబద్ధాలు చెప్పిన ఆ పార్టీ నేతలు ఇప్పుడు నేను ఇస్తున్న క్లారిటీతో ఈ రాత్రికి నిద్రపోరు. తెలంగాణను మరింత అభివృద్ధి చేయాలని కేంద్రం కోరుకుంటున్నది.’ (నవంబర్ 12, 2022 రామగుండం సభలో ప్రధాని మోడీ)

నామినేటెడ్ విధానం వద్దని సుప్రీం చెప్పింది

‘సింగరేణిలో తెలంగాణ వాటా 51%. కేంద్రానికి 49%. నిర్ణయాధికారమంతా రాష్ట్రానిదే. మేనేజింగ్ డైరెక్టర్‌ను నియమించేది తెలంగాణే. సింగరేణిపై కేంద్రానికి ఎలాంటి అధికారమూ లేదు. ప్రైవేటీకరించాలంటే తెలంగాణ అంగీకారం తప్పనిసరి. ప్రైవేటైజ్ చేయాలనే ఉద్దేశం కేంద్రానికి లేదు. ఆ అంశమే ఉత్పన్నం కాదు. వేలం ద్వారానే గనులను వేలం వేయాలని, నామినేటెడ్ పద్ధతిలో వద్దని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. ఇప్పటిదాకా తొమ్మిది రౌండ్లలో 300 గనులను వేలం వేశాం. దీని ద్వారా ఒడిశా ప్రభుత్వానికి రూ.36 వేల కోట్లు రెవెన్యూ సమకూరుతున్నది. బొగ్గు గనుల్ని, బ్లాకుల్ని వేలం వేస్తే రాష్ట్రాలకే ఆదాయం పెరుగుతుంది. (జూన్ 19, 2024-06-20న ఢిల్లీలోని బొగ్గు మంత్రిత్వశాఖ కార్యాలయంలో మంత్రి కిషన్‌రెడ్డి.)

Advertisement

Next Story