గోల్కొండలో ఆవిర్భావ వేడుకలు.. ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి!

by GSrikanth |   ( Updated:2023-06-02 00:31:19.0  )
గోల్కొండలో ఆవిర్భావ వేడుకలు.. ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సర్వం సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తొలిసారిగా ఈ వేడుకలు జరగనున్నాయి. హైదరాబాద్‌లోని గోల్కొండ కోటలో ఘనంగా నిర్వహించనున్నారు. ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరుకానున్నారు. శుక్రవారం ఉదయం 7 గంటలకు ఆయన గోల్కొండ కోట వద్దకు చేరుకుంటారు. ఆయనకు కోలాట బృందాలతో స్వాగతం పలకనున్నారు. 7:10 గంటలకు కిషన్ రెడ్డి గోల్కొండ కోటలో జాతీయ జెండా ఎగురవేస్తారు. ఆపై సాయుధ బలగాల గౌరవ వందనాన్ని స్వీకరించనున్నారు. సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫోటో, పెయింటింగ్ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించనున్నారు. తిరిగి సాయంత్రం 5:30 గంటలకు గోల్కొండ కోటకు చేరుకుంటారు. భారత సాంస్కృతిక వైభవంతో పాటు భారత ప్రభుత్వం, సాధించిన విజయాలపై రెండు చిత్రాలను ప్రదర్శించనున్నారు. అనంతరం కిషన్ రెడ్డి ప్రసంగించనున్నారు. ప్రసంగం అనంతరం డాక్టర్ ఆనంద శంకర్ బృందం, మంజుల రామస్వామి బృందం శాస్త్రీయ నృత్య ప్రదర్శన కొనసాగనుంది.

ఆపై ప్రముఖ గాయకులు మంగ్లీ, మధుప్రియ పాటల ప్రదర్శన ఉంటుంది. కాగా చివరగా ప్రముఖ సంగీత దర్శకుడు శంకర్ మహదేవన్ దేశభక్తి పాటల ప్రదర్శన కొనసాగనుంది. కాగా గోల్కొండలో నిర్వహిస్తున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఇదిలా ఉండగా గతంలో సెప్టెంబర్​ 17న తెలంగాణ విమోచన దినోత్సవాలను అధికారికంగా నిర్వహించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలను కూడా నిర్వహించడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకంది. రాష్ట్ర ప్రభుత్వానికి దీటుగా వేడుకను నిర్వహించి సక్సెస్ చేయాలని భావిస్తోంది. ఏక్ భారత్ - శ్రేష్ఠ్ భారత్’ లో భాగంగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలను నిర్వహించనున్నారు. అన్ని రాష్ట్రాల గవర్నర్లు ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంటుంది.

Advertisement

Next Story