పంద్రాగస్టు వేడుకలు ముగియడమే ఆలస్యం.. బీజేపీని టార్గెట్ చేసిన కాంగ్రెస్..!

by Gantepaka Srikanth |
పంద్రాగస్టు వేడుకలు ముగియడమే ఆలస్యం.. బీజేపీని టార్గెట్ చేసిన కాంగ్రెస్..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదం పొందేలా చొరవ తీసుకున్న కాంగ్రెస్.. రానున్న రోజుల్లో బీజేపీని టార్గెట్ చేసేందుకు రాజకీయ వ్యూహాన్ని రూపొందిస్తున్నది. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు, ఆ తర్వాత సీఎం విదేశీ పర్యటన, రుణమాఫీ స్కీమ్ అమలు, పంద్రాగస్టు వేడుకలు.. ఇవన్నీ పూర్తయిన తర్వాత రాష్ట్రానికి చెందిన ఎనిమిది మంది బీజేపీ ఎంపీలే లక్ష్యంగా కాంగ్రెస్ అనుబంధ సంఘాలు నిరసనకు ప్లాన్ చేస్తున్నాయి. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ కేంద్ర అధిష్టానంపై ఒత్తిడి తీసుకురావాలంటూ ఎంపీలను నిలదీయడమే ఈ నిరసనల లక్ష్యం. హైదరాబాద్ సహా పార్లమెంటు నియోజకవర్గాల్లోని ఎంపీల నివాసాలే ఈ ప్రొటెస్టులకు టార్గెట్ గా చేసుకున్నట్లు తెలుస్తున్నది.

బీజేపీ హై కమాండ్ పై ఆ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలు ఒత్తిడి తెచ్చేలా..

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు నిధులిచ్చామంటూ బీజేపీ ఎంపీలు సమర్థించుకుంటున్నా.. కాంగ్రెస్ సహా బీఆర్ఎస్, మజ్లిస్, సీపీఐ తదితర పార్టీలన్నీ రాష్ట్రానికి అన్యాయమే జరిగిందని విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అనుబంధ సంఘాలు ఈ నిరసనలను ప్లాన్ చేస్తున్నాయి. అయితే వాటిని ఎప్పటి నుంచి ప్రారంభించి ఏ రూపంలో కొనసాగించాలన్న అంశంపై రానున్న రోజుల్లో స్పష్టత రానున్నది. నీళ్లు, నిధులు, నియామకాలే ప్రామాణికంగా రాష్ట్రాన్ని కొట్లాడి తెచ్చుకున్నామని, రాష్ట్ర భవిష్యత్తు, ప్రయోజనాల విషయంలో కేంద్రం కూడా అదే తరహాలో సహకారం అందించాలన్నది కాంగ్రెస్ అనుబంధ సంఘాల డిమాండ్. నిధులతోపాటు కేంద్రం నుంచి రావాల్సిన అన్ని రకాల అనుమతులు మంజూరయ్యేలా సొంత పార్టీపై ఒత్తిడి పెంచి రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీ ఎంపీలు ప్రయత్నించాలనేది ఈ సంఘాల ఉద్దేశం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో ఇక్కడా, అక్కడా అధికారంలో ఉన్న కాంగ్రెస్ హైకమాండ్‌పై ఈ ప్రాంతానికి చెందిన స్థానిక నాయకుల మొదలు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రాష్ట్ర మంత్రుల వరకు ఒత్తిడి తెచ్చినట్లుగానే.. ఇప్పుడు బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఆ తరహాలో కొట్లాడాలని డిమాండ్ చేయనున్నాయి. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను రూపొందించడానికి ముందే ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంతోపాటు వివిధ శాఖల మంత్రులు ప్రధానిని, కేంద్ర ఆర్థిక మంత్రిని, ఆయా శాఖల మంత్రులను కలిసి మెమొరాండంలు ఇచ్చిన అంశాన్ని కూడా నిరసనల్లో ప్రస్తావించనున్నారు.

పార్లమెంటులో ప్రస్తావించేలా..

రాష్ట్ర ప్రభుత్వం తరఫున బయ్యారం స్టీల్ ప్లాంట్, కాజీపేట రైల్ కోచ్ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్, ఐఐఎం, సైనిక్ స్కూల్, నవోదయ విద్యాలయాలు, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా, వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి విభజన చట్టం ప్రకారం ఇవ్వాల్సిన నిధులు, వివిధ పథకాలకు కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు, ధాన్యం సేకరణకు సంబంధించిన పెండింగ్ ఫండ్స్, జాతీయ రహదారులు, మెట్రో రైల్ విస్తరణకు ఆర్థిక సాయం... ఇలా అనేక అంశాల్లో కేంద్రానికి మొరపెట్టుకున్నా బడ్జెట్‌లో అవేవీ ప్రతిబింబించ లేదని బీజేపీ నేతలను ఈ నిరసనల సందర్భంగా కాంగ్రెస్ అనుబంధ సంఘాల కార్యకర్తలు నిలదీయనున్నారు. పార్టీలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కేంద్ర పెద్దలతో మాట్లాడి సవరించిన బడ్జెట్‌లో చేర్పించాలని, ఆయా శాఖలకు సంబంధించి పార్లమెంటులో గ్రాంట్లపై జరిగే చర్చల సమయంలోనూ ప్రస్తావించాలని డిమాండ్ చేయనున్నారు.

రాజకీయాలకతీతంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం

ఎన్నికల వరకే రాజకీయాలు... ఆ తర్వాత రాష్ట్ర అవసరాలు, అభివృద్ధి, సంక్షేమంపైనే దృష్టి అంటూ సీఎం రేవంత్ పలుమార్లు వ్యాఖ్యానించారు. కేంద్ర, రాష్ట్ర సంబంధాల విషయంలో రాజకీయాలు ఉండవని, రాష్ట్ర ప్రయోజనాలే ఉంటాయని అసెంబ్లీ వేదికగా రెండు రోజుల ముందు కూడా ప్రస్తావించారు. ఈ వ్యాఖ్యలనే ఉటంకిస్తూ రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్రం నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులు పని చేయాలని ఒకవైపు రిక్వెస్టు చేస్తూనే.. మరోవైపు బీజేపీ హైకమాండ్‌పైన ఒత్తిడి పెంచాలని డిమాండ్ చేయడం ఈ నిరసనల ఉద్దేశం. కేంద్ర బడ్జెట్‌లో ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకే ఎక్కువ నిధులు వెళ్లాయంటూ ‘ఇండియా’ టీమ్ పార్టీల నేతల నుంచి విమర్శలు వచ్చాయి. దీనికి కొనసాగింపుగా ఢిల్లీ వేదికగా నిరసనలకూ ఆలోచనలు ప్రాథమిక స్థాయిలో జరుగుతున్నాయి. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంల నిరసనలతో జాతీయ స్థాయిలోనూ ప్రొటెస్ట్ లు జరగనున్నాయి.

Advertisement

Next Story