Ponnam Prabhakar : రైతు క్లస్టర్లలో సంబరాలు చేయాలి

by Mahesh |   ( Updated:2024-07-17 16:06:30.0  )
Ponnam Prabhakar : రైతు క్లస్టర్లలో సంబరాలు చేయాలి
X

దిశ, తెలంగాణ బ్యూరో: రుణమాఫీ మొదలు కానున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతు క్లస్టర్లలో సంబురాలు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపు ఇచ్చారు. బుధవారం ఆయన ప్రజా భవన్ వద్ద మీడియాతో మాట్లాడారు. రైతుల కళ్లల్లో ఆనందం చూసి ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ అవ్వాలని కోరారు. భారతదేశ చరిత్రలోనే ఒక రాష్ట్ర ప్రభుత్వం గా రెండు లక్షల రూపాయలు రుణమాఫీని ఒకేసారి చేయడం ఇదే మొదటి సారి అన్నారు. ఇది చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఈ నిర్ణయంలో కేబినెట్ మంత్రిగా తాను ఉండటం అదృష్టంగా భావిస్తున్నానని వెల్లడించారు. తానూ ఒక రైతు బిడ్డని అని, రుణమాఫీతో రైతు జీవితంలో ఆనందం గడియలు మొదలు కానున్నాయని చెప్పారు. అవగాహన లేని ప్రతిపక్షాలు మంచి చేసినా, విమర్శిస్తూనే ఉంటాయన్నారు. లక్ష రూపాయల లోపు ఉన్న వాళ్లందరికీ గురువారం నుంచి ఒకేసారి జమ అవుతాయన్నారు.

ఈ నెల చివరి వారంలో లక్షా 50 వేల రూపాయల వరకు ఉన్నోళ్లందరికీ జమ అవుతాయన్నారు. ఆగస్టు లోపు మిగతా 2 లక్షల రుణమాఫీ ఉన్నోళ్లకు మాఫీ చేస్తామన్నారు. ఒకేసారి రైతు పేరు మిద ఉన్న రుణాన్ని 3 పద్ధతుల్లో మాఫీ చేయబోతున్నామని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ, రైతు చిరు నవ్వు కోసం ఇంత గొప్ప నిర్ణయం తీసుకుంటే ప్రసంసించాల్సింది పోయి విమర్శలు చేయడం ప్రతిపక్షాల కుహన బుద్ధి రాజకీయం అర్థం అవుతుందన్నారు. 2005లో దేశవ్యాప్తంగా రూ. 72,000 కోట్ల రూపాయలు మాఫీ చేస్తే, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ కోసం రూ. 31 వేల కోట్లను ఖర్చు చేస్తుందన్నారు. ఏడు లక్షల కోట్లు అప్పు ఉన్నా, ఇచ్చిన మాటను నెరవేర్చామన్నారు. హరీష్​రావు, కేటీఆర్‌లు ప్రశంసించ పోయినా పర్వలేదని, కానీ రైతు మంచి కోసం చేసే కార్యక్రమంపై విమర్శలు చేయడం తగదని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed