క్యాచీ స్లో'గన్'.. రిజల్ట్స్‌పై పార్టీల గురి

by Sathputhe Rajesh |   ( Updated:2022-12-10 02:56:44.0  )
క్యాచీ స్లోగన్.. రిజల్ట్స్‌పై పార్టీల గురి
X

దిశ, వెబ్ డెస్క్: ప్రజల చూపు తమ వైపునకు తిప్పుకునేందుకు రాజకీయ పార్టీలు కొత్త ప్రయత్నాలు చేస్తూనే ఉంటాయి. ఇందులో భాగంగానే ఒకే లైన్‌లో తమ విధానాన్ని స్పష్టంగా తెలిపేందుకు సృజనాత్మక నినాదాన్ని ఎంచుకుంటున్నాయి. ఆ నినాదం ప్రజల్లోకి ఎంత వెళితే అంత సానుకూల ఫలితాలు సాధించవచ్చేనేది ఆయా పార్టీల ఎత్తుగడగా భావించవచ్చు.

కౌంటర్ స్లోగన్..

బీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ సందర్భంగా నిన్న కేసీఆర్ 'అబ్ కీ బార్ కిసాన్ సర్కార్' నినాదాన్ని ఇచ్చారు. రైతులకు చేరువయ్యేలా నినాదాన్ని బీఆర్ఎస్ వర్గాలు ప్లాన్ చేశాయి. బీజేపీకి కౌంటర్‌గా దేశ వ్యాప్తంగా ఉన్న రైతులకు త్వరగా చేరువయ్యేలా దీన్ని ఎంచుకున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ఎర్రకోటపై గులాబీ జెండా ఎగరవేస్తాం అన్నారు. కాంగ్రెస్ పార్టీకి కౌంటర్‌గా బీజేపీ కాంగ్రెస్ ముక్త్ భారత్ నినాదాన్ని పలు ఎన్నికల సందర్భంగా ఇచ్చింది. ఇటీవల రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి పెట్టిన బీజేపీ నాయకులు కూడా గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగరవేస్తామని తరచూ వ్యాఖ్యనిస్తున్నారు. బండి సంజయ్ ఈ నినాదాన్ని తరచూ బహిరంగ సభల్లో వాడుతుంటారు.

ట్వంటీ ట్వంటీఫోర్- మోడీ వన్స్ మోర్

'2024(ట్వంటీ ట్వంటీఫోర్)- మోడీ వన్స్ మోర్' నినాదాన్ని ఇప్పటికే బీజేపీ నాయకులు ఆయా సందర్భాల్లో వాడుతున్నారు. 2024లో కేంద్రంలో బీజేపీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా ఈ నినాదాన్ని ఎంచుకున్నారు. ఆయా రాష్ట్రాల్లో సైతం ఈ నినాదాన్ని నేతలు వాడుతున్నారు. మోడీ ప్రభతోనే రెండు పర్యాయాలు కేంద్రంలో అధికారంలోకి వచ్చామని మూడో పర్యాయం కూడా మోడీని ముందుంచాలన్నది బీజేపీ వ్యుహంలా కనిపిస్తోంది. అందుకే మళ్లీ మోడీ పేరు వచ్చేలా స్లోగన్ ప్లాన్ చేసినట్లు తెలిసింది. 2014లో 'అబ్ కీ బార్ మోడీ సర్కార్' నినాదాన్ని విసృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. 2019లో 'ఔర్ ఏక్ బార్ మోడీ సర్కార్' నినాదం బీజేపీకి అధికారాన్ని దక్కించింది. బీజేపీ హర్ హర్ మోడీ- ఘర్ ఘర్ మోడీ, అచ్చే దిన్ ఆనే వాలే హే వంటి నినాదాలను గతంలో వినియోగించి సత్ఫలితాలు సాధించింది.

ఫలితాలివ్వని స్లోగన్‌లివే..

2014 ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీ 'పూరి రోటి కాయేంగే కాంగ్రెస్‌కో జితాయెంగే' నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. 2019 లోక్ సభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ 'అబ్ హోగా న్యాయ్' స్లోగన్‌తో ఎన్నికల బరిలోకి దిగింది. ఇవి ఆ పార్టీకి కలిసిరాలేదు. 2019 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కేంద్రంలో తమ సత్తా చాటాలంటే అన్ని పార్లమెంట్ స్థానాలు గెలవాలన్న సంకల్పంతో కేసీఆర్ సారూ.. కారూ.. పదహారు అనే నినాదాన్ని ఇచ్చారు. ఇది సత్ఫలితాలను ఇవ్వలేదు. తెలంగాణలో మొత్తం 17 స్థానాలు ఉండగా హైదరాబాద్ ఎంపీ స్థానాన్ని మినహాయించి ఈ నినాదాన్ని కేసీఆర్ ఎంచుకున్నారు. 16 స్థానాల్లో పోటీ చేసిన టీఆర్ఎస్ 9 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. మరి ఆయా పార్టీలు ఎంచుకున్న కొత్త నినాదాలు ఏ మేరకు ప్రభావం చూపనున్నాయో తెలియాలంటే 2024 ఎన్నికల వరకు ఆగాల్సిందే.

Also Read....

భారత్ రాష్ట్ర సమితిలో కేటీఆర్‌కు కీలక బాధ్యతలు!!

Advertisement

Next Story

Most Viewed