Professor Saibaba: కులాలను బట్టి జైల్లో పనులు.. ప్రొఫెసర్ సాయిబాబా సంచలన ఆరోపణలు

by Prasad Jukanti |
Professor Saibaba:  కులాలను బట్టి జైల్లో పనులు.. ప్రొఫెసర్ సాయిబాబా సంచలన ఆరోపణలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: గత పదేళ్లు జైల్లో తనకు చీకటి రోజులు నడిచాయని, అక్కడి అధికారులు చిత్రహింసలకు గురయ్యే పరిస్థితిలు కల్పించి తనను మానసికంగా వేధించారని ప్రొఫెసర్ సాయిబాబా సంచలన ఆరోపణలు చేశారు. వీల్‌చైర్ లేకుండా నడవలేని తనను వీల్‌చైర్ తిరగని సెల్‌లో ఉంచారని ఆవేదన వ్యక్తం చేశారు. మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో ప్రొఫెసర్ సాయిబాబా 2014లో అరెస్ట్ అయి ఇటీవలే విడుదలయ్యారు. ఇవాళ ఆయన హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో మాట్లాడారు. తన అరెస్టుకు ముందు కొంతమంది అధికారులు తనను కలిసి మేము చెప్పినట్లుగా చేస్తే వదిలేస్తామని, లేకుంటే తప్పుడు కేసుల్లో ఇరికించి జైలుకు పంపి బయటకు రాకుండా చేస్తామని హెచ్చరించారని ఆరోపించారు.

కులాన్ని బట్టే పని

జైల్లో శారీరక ఇబ్బందులే కాకుండా తనకు కుల వ్యవస్థ కనిపించిందని ప్రొఫెసర్ సాయిబాబా అన్నారు. కులాన్ని బట్టి జైల్లో స్థలం, చేసే పని ఇస్తున్నారని, ఖైదీలకు డ్రైనేజీ, టాయిలెట్ శుభ్రపరిచే పనులు వారి కులాలను బట్టి ఇస్తున్నారని ఆరోపించారు. అలా అక్కడి జైలు మాన్యువల్‌లో రాసి ఉందన్నారు. జైలులోని చిత్రహింసలను వివరించేందుకు తనకు రోజులు చాలవన్నారు. తనపై జరిగిన మానసిక వేదన, బెయిల్ గురించి కోర్టులకు రాసినా ఎవరూ పట్టించుకోలేదన్నారు. సమస్యలపై పోరాడే వారి నోరు మూయించేందుకే అక్రమ కేసులు బనాయిస్తూ జైళ్లకు పంపుతున్నారని హాట్ కామెంట్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed