MLC కవిత ఫొటో మార్ఫింగ్.. ట్రోలర్స్‌కు పోలీసులు బిగ్ షాక్..!

by Satheesh |   ( Updated:2023-03-29 11:17:53.0  )
MLC కవిత ఫొటో మార్ఫింగ్.. ట్రోలర్స్‌కు పోలీసులు బిగ్ షాక్..!
X

దిశ, డైనమిక్ బ్యూరో: సోషల్ మీడియా వేదికగా రాజకీయ నేతలు, సినీ సెలబ్రిటీల ఫోటోలను అసభ్యకరంగా, అభ్యంతరకరంగా మార్ఫింగ్ చేస్తూ పోస్టులు చేస్తున్న కేటుగాళ్లపై సైబర్ పోలీసులు పంజా విసిరారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ట్రోలింగ్‌లకు పాల్పడుతున్న 8 మందిని గుర్తించి చర్యలు తీసుకున్నారు. ఎమ్మెల్సీ కవిత ఫోటోను మార్ఫింగ్ చేయడంతో పాటు పలువురు ప్రభుత్వ పెద్దలు, సినీ, మహిళలపై అభ్యంతరకర రీతిలో ఫోటో మార్ఫింగ్ చేసి ట్రోల్స్ చేస్తున్న కేసులు రావడంతో ప్రత్యేక టీమ్ ను పోలీసులు రంగంలోకి దింపారు. అసభ్యకర రీతిలో పోస్టులు చేస్తూ ట్రోలింగ్స్‌కు పాల్పడుతున్న వారిపై 20 కేసులు నమోదు చేశారు.

ఈ మేరకు బుధవారం క్రైమ్ డీసీపీ స్నేహ మెహ్రా మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ట్రోలింగ్‌కు పాల్పడుతున్న అట్టాడ శ్రీనివాసరావు, చిరసాని మణికంఠ, బద్దంజి శ్రవణ్, మోతం శ్రీను, పెరక నాగవెంట కిరణ్, వడ్లూరి నవీన్, బొల్లి చంద్రశేఖర్, బిల్ల శ్రీకాంత్‌లను అరెస్ట్ చేశామన్నారు. మరో 30 మంది ట్రోలర్స్‌కు నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. ప్రజా ప్రతినిధులపై అభ్యంతరకర పోస్టులు పెట్టినా ఫోటో మార్ఫ్ చేసినా కఠిన చర్యలు ఉంటాయని స్నేహ మెహ్రా హెచ్చరించారు. ట్రోల్స్ విషయంలో ఇంకా అనేక మంది ఫిర్యాదు చేయలేకపోతున్నారని ఫిర్యాదు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

Advertisement

Next Story