Minister Uttam: రెండూ స్మార్ట్ కార్డు రూపంలోనే ఉంటయ్

by Gantepaka Srikanth |
Minister Uttam: రెండూ స్మార్ట్ కార్డు రూపంలోనే ఉంటయ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని బీపీఎల్ (దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న) కుటుంబాలన్నింటికీ కొత్త రేషను కార్డులు అందిస్తామని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) స్పష్టం చేశారు. కొత్త రేషను కార్డు(Ration Card)ల్ని ఇచ్చేందుకు అర్హులైన కుటుంబాల నుంచి వచ్చే నెలలో దరఖాస్తుల్ని ఆహ్వానిస్తామని, నెలాఖరుకు తుది ప్రక్రియ ఉంటుందన్నారు. అర్హతలను ఫైనల్ చేయడానికి త్వరలోనే మరోమారు సమావేశమవుతామని తెలిపారు. మంత్రి ఉత్తమ్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సబ్ కమిటీ జలసౌధలో సోమవారం సమావేశమై (4వ మీటింగ్) కొత్త రేషను కార్డులు, హెల్త్ కార్డుల(Health Card) జారీపైనా, దరఖాస్తులను ఆహ్వానించడంపైనా, అర్హతలను నిర్ణయించడంపైనా, విధివిధానాలను ఖరారు చేయడంపైనా చర్చించింది. కొత్తగా రేషను కార్డులు అందుకునేవారికి విధించాల్సిన అర్హతలను వచ్చే సమావేశంలో ఫైనల్ చేయనున్నట్లు మంత్రి ఉత్తమ్ తెలిపారు. త్వరలోనే ఈ సమావేశం జరుగుతుందన్నారు. ఈ రెండూ స్మార్ట్ కార్డు రూపంలోనే ఉంటాయన్నారు. రేషను కార్డులు కేవలం పౌర సరఫరాల దుకాణాల నుంచి రేషను వస్తువులు అందుకోడానికి మాత్రమేనని, ఆరోగ్య చికిత్సల కోసం విడిగా హెల్త్ కార్డుల్ని ఇస్తామన్నారు.

అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు కొత్త రేషను, హెల్త్ కార్డుల్ని జారీ చేసేందుకు ప్రభుత్వం ఈ కేబినెట్ సబ్ కమిటీని నియమించింది. ఆ లక్ష్య కార్యాచరణలో భాగంగా ఈ కార్డుల్ని జారీ చేయడానికి రూపొందించాల్సిన విధి విధానాలు, ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, నిబంధనలను అధ్యయనం చేసింది. పౌర సరఫరాలు, వైద్యారోగ్య శాఖ అధికారులు కొన్ని వివరాలు అందించారు. కొత్త కార్డులను ఇవ్వడంపై చర్చించారు. తాజాగా జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం వచ్చే నెలలో లబ్ధిదారుల నుంచి దరఖాస్తుల్ని స్వీకరించి జారీ చేయడానికి సంబంధించి తుది పక్రియను నెలాఖరులో పూర్తి చేయనున్నట్లు మంత్రి ఉత్తమ్ తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 89.96 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని, వీటి ద్వారా 2,81,70,000 మంది (2.81 కోట్ల మంది) లబ్ధి పొందుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి కుటుంబానికీ రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల్ని జారీ చేస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల సంఖ్య, కొత్త రేషన్‌ కార్డులు, హెల్త్ కార్డుల పంపిణీ, ఇతర మార్గదర్శకాలపై విస్తృతంగా చర్చించినట్లు తెలిపారు.

ప్రజా ప్రతినిధుల నుంచి సూచనలు :

వైట్ రేషను కార్డు, హెల్త్ కార్డు స్మార్ట్ కార్డు రూపంలోనే ఉంటాయని వివరించిన కేబినెట్ సబ్ కమిటీ సభ్యుడు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, వీటిని పొందడానికి ఎవరు అర్హులో తదుపరి సమావేశంలో ఫైనల్ చేస్తామన్నారు. ఇది ప్రజా ప్రభుత్వమైనందున అర్హత కలిగిన ప్రతీ కుటుంబానికి పారదర్శకంగా రేషన్ కార్డులు జారీ అవుతాయన్నారు. జారీ ప్రక్రియ ఎలా ఉండాలనే అంశంపై రాజకీయ పార్టీలు ప్రతినిదులతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు లేఖలు రాశామని గుర్తుచేశారు. కానీ ఇప్పటివరకు కేవలం 16 మంది నుంచే సూచనలు, సలహాలు వచ్చాయన్నారు. వాటిపై తాజా సమావేశంలో తాను, మంత్రి ఉత్తమ్, అధికారులు చర్చించామన్నారు. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ఇచ్చే సూచనల విషయంలో తమకు ఎలాంటి భేషజాలు ఉండవని, విలువైన సూచనలు వస్తే తప్పకుండా పరిగణలోకి తీసుకుంటామన్నారు. ఈ భేటీలో మంత్రులతో పాటు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, పౌర సరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్, జాయింట్ డైరెక్టర్ ప్రియాంకా ఆలా, పలువురు అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed