- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Cabinet Expansion: శ్రావణమాసంలోనే మంత్రివర్గ విస్తరణ..! టీపీసీసీ చీఫ్ పోస్టుకు వడబోత కంప్లీట్
దిశ, తెలంగాణ బ్యూరో : శ్రావణమాసంలో కాంగ్రెస్ హై కమాండ్ నేతలకు గుడ్‌న్యూస్ చెప్పనున్నది. ఈ నెలలోనే మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని గాంధీభవన్ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. వీటితో పాటు పీసీసీ అధ్యక్ష ఎంపిక, మిగిలిన నామినేటెడ్ పోస్టులు సైతం శ్రావణమాసంలోనే భర్తీ చేసే చాన్స్ ఉన్నట్టు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ సారి కొత్తగా రైతు, విద్యా కమిషన్లకూ చైర్మన్లు నియమించనున్నారు. వీరి పేర్లు ఇప్పటికే ఫైనల్ అయినట్టు సమాచారం. పార్టీలో పదవులు ఫిలప్ చేస్తుండడంతో ఆశావహులు ఇప్పటికే ఢిల్లీ బాట పట్టారు. మరి కొందరు తమ పేర్లు పరిశీలించాలని హైకమాండ్‌కు లేఖలు రాస్తున్నారు. సీఎం రేవంత్ అమెరికా టూర్ ముగియగానే ఈ పదవులన్నింటికీ భర్తీ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది.
ఇప్పటికే పేర్లు ఫిల్టర్ ?
మంత్రివర్గ విస్తరణతో పాటు పీసీసీ కొత్త ప్రెసిడెంట్, వివిధ కమిషన్లు, కార్పొరేషన్ల చైర్మన్‌ల పదవుల కోసం కాంగ్రెస్ పార్టీ కొన్ని పేర్లను ఫిల్టర్ చేసినట్లు సమాచారం. ఆయా లీడర్ల గురించి ప్రభుత్వ సలహాదారుడు వేంనరేందర్ రెడ్డి టీమ్ అన్ని జిల్లాల్లోని గ్రౌండ్ లెవల్ నేతల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నది. సీఎం కూడా కొన్ని పేర్లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, ఏఐసీసీ అనుమతి కోసం ప్రపోజల్స్ ఢిల్లీకి పంపినట్లు తెలిసింది. సీఎం రాగానే మరోసారి ఢిల్లీ పెద్దలతో చర్చించిన తర్వాత వరుసగా పదవుల ప్రకటన ఉంటుందని ఓ కీలక నేత వివరించారు. ఇక కార్పొరేషన్ పదవులు దక్కించుకునేందుకు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలతో పాటు, ఏఐసీసీ హామీలిచ్చిన లీడర్లు పోటీ పడుతున్నారు.
మరోవైపు మంత్రి వర్గ విస్తరణలో ఖాళీగా ఉన్న ఆరు బెర్త్‌ల కోసం సుమారు 10 మంది ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీ గట్టిగానే ట్రై చేస్తున్నారు. బీసీ కోటాలో బీర్ల ఐలయ్య, వాకిటి శ్రీహరి, ఎస్సీ కోటాలో వివేక్ వెంకటస్వామి, గడ్డం లక్ష్మణ్, రెడ్డి సామాజిక వర్గం నుంచి సుదర్శన్‌రెడ్డి, మల్‌రెడ్డి, రంగారెడ్డి, వెలమ నుంచి ప్రేమ్ సాగర్‌రావు, లంబాడా సామాజిక వర్గం నుంచి బాలు నాయక్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. దీంతో పాటు మైనార్టీ కోటాలో తనకు ఇవ్వాలని ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ సైతం తనదైన శైలీలో ప్రయత్నిస్తున్నారు. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్‌లో తనకు చాన్స్ ఇవ్వాలంటూ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కండువా కప్పుకున్న దానం నాగేందర్ హైకమాండ్‌ను కోరుతున్నారు. అయితే ఏఐసీసీ ఎవరికి ప్రమోషన్ కల్పిస్తుందనేది? త్వరలోనే తేలనున్నది.
పీసీసీ అధ్యక్ష రేసులో ఆ ఇద్దరు..
టీపీసీసీ అధ్యక్ష ఎంపిక సైతం దాదాపు ఖరారైనట్టు తెలుస్తున్నది. ఫైనల్ స్టేజ్‌లో ఎస్టీ సామాజిక వర్గం నుంచి బలరామ్‌నాయక్, బీసీ నుంచి మహేశ్‌కుమార్ గౌడ్ పేర్లు ఉన్నాయని, హైకమాండ్‌దే తుది నిర్ణయమని టీపీసీసీ సభ్యుడు ఒకరు తెలిపారు. ఈ ఇద్దరూ ఢిల్లీలో గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎస్టీ లంబాడాకు పీసీసీ పదవి ఇవ్వలేదని, ఈ సారి ఆ అవకాశం తనకు కల్పించాలని బలరామ్ నాయక్ కోరుతున్నారు. ఇక తాను 35 ఏళ్లుగా పార్టీలో విధేయుడిగా వివిధ హోదాల్లో పని చేశానని, తనకే పీసీసీ పదవి ఇవ్వాలని మహేశ్‌కుమార్ గౌడ్ ప్రయత్నాల్లో ఉన్నారు. ఆయన పారిస్ వెళ్లేకంటే ముందు మూడు రోజుల పాటు ఢిల్లీలోనే మకాం వేసినట్లు తెలిసింది. మరోవైపు ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ సైతం పీసీసీ పదవి కోసం అగ్రనేతల చుట్టూ తిరుగుతున్నట్టు సమాచారం. అయితే పీసీసీ అధ్యక్షుడితో పాటు కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్‌లను ఏఐసీసీ ప్రకటించే అవకాశం ఉన్నది. మరి ఏయే పదవులు ఎవరికి వరిస్తాయో అనేది చూడాల్సి ఉన్నది.
ఆ ముగ్గురి పేర్లు దాదాపు ఫైనల్..?
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫస్ట్ టైమ్ అందుబాటులోకి తీసుకురానున్న రైతు, విద్యా కమిషన్లకూ చైర్మన్లను నియమించనున్నారు. రైతు కమిషన్‌కు కాంగ్రెస్ సీనియర్ లీడర్ కోదండరెడ్డి, విద్యా కమిషన్‌కు రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి పేర్లు దాదాపు ఫైనల్ అయినట్టు సమాచారం. ఒక్కొ కమిషన్‌కు నలుగురు మెంబర్లు చొప్పున ఈ రెండింటి కోసం 8 మందికి సభ్యుల హోదా ఇవ్వనున్నారు. దీంతో పాటు వచ్చే నెలలో ఖాళీ కానున్న బీసీ కమిషన్‌నూ భర్తీ చేయనున్నారు. దీనికి కాంగ్రెస్ సీనియర్ నేత జి.నిరంజన్ పేరు దాదాపు ఫైనల్ అయినట్టు తెలుస్తోంది. ఈ కమిషన్‌లోనూ కొత్త మెంబర్లు రానున్నారు. అంతేగాక సమాచార హక్కు, హ్యూమన్ రైట్స్ కమిషన్లను కూడా ఈ నెలలోనే భర్తీ చేయాలని పార్టీ ప్లాన్ చేస్తున్నది.