లిక్కర్ స్కాం మీద కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదు: RSP

by GSrikanth |   ( Updated:2022-12-04 14:21:09.0  )
లిక్కర్ స్కాం మీద కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదు: RSP
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రతి అంశం పట్ల గంటల తరబడి పత్రికా సమావేశాలు పెట్టి మాట్లాడే ముఖ్యమంత్రి కేసీఆర్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న లిక్కర్ స్కాం పై ఎందుకు పెదవి విప్పడం లేదని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో పులి బిడ్డలు అని ప్రకటించిన సీఎం, లిక్కర్ స్కాంలో కూతురిని కాపాడడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఆదివారం ఖమ్మం జిల్లాలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. శ్రీకాంతాచారి వంటి ఎంతోమంది అమరుల తెలంగాణ నేడు స్కాంల తెలంగాణగా మారిందన్నారు. విద్య, ఉద్యోగాలు, పారదర్శక పరిపాలనకు చిరునామా కావాల్సిన తెలంగాణ, నేడు మోసాలు, అవినీతి తెలంగాణకు చిరునామాగా మారిందన్నారు. వందల కోట్ల అవినీతి జరిగిన కేసులో సీబీఐ కూడా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందన్నారు. చిన్న చిన్న కేసులకు అరెస్టు చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించే అధికారులు, కవిత కేసులో ఎందుకు తాత్సారం చేస్తున్నారని నిలదీశారు.ఆధారాలు కూడా దొరకకుండా మొబైల్ ఫోన్స్ ధ్వంసం చేసిన వారిని అరెస్టు చేసి విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

మరోపక్క బీజేపీ పార్టీకి చెందిన బీఎల్ సంతోష్ వందలకోట్లతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని చూస్తే ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. ఆపరేషన్ ఆకర్ష్ కార్యక్రమం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఈ దేశాన్ని అవినీతిపరులు, నేరస్థులు పాలిస్తున్నారని ఆరోపించారు. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తుంటే, బీజేపీ ప్రభుత్వం కనీసం బీసీ కులగణన చేయడం లేదని విమర్శించారు. తమిళనాడు, జార్ఖండ్, ఛత్తీస్ ఘడ్ లలో పెంచిన విధంగా.. తెలంగాణలో కూడా రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లాలో బీఎస్పీ పార్టీ దూసుకుపోతుందని, రాబోయే ఎన్నికల్లో బీఎస్పీ పార్టీ ఖమ్మంలో విజయకేతనం ఎగురవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

Next Story