- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తమిళనాడుకు బీఆర్ఎస్ టీమ్.. డీఎంకే పార్టీ నిర్మాణంపై స్టడీ..?
దిశ, తెలంగాణ బ్యూరో: గులాబీ పార్టీని పటిష్టపరచడంపై అధిష్టానం ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే ప్రాంతీయ పార్టీల అధ్యయనానికి శ్రీకారం పెట్టబోతోంది. డీఎంకే పార్టీ నిర్మాణంపై స్టడీ చేసేందుకు తమిళనాడుకు త్వరలోనే వెళ్లేందుకు సిద్ధమవుతోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో నేతల బృందం వెళ్లి ప్రాంతీయ పార్టీల ఫంక్షనింగ్‌పై వివరాలను సేకరించనున్నట్టు సమాచారం. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇటీవలే బాల్క సుమన్ బృందం చెన్నై వెళ్లి వచ్చింది.
తమిళనాడుకు పది మంది గులాబీ లీడర్లు
రాష్ట్రంలో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న బీఆర్ఎస్.. దేశ రాజకీయాల్లో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ప్రాంతీయ పార్టీల పనితీరును నిశితంగా పరిశీలించిన తో పాటు ఆ పార్టీల విధివిధానాలు, తీసుకున్న నిర్ణయాలను స్టడీ చేసేందుకు సిద్ధమవుతోంది. ‘ఉద్యమం సమయం నుంచి బీఆర్ఎస్ పార్టీ ఉండకూడదని చాలా కుట్రలు చేశారు.. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా 2014లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి పదేండ్ల పాటు అధికారంలో ఉన్నాం, 24 ఏండ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ విజయవంతంగా కొనసాగింది, మరో 50 ఏండ్లు కొనసాగేటట్టు బలంగా తయారు చేసుకుందాం’ అని ఈ నెల 15న కేటీఆర్ ప్రకటించారు. అందుకోసం కసరత్తును ప్రారంభించారు. తమిళనాడులో ప్రాంతీయ పార్టీగా అవతరించి నేటికీ దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తున్న ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) పార్టీ నిర్మాణం తెలుసుకోవాలని భావిస్తోంది. పదిమంది సీనియర్ నాయకుల బృందం అక్కడికి వెళ్లనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు డీఎంకే నిర్మాణంపై స్టడీ
తమిళనాడులో డీఎంకే పార్టీ సుధీర్ఘకాలం ఆ రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటం చేసింది. పదేండ్ల తర్వాత ఆ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేశారు. సుమారు 75 ఏండ్లుగా తమిళనాడు రాజకీయాలను డీఎంకే శాసిస్తోంది. ఈ పార్టీ ఎత్తుపల్లాలను ఎలా అధిగమించిందనే అంశాన్ని అధ్యయనం చేసేందుకు బీఆర్‌ఎస్ ఆసక్తి చూపుతోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని 10 మంది పార్టీ సీనియర్ నేతల బృందం సెప్టెంబర్‌లో చెన్నయ్‌లో పర్యటించనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. క్షేత్ర స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు డీఎంకే సంస్థాగత నిర్మాణం తో పాటు ఇతర అంశాలను వారం రోజుల పాటు అధ్యయనం చేయనుంది.
పశ్చిమ బెంగాల్, ఒడిశాకు సైతం
ప్రాంతీయ పార్టీల పనితీరును ప్రత్యక్షంగా పరిశీలించేందుకు బీఆర్ఎస్ నేతలు పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్, ఒడిశాలో బిజూ జనతాదళ్ (బీజేడీ) తీరుతెన్నులను కూడా అధ్యయనం చేయబోతున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. కేటీఆర్‌తో పాటు బృందంలో కొందరు యువ నేతలు ఉంటారని తెలిసింది. ఇటీవల మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ నేతృత్వంలో ఆంజనేయ గౌడ్, తుంగ బాలు వంటి యువ నేతలు చెన్నైలోని డీఎంకే ప్రధాన కార్యాలయం ‘అన్నా అరివాలయం’ను సందర్శించారు. పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శిగా ఉన్న ఆర్‌ఎస్ భారతితో భేటీ అయ్యి.. పార్టీ సంస్థాగత నిర్మాణం, అనుబంధ విభాగాలైన యువజన, విద్యార్థి, మహిళా విభాగాల పనితీరు, సోషల్ మీడియా వింగ్ వివరాలను సేకరించారు. పార్టీతో కేడర్ మమేకమైన తీరు, క్షేత్ర స్థాయిలో పార్టీ కార్యకలాపాలు తదితరాలపై ఆరా తీశారు.
తిరువల్లువర్, పశ్చిమ చెన్నై జిల్లాల్లోనూ పర్యటించారు. పూర్తి వివరాలు పార్టీ అధిష్టానానికి అందజేశారు. బీఆర్ఎస్‌కు గ్రామస్థాయి నుంచి రాష్ట్ర కమిటీల వరకు పూర్తి కమిటీలు లేకపోవడంతో వాటిని వేయాలని పార్టీ భావిస్తున్నట్లు తెలిసింది. పార్టీ కేడర్‌కు సైతం శిక్షణ కార్యక్రమాలు చేపట్టడంతో పాటు ప్రభుత్వ వైఫల్యాలపై ఎలా పోరాడాలనే అంశాలపై కార్యాచరణ ఇవ్వనున్నట్లు సమాచారం. ఇతర రాష్ట్రాలను, ప్రాంతీయ పార్టీలను స్టడీ చేసిన తర్వాత అక్కడి నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్‌తోనే పార్టీ బలోపేతానికి ప్రణాళికలు రూపొందించి ముందుకెళ్లేందుకు సిద్ధమవుతోంది. పార్టీ బలోపేతంపై ఎలా ముందుకు వెళ్తారనేది చూడాలి.