- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విలీనమా.. పొత్తు కోసమా..!.. బీజేపీతో బీఆర్ఎస్ రహస్య మంతనాలు?
దిశ, తెలంగాణ బ్యూరో : బీజేపీతో బీఆర్ఎస్ దోస్తీ కట్టాలని అనుకుంటున్నదా?.. వీలైతే పార్టీని విలీనం చేయాలని అనుకుంటున్నదా?.. గడ్డు పరిస్థితుల నుంచి బయట పడేందుకు ఈ మార్గం తప్ప మరొకటి కనిపించడం లేదా?.. కేటీఆర్, హరీశ్‌రావ్ ఢిల్లీ వెళ్లింది ఇందుకోసమేనా?.. డీల్ కుదిరితే కాంగ్రెస్‌లోకి వెళ్లే వలసలకు బ్రేక్ వేయొచ్చని అనుకుంటున్నదా?... ఢిల్లీ లిక్కర్ కేసులో కల్వకుంట్ల కవితకు బెయిల్ ద్వారా రిలీఫ్ వస్తుందా?.. రాష్ట్ర ప్రభుత్వం జరిపిస్తున్న ఎంక్వయిరీల నుంచీ ఉపశమనం లభిస్తుందని భావిస్తున్నదా?... ఫోన్ ట్యాపింగ్‌లో ఇరుక్కుపోకుండా చూసుకోవచ్చా?.. ఇవీ ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ చర్చలు. బీజేపీకి దగ్గర కావడం ద్వారా కొన్ని చిక్కుల నుంచి తప్పించుకోవచ్చన్నది బీఆర్ఎస్ భావన. లోక్‌సభ ఎన్నికల టైంలో చిగురించని స్నేహాన్ని ఇప్పుడు సాకారం చేసుకునే దిశగా గులాబీ పార్టీ ప్రయత్నాలు షురూ చేసినట్టు తెలుస్తున్నది.
ఇప్పట్లో ఎన్నికలు లేకపోయినా, బీఆర్ఎస్‌కు లోక్‌సభలో ఒక్క ఎంపీ లేకపోయినా, పొత్తుల అవసరం లేకపోయినా ఈ రెండు పార్టీల మధ్య ఏదో ఒక రూపంలో దోస్తీ కుదరుతుందని గులాబీ లీడర్లు భావిస్తున్నారు. పొత్తులు, విలీనంతో ఏ పార్టీకి ఎంత లాభం.. అనే చర్చలు ఎలా ఉన్నా వీలైనంత తొందరగానే ఈ రెండు పార్టీల మధ్య ఈక్వేషన్లు మారొచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి. రానున్న నాలుగున్నరేళ్ల పాటు పార్టీని నడిపించడంలోని చిక్కులను దృష్టిలో పెట్టుకుని కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి దగ్గరైతే కొన్ని ఇబ్బందుల నుంచి గట్టెక్కొచ్చని గులాబీ లీడర్ల అభిప్రాయం. తిహార్ జైల్లో ఉన్న కవితతో ములాఖత్ అంటూ ఢిల్లీ వెళ్లిన కేటీఆర్, హరీశ్‌రావులు ఢిల్లీలో బీజేపీకి చెందిన ఎవరెవరితో ఎలాంటి మంతనాలు జరిపారన్నది ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. కేసీఆర్ ఇచ్చే ఫీడ్‌బ్యాక్‌తో మరోసారి హస్తిన బాట తప్పదేమోననే మాటలూ వినిపిస్తున్నాయి.
ఎన్నడూ లేనంత చిక్కుల్లో గులాబీ బాస్
అసెంబ్లీ ఎన్నికల్లో పవర్ కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నది. గెలిచిన ఎమ్మెల్యేలను నిలబెట్టుకోలేకపోతున్నది. పార్టీని వీడొద్దంటూ వారిని ఎంత బుజ్జగించినా ఇప్పటికే ఆరుగురు చేజారిపోయారు. మరో ఆరుగురు ఎమ్మెల్సీలు సైతం కాంగ్రెస్ గూటికి చేరారు. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒక్కరిని సైతం గెలిపించుకోలేపోయింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన రెండు జ్యుడీషియల్ కమిషన్ల విచారణను కేసీఆర్ ఎదుర్కోక తప్పదనే వాతావరణమూ నెలకొన్నది. ఫోన్ ట్యాపింగ్ విషయంలో భవిష్యత్తులో ఏం జరగబోతుందనే ఆందోళన వెంటాడుతున్నది. రానున్న నాలుగున్నరేళ్ల పాటు రాష్ట్రంలో పార్టీని కాపాడుకోవడం సవాలుగా మారింది. నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్నా కాంగ్రెస్ చేపట్టిన ‘ఆపరేషన్ ఆకర్ష్’కు కేసీఆర్ బ్రేకులు వేయలేని నిస్సహాయతలో పడ్డారు.
బీజేపీతో స్నేహం బీఆర్ఎస్‌కు అనివార్యం
రాష్ట్రంలో కాళేశ్వరం కరప్షన్, చత్తీస్‌గఢ్ కరెంటు కొనుగోళ్లు, రెండు థర్మల్ ప్లాంట్ల నిర్మాణంలో అవకతవకలు, ఢిల్లీ లిక్కర్ కేసులో కుమార్తె కవిత ఎదుర్కొంటున్న జైలు శిక్ష... వీటన్నింటి నుంచి బయట పడేందుకు రాజకీయంగా బీఆర్ఎస్‌కు మద్దతు అనివార్యమవుతున్నది. రాష్ట్రాన్ని ఇచ్చినా పదేండ్ల పాటు రాష్ట్రంలో జీరో అయిపోయిందనుకున్న కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో బీఆర్ఎస్ ఆశలు గల్లంతయ్యాయి. రాష్ట్రంలోని కేసుల నుంచి గట్టెక్కాలంటే బీజేపీ సహకారం అనివార్యమన్న ఆత్మరక్షణలో పడింది. మరోవైపు ప్రజల్లో పార్టీ పట్ల విశ్వాసం సన్నగిల్లడం, రుణమాఫీ ఏకకాలంలో అమలైతే గ్రామాల్లో కనీస స్థాయిలో ఉన్న గ్రౌండ్ మొత్తం పోతుందనే భయం, కేడర్ సైతం దూరమవుతారనే ఆందోళన... ఇవన్నీ ఆ పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది. బీజేపీకి దగ్గరైతే కొంతైనా ఉపశమనం లభిస్తుందన్న ఆలోచనకు వచ్చినట్లు గులాబీ లీడర్ల సమాచారం.
ఢిల్లీ నుంచి రాగానే కేసీఆర్‌తో భేటీ
ఆరు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించిన కేటీఆర్, హరీశ్‌రావు హైదరాబాద్ చేరుకున్న వెంటనే ఎర్రవల్లి ఫామ్‌హౌజ్‌కు వెళ్లి కేసీఆర్‌కు బ్రీఫింగ్ చేశారు. ఢిల్లీలో బీజేపీ నేతల్లో వీరిద్దరూ ఎవరెవరిని కలిశారనేది గోప్యంగా ఉండిపోయినా దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు జరిగాయన్న వార్తలు మాత్రం తెలంగాణలో గుప్పుమన్నాయి. చివరకు పార్టీని విలీనం చేయడానికైనా రెడీ అనే సంకేతాన్ని వారిద్దరూ ఇచ్చారనేది ఈ వార్తల్లో కీలకమైన అంశం. అయితే విలీనం చేసుకోడానికి, పొత్తు పెట్టుకోడానికి బీజేపీలోని ఒకరిద్దరు సీనియర్లు ససేమిరా అన్నట్లు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల టైంలో ‘భ్రష్టాచార్ పార్టీ, ఏటీఎం కరప్షన్, పరివార్‌వాదీ పార్టీ, తిన్నదంతా కక్కిస్తాం, ఎన్నడూ ఆ పార్టీతో పొత్తు ఉండదు’... ఇలాంటి కామెంట్లను స్వయంగా ప్రధాని మోడీ, అమిత్ షా చేయడంతో ఇప్పుడు ఆ పార్టీతో పొత్తు, విలీనం చర్చలు జరపడం అర్థరహితమనేది ఆ సీనియర్ల వాదన.
కవిత చుట్టూ గులాబీ పాలిటిక్స్
ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను బెయిల్‌పై బయటకు తీసుకురావడం కేసీఆర్‌కు ఛాలెంజ్‌గా మారింది. ఆమెను అప్రూవర్‌గా మారాలని బీజేపీ సూచించినట్లు తెలిసింది. కానీ ఈ ప్రతిపాదనను కవిత వ్యతిరేకించారని, అదే జరిగితే ఈ కేసులో తన పాత్ర ఉందని పరోక్షంగా ఒప్పుకోవడమే అవుతుందని వ్యాఖ్యానించినట్లు తెలిసింది. మొదటి నుంచీ ఈ కేసు రాజకీయ ప్రేరేపితం అంటూ స్వయంగా కవిత వ్యాఖ్యానించిన నేపథ్యంలో అప్రూవర్‌గా మారేందుకు సిద్ధపడలేదని సమాచారం. ఆమె అప్రూవర్‌గా మారితే కేజ్రీవాల్‌ను జైల్లోనే ఉంచొచ్చని, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీని మట్టి కరిపించొచ్చన్నది బీజేపీ వ్యూహం. ఫలితంగా ఆ రాష్ట్రంలో బీజేపీ పవర్‌లోకి రావడానికి మార్గం సుగమం అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో విలీనం చేస్తే కేంద్రంలో మంత్రిపదవితో పాటు రాష్ట్ర అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా పదిలంగా ఉంటుంది.
ప్రశ్నార్థకంగా పార్టీ భవిష్యత్తు
ఇప్పటికే ప్రజల్లో పునాదిని కోల్పోతున్న బీఆర్ఎస్... సమీప భవిష్యత్తులో రుణమాఫీ అమలైతే మొత్తానికే పోతుందని భయపడుతున్నది. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో కనీస స్థాయిలో గెలవలేమని, గెలిచినా జెడ్పీటీసీ మొదలు పంచాయతీ వార్డు మెంబర్ వరకు నిలబెట్టుకోలేమనే ఆలోచనతో ఉన్నది. మళ్లీ అసెంబ్లీ ఎన్నికల వరకు పార్టీని నడిపించడం కత్తిమీద సాములా మారుతుందని, ఏకకాలంలో బీజేపీ, కాంగ్రెస్‌లను ఢీకొట్టడం కష్టసాధ్యమవుతుందని, అందువల్లే బీజేపీతో పొత్తు పెట్టుకోవడమో, విలీనం చేయడమో సమంజసంగా ఉంటుందన్న వాదన గులాబీ పార్టీలో బలంగా వినిపిస్తున్నది. ఇప్పటికే పార్టీ పేరును మార్చడం ద్వారా సరిదిద్దుకోలేని తప్పిదం జరిగిందని భావిస్తున్న ఆ పార్టీ నేతలు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయంపై ఫోకస్ పెట్టారు.
బీజేపీకి వచ్చే ప్రయోజనమేంటి?
అసెంబ్లీ సమావేశాల్లో ‘ప్రళయ గర్జన’ ఉంటుందంటూ కేసీఆర్ ఇటీవల ఒకింత ధీమాతో చెప్పినా ఎంత మంది ఎమ్మెల్యేలు మిగులుతారనే సందేహం ఆయన్ను వెంటాడుతున్నది. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు లభించినా ఈ నెల చివరలో బడ్జెట్ సెషన్ ప్రారంభమయ్యే సమయానికి ఏమవుతుందోననే గుబులు ఆ పార్టీకి పట్టుకున్నది. నిన్నమొన్నటి వరకు తన వెనక నైతికంగా నిలబడిన ఎమ్మెల్యేలు ఇప్పుడు కాంగ్రెస్‌వైపు వెళ్లి పోతే సింగిల్ డిజిట్‌తో అటు అసెంబ్లీ వేదికగా అధికార పార్టీతో కొట్లాడడం... మరోవైపు కేసుల నుంచి తప్పించుకోవడం ఆ పార్టీకి తక్షణ సవాలుగా మారనున్నది. బీజేపీలో బీఆర్ఎస్‌ను విలీనం చేయడం.. లేదా పొత్తు పెట్టుకుని దగ్గర కావడం ద్వారా కేసీఆర్‌కు పెద్ద రిలీఫ్ లభిస్తుంది. దీనికి బదులుగా కేజ్రీవాల్‌ను ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయంగా దెబ్బ కొట్టడానికి లిక్కర్ కేసులో కవితను అప్రూవర్‌గా మార్చడం ద్వారా పొలిటికల్ టార్గెట్ రీచ్ కావచ్చన్నది బీజేపీ ఉద్దేశం.
కేసీఆర్, కేటీఆర్ భవిష్యత్తు ఏంటి?
రెండు జాతీయ పార్టీలకు ప్రత్యామ్నాయంగా దేశ స్థాయిలో చక్రం తిప్పుతానని కేసీఆర్ గతంలో ప్రకటించి కొన్ని ప్రయత్నాలు చేసినా అర్ధంతరంగా ఆగిపోయాయి. ప్రాంతీయ పార్టీలదే భవిష్యత్తు అని నొక్కిచెప్పినా ఇప్పుడు తన ఆలోచనను మార్చుకుంటున్నారేమో అని ఆ పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. బీజేపీతో పొత్తు లేదా విలీనంతో కేసీఆర్ రాజ్యసభ సభ్యుడిగా కేంద్ర మంత్రివర్గంలో చేరుతారని, రాష్ట్రంలో అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కేటీఆర్ ఉంటారని ఢిల్లీ టూర్ సందర్భంగా ఇద్దరూ వారి అభిప్రాయాన్ని వెల్లడించినట్లు తెలిసింది. ఆరు రోజుల ఢిల్లీ టూర్‌లో ప్రాథమిక స్థాయిలో జరిగిన ఈ రెండు పార్టీ నేతల మధ్య చర్చలు రానున్న రోజుల్లో ఎలాంటి ముగింపునకు చేరుకుంటాయన్నది కాలమే తేల్చనున్నది.
రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు : వినోద్‌కుమార్, మాజీ ఎంపీ
‘ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్‌యూ వరకు ఎవరితోనైనా కలవడానికి సిద్ధం... అని కేసీఆర్ 2001లోనే చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం సమయంలోనూ చాలాసార్లు దీన్ని నొక్కి చెప్పారు. ఇప్పటికీ ఆయన వైఖరి ఇలాగే ఉన్నది. రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగొచ్చు. తాజా పరిణామాలను ఔను.. అని చెప్పలేం... అలాంటిది జరగదని తోసిపుచ్చలేం... కానీ ఇప్పుడు ఎలాంటి ఎన్నికల్లేవ్.. పొత్తులు పెట్టుకునే అవసరమూ ఉండదు.. కవిత కేసు కేవలం ఆమెకు మాత్రమే సంబంధించిన అంశం కాదు. ఇందులో కేజ్రీవాల్ సహా చాలా మందిపై దర్యాప్తు సంస్థలు అభియోగాలు మోపాయి. ఒక మహిళగా ఆమెకు బెయిల్ రావచ్చనే అనుకుంటున్నాం. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాలేదు. కానీ ఎల్లకాలం అలాంటి పరిస్థితే ఉంటుందని భావించలేం. అంతా క్లోజ్ అయిందనుకున్న కాంగ్రెస్ ఇప్పుడు పవర్‌లోకి వచ్చింది. రేపు బీఆర్ఎస్ సైతం ఇదే స్థాయిలో పుంజుకోవచ్చు’