- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నకిలీ లిక్కర్ వ్యాపారంలో BRS ప్రజాప్రతినిధులు..?
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో మద్యం అమ్మకాలు పెరుగుతున్నట్టే.. నకిలీ మద్యం కూడా అంతే స్థాయిలో పోటీ పడుతోంది. మద్యం గిరాకీని అనుకూలంగా మల్చుకున్న వ్యాపారులు.. ప్రభుత్వాన్ని బురిడీ కొట్టిస్తున్నారు. వైన్‌షాపులు నిత్యం కళకళలాడుతున్నా.. రోజువారీ మద్యం విక్రయాలు నామమాత్రంగానే చూపిస్తున్నారు. కానీ, లక్షల కొద్ది విలువైన నకిలీ మద్యాన్ని మద్యం ప్రియులకు అమ్ముతున్నారు. ఈ నకిలీ మద్యం వ్యాపారం వెనుక గులాబీ పెద్ద లీడర్లే ఉన్నట్లు అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలోనూ ఈ వ్యాపారంపై పరిశోధించే అధికారులపైనా ఒత్తిళ్లు వస్తున్నట్లు అధికారులే చెప్తున్నారు. ఏకంగా ఓ మంత్రి సోదరుడు సదరు ఎక్సైజ్ అధికారులపై బెదిరింపులకు కూడా పాల్పడుతున్నారనే విమర్శలున్నాయి. ఇక, ఒడిశా పేరుతో నకిలీ మద్యాన్ని విక్రయిస్తున్న బాలరాజ్గౌడ్కు గులాబీ పెద్దలు, ప్రజాప్రతినిధులు, అమాత్యులతోనే సన్నిహిత సంబంధాలున్నట్లుగా అధికారులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. బాలరాజ్ గౌడ్ ఇటీవల ఓ మంత్రి అండతో ఓ అసోసియేషన్ వివాదాల్లోనూ తలదూర్చినట్లు సైతం ఆరోపణలున్నాయి. బాలరాజ్గౌడ్కు పెద్ద ఎత్తున సంబంధాలు ఉండటంతో.. వెనక ఉన్న అదృశ్య హస్తాలను పసిగట్టే పరిశోధనకు ప్రస్తుతం బ్రేక్పడిందనే ప్రచారం జరుగుతోంది.
ఒడిశా పేరు.. లోకల్ గానే రెడీ
ఇటీవల రాష్ట్రంలో భారీగా నకిలీ మద్యం పట్టుబడుతోంది. ఎస్ఓటీ పోలీసుల తనిఖీల్లో ముందుగా కొంత కొంత దొరికినా.. ఆ తర్వాత భారీ డంపులు వెలుగులోకి వస్తున్నాయి. ఈ విషయాలు వెలుగులోకి వస్తుండటంతో.. అధికారులు నకిలీ మద్యాన్ని పట్టుకున్నట్లు ప్రకటించక తప్పడం లేదు. కానీ, అప్పటికే చాలా ఒత్తిళ్లు వస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ తర్వాత రంగారెడ్డి, వరంగల్, నల్గొండ జిల్లాల్లో నకిలీ మద్యం సరఫరా చేస్తోన్న భారీ డంపు ఇటీవల గుట్టురట్టయ్యింది. 3078 లీటర్ల అక్రమ, నకిలీ మద్యం ఒడిశా కేంద్రంగా సాగుతున్నట్లు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రకటించారు. మద్యం వ్యాపారి బింగి బాలరాజుగౌడ్ నేతృత్వంలో అక్రమ మద్యం దందా సాగుతున్నట్టు తేలింది. రాష్ట్రంలోని మద్యం దుకాణాలకు సప్లై చేసేందుకు సిద్ధంగా ఉన్న రూ.10 కోట్ల విలువైన నకిలీ మద్యం దొరకింది. కానీ, ఇంకా చాలా మేరకు డంపులు ఉన్నాయని, వందల సంఖ్యలో దుకాణాలకు నకిలీ మద్యం సరఫరా అయినట్లు కూడా తెలుస్తోంది. ఒడిశా కేంద్రంగా తయారీ చేస్తున్నట్లు చెప్తున్నా.. లోకల్‌గానే భారీస్థాయిలో తయారీ కేంద్రాలున్నాయని పోలీసులు సైతం అనుమానిస్తున్నారు.
రాష్ట్రమంతా సప్లై
బింగి బాలరాజుగౌడ్ నేతృత్వంలో అక్రమ మద్యం దందా సాగుతున్నట్టు గుర్తించగా, బాలరాజుగౌడ్‌కు చెందిన ఎస్‌వి వైన్స్‌ను సీజ్‌చేశారు. నారాయణపూర్ మండలంలో బాలరాజుకు చెందిన వైన్‌షాప్ లైసెన్స్‌ను రద్దు చేశారు. నకిలీ మద్యాన్ని తయారు చేసి, రాష్ట్రంలోని వైన్ షాపులన్నింటికీ సరఫరా చేస్తున్నట్లు అనుమానాలున్నాయి. వేల లీటర్లను రెడీ చేసి, ఒకేచోట విక్రయించకుండా.. ఇతర ప్రాంతాలు, రద్దీ ఎక్కువగా ఉండే వైన్‌షాపుల్లో అమ్మకం సాగిస్తున్నారు. దీనికి మద్యం సిండికేట్దారులను వాడుకుంటున్నారు.
వ్యాపారులు.. వారి వెనక ప్రజాప్రతినిధులు
రాష్ట్రంలో దాదాపు లిక్కర్షాపుల్లో మెజార్టీ వాటాలు అధికార పార్టీలోని ప్రజాప్రతినిధులకు ఉన్నాయి. కొంతమంది ఎమ్మెల్యేలు, వారి బంధువుల పేరుతో షాపులను నడుపుతున్నారు. అయితే, ప్రజాప్రతినిధుల అండదండలు ఉండటంతో.. ఈ దుకాణాల్లో నకిలీ మద్యం విక్రయిస్తున్నారు. బేవరేజెస్కార్పొరేషన్ నుంచి లిమిట్‌గా మద్యాన్ని కొనుగోలు చేసి, అదేస్థానంలో విచ్చలవిడిగా నకిలీ మద్యాన్ని అమ్ముతున్నారు. కొన్ని దుకాణాల్లో జరుగుతున్న విక్రయాలు, డిపోల నుంచి తరలిస్తున్న మద్యానికి చాలా తేడాలు ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. నిత్యం రద్దీగా ఉంటున్నా.. ప్రభుత్వానికి చూపుతున్న లెక్కల్లో మాత్రం తక్కువ విక్రయాలు ఉంటున్నాయని అధికారులు అనుమానిస్తున్నారు. ఇలాంటి కొన్ని వైన్‌షాపులను సైతం గుర్తించారు. కానీ, వాటిపై రైడ్ చేసేందుకు జంకుతున్నారు. ఎందుకంటే అలాంటి షాపులన్నీ గులాబీ నేతలు, ఇతర పార్టీ నేతల చేతుల్లోనే ఉన్నాయి.
30 శాతం కల్తీ మద్యమే
మద్యం వ్యాపారులు.. వారికి సహాకరిస్తూ ప్రజాప్రతినిధులు మద్యం ప్రియుల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. ప్రాణం తీసే కెమికల్స్‌తో మందును మిక్స్‌చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. ఎక్స్‌పర్టులను పెట్టుకుని మరీ దందా చేస్తున్నాయి. అమ్మేదాంట్లో 30% తక్కువ కాకుండా కల్తీ మద్యాన్ని జనానికి అంటగడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో మొత్తం 2,620 వైన్‌షాపులుండగా, దాదాపు వెయ్యికిపైగా దుకాణాల్లో కల్తీ మద్యం దందా నడుస్తోంది. స్థానికంగా కేంద్రాలు ఏర్పాటు చేసి, నీటిలో చక్కెరను ఉడకబెట్టి అందులో కెమికల్స్, క్లీనింగ్ఫ్లూయిడ్స్, నెయిల్పాలిష్రిమూవర్, కార్లను తుడవడానికి వాడే క్రీమ్స్ వంటి వాటిని కలిపి మందుతో మిక్స్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కానీ, ఈ విషయాన్ని బయటకు చెప్పేందుకు జంకుతున్నారు. ప్లాస్టిక్ బాటిళ్లలో దొరికే ప్రీమియం బ్రాండ్ల నుంచి మందు తీసి కల్తీకి పాల్పడుతున్నారు. కొన్నిచోట్ల బీర్లలోనూ కల్తీ జరుగుతోంది. చక్కెరతో పాటు వివిధ కెమికల్స్ కలిపిన నీటికి షాంపూ పౌడర్, కుంకుడు కాయ రసం కలిపి బాటిళ్లలో పోస్తున్నారు. దానికి నిమ్మరసం బండ్లపై వాడే సోడాను పోసి మూతలు పెట్టేసి అమ్ముతున్నారు.
ఈఎస్‌లకు ఆఫర్స్
ఇటీవల నకిలీ మద్యం విక్రయాలు పెరుగుతున్నట్లు గుర్తించిన అధికారులు కొన్నిచోట్ల దాడులు మొదలుపెట్టారు. కానీ, వీటిని అడ్డుకునేందుకు కూడా గులాబీనేతలు రంగంలోకి దిగుతున్నారు. ఇటీవల ఓ ఎక్సైజ్ కమిషనర్(ఈఎస్)కు ఓ మంత్రి సోదరుడు బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు అధికారుల్లో ప్రచారం జరుగుతోంది. నకిలీ మద్యంపై తనిఖీలు నిలిపివేయాలని, దానికి ప్రతిఫలం ఉంటుందని ఆశ చూపించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, వినకుండా ఉంటే బెదిరింపులకు గురి చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు.
Also Read..