లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు రాదు..మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

by Prasad Jukanti |   ( Updated:2024-05-02 09:40:38.0  )
లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు రాదు..మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో:వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జోస్యం చెప్పారు. బీఆర్ఎస్, బీజేపీకి ఓటు వేస్తే మురికి కాల్వలో వేసినట్లేనని అన్నారు. గురువారం నల్గొండ జిల్లా మోతెలో ఎన్నికల సన్నాహక సమావేశంలో మాట్లాడిన ఉత్తమ్ కుమార్ రెడ్డి మతాన్ని అడ్డుపెట్టుకుని బీజేపీ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. ఆ పార్టీకి ఓటు వేస్తే రిజర్వేషన్లకు ముప్పు ఏర్పడటం ఖాయం అన్నారు. ఓట్ల కోసం విద్వేషాలు రెచ్చగొడుతున్న ఆ పార్టీ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలంగాణకు వస్తున్న మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా పదేళ్లలో తెలంగాణకు ఏమిచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. పదేళ్లపాటు రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీకి తెలంగాణలో ఓటు అడిగే హక్కు లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులమంతా ఒక క్రికెట్ టీమ్ మాదిరిగా సమిష్టి నిర్ణయాలతో, సమిష్టి నాయకత్వంలో ప్రజలకు మేలు చేసే విధంగా ముందుకు వెళ్తున్నామన్నారు. రిజర్వేషన్ల పరిరక్షణతో పాటు అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉండే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు.

Advertisement

Next Story