- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BRS: రేవంత్ కాకుండా వేరే వ్యక్తి సీఎం పదవిలో ఉంటే ఎలా ఉంటుంది?
దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వ(Congress Government) పనితీరుపై బీఆర్ఎస్(BRS) పార్టీ సర్వే నిర్వహిస్తున్నది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ పాలన, హామీల తీరుపై ప్రజాభిప్రాయాలను సేకరిస్తున్నది. గతంలో బీఆర్ఎస్ హయాంలో అమలైన సంక్షేమ పథకాలపైనా ఆరా తీస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పనితీరుపైనా ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నది. రేవంత్ కాకుండా వేరే వ్యక్తి సీఎం పదవిలో ఉంటే ఎలా ఉంటుంది అనే విసయంపైనా సర్వే చేపడుతున్నట్లు సమాచారం. అయితే.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల కోసమే గులాబీ పార్టీ ఈ రహస్య సర్వే నిర్వహిస్తున్నట్లు చర్చ జరుగుతున్నది.
సర్వే ఆధారంగానే బీఆర్ఎస్ యాక్టివిటీస్!
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు గడిచింది. ప్రభుత్వ పనితీరు ఎలా ఉందో తెలుసుకునేందుకు ప్రత్యేకంగా ఓ ప్రైవేట్ సంస్థతో రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ సర్వే చేయిస్తున్నట్లు సమాచారం. 20 ప్రశ్నలతో ప్రజల నుంచి సమాచారం సేకరిస్తున్నట్లు తెలిసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు చేపట్టిన సంక్షేమ పథకాలు, ఉద్యోగాల కల్పన, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు, 6 గ్యారంటీలపై అవలంబిస్తున్న విధానాలపై ప్రజాభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. రైతుబంధు, రుణమాఫీ, రేషన్ కార్డులు, సబ్సిడీపై గ్యాస్ పైనా ఆరా తీస్తున్నారు. ప్రత్యేకంగా బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై అభిప్రాయం తీసుకుంటున్నట్లు సమాచారం. ప్రభుత్వంపై ప్రజల్లో ఏ మేరకు వ్యతిరేకత ఉందో తెలుసుకునేందుకే ఈ సర్వే అని పార్టీకి చెందిన ఓ సీనియర్ నేత తెలిపారు. దానికి అనుగుణంగానే బీఆర్ఎస్ యాక్టివిటీస్ ముమ్మరం చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు.. బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన సంక్షేమ పథకాలపైనా ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నారు.
సీఎం పనితీరుపైనా ఆరా
రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆయన పనితీరు ఎలా ఉంది? ఇచ్చిన హామీలు ఏ మేరకు అమలు చేశారు? ఆయన భాష తీరు, ప్రతిపక్షాలపై, కేసీఆర్‌పై చేస్తున్న కామెంట్లతో ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉంది? అనే వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. సీఎంగా ఆయన కరెక్టేనా? లేకుంటే ఇతరులు ఎవరైనా ఉంటే బాగుంటుందా? అనే అభిప్రాయాన్ని సైతం తీసుకుంటున్నట్లు తెలిసింది. తెలంగాణ అభివృద్ధి రేవంత్‌తో సాధ్యమవుతుందా? పరిశ్రమలను తీసుకురావడంలో ఏ మేరకు సఫలం అయ్యారు? రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన కంపెనీలు మళ్లీ ఇతర రాష్ట్రాలకు వెళ్లడానికి కారణాలు? నిరుద్యోగులకు, విద్యార్థులకు ఏమేర భరోసా కల్పించారు? అనే అంశాలను సైతం సేకరిస్తున్నట్లు తెలిసింది. ధాన్యానికి మద్దతు ధర, సన్నవడ్లకే రూ.500 బోనస్, మౌలిక వసతులు లేక హాస్టల్ విద్యార్థుల ధర్నాలు, జీఓ29 రద్దు కోరుతూ గ్రూప్స్ విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ఈ ప్రత్యేక సర్వే నిర్వహిస్తున్నట్లు సమాచారం. అలాగే.. గ్రేటర్ హైదరాబాద్‌తోపాటు ఇతర జిల్లాల్లోనూ హైడ్రా విస్తరించాలని అనకుంటున్న తరుణంలో ప్రజలు ఏమనుకుంటున్నారో ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. మరోవైపు మూసీ పరివాహక ప్రాంతాల్లోనూ అక్రమ నిర్మాణాలను రెడ్‌మార్క్ వేసి కూలగొడుతుండటంతో ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకుంటున్నారు. అలాగే.. రామన్నపేటలో అదానీ సిమెంట్ కంపెనీ ఏర్పాటుపై ఆ ప్రాంత ప్రజల అభిప్రాయాలను పార్టీ తీసుకుంటున్నట్లు తెలిసింది.
బీజేపీపైనా వివరాల సేకరణ
ఎప్పుడూ లేని విధంగా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 8 సీట్లు సాధించింది. అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లోనూ 8 సీట్లు కైవసం చేసుకుంది. దీంతో బీజేపీ రెట్టింపు ఉత్సాహంతో స్థానిక సంస్థల్లోనూ విజయం సాధించాలని కసరత్తు చేస్తున్నది. అయితే.. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీకి ప్రజల నుంచి స్పందన తగ్గుతున్నదని భావిస్తున్నది. బీజేపీ తీరును సైతం రాబోయే స్థానిక సంస్థల్లో ఎండగట్టేందుకు గులాబీ దళం సిద్ధమవుతున్నది.
స్థానిక సంస్థలపై గురి
త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ఈ సర్వేకు దిగినట్లు టాక్ నడుస్తున్నది. ఈ సర్వేతో ప్రజల అభిప్రాయాలను తెలుసుకొని ఆ ప్రాంతాల పరిస్థితులకు అనుగుణంగా కార్యాచరణ చేపట్టి వారి మధ్యలోకి వెళ్లేందుకు ప్రణాళికలు రూపొందించబోతున్నట్లు తెలిసింది. ప్రభుత్వంపై వ్యతిరేక వస్తున్నదని, దానిని ఎన్నికల్లో అస్త్రంగా మలచుకోవాలని గులాబీ పార్టీ భావిస్తున్నట్లుగా ఆ పార్టీ నేతలు తెలిపారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల తర్వాత ప్రజలు రియలైజ్ అయ్యారని, బీఆర్ఎస్‌కు అనుకూలంగా ఉన్నారన్న అభిప్రాయం పార్టీలో వినిపిస్తోంది. అటు పార్టీ అధినేత కేసీఆర్ సైతం నిత్యం ముఖ్య నేతలతో ఫాంహౌజ్ వేదికగా సమీక్షిస్తూ దిశానిర్దేశం చేస్తున్నట్లు సమాచారం.