Harish Rao : అరెస్ట్ అయిన మాజీ సర్పంచ్‌లతో హరీష్‌రావు.. సంఘీభావం

by Ramesh N |
Harish Rao : అరెస్ట్ అయిన మాజీ సర్పంచ్‌లతో హరీష్‌రావు.. సంఘీభావం
X

దిశ, డైనమిక్ బ్యూరో: గ్రామ పంచాయతీల పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ తాజాగా మాజీ సర్పంచ్‌లు రాష్ట్ర సచివాల ముట్టడికి యత్నించారు. ఈ క్రమంలోనే వారిని పోలీసులు అడ్డుకుని నగరంలోని వివిధ స్టేషన్లకు తరలించారు. అయితే, అరెస్ట్ అయిన మాజీ సర్పంచులను తిరుమలగిరి పోలీసు స్టేషన్‌లో కలిసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో పోలీసుల రాజ్యం కనిపిస్తుందని ప్రభుత్వంపై మండిపడ్డారు. సర్పంచులు ఏం తప్పు చేశారని, ప్రజలకు సేవ చేయడం తప్పా..? అని ప్రశ్నించారు. వడ్డీలకు తెచ్చి, గ్రామాల్లో కార్యక్రమాలు చేశారని, 8 పైసలు కూడా ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు ఇవ్వలేదని ఆరోపించారు.

ఢిల్లీ ఇచ్చిన రూ. 500 కోట్లు కూడా విడుదల చేయలేదని తెలిపారు. గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్యం లోపించిందని, జ్వరాలతో జనం బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం మాత్రం మొద్దు నిద్రపోతుందని, ప్రతి నెల రూ. 275 కోట్లు మేము మా ప్రభుత్వంలో ఇచ్చామని గుర్తు చేశారు. పల్లె ప్రగతి డబ్బులు ఇవ్వడం లేదని, ఢిల్లీ నుంచి ఉపాధి హామీ పథకం నుంచి వచ్చిన డబ్బులు ప్రభుత్వం దాచిపెట్టిందని ఆరోపించారు. తమ పెండింగ్ నిధుల కోసం సర్పంచులు పోరాడితే వారిని అన్యాయంగా ప్రభుత్వం అరెస్టు చేసిందని ధ్వజమెత్తారు.

Advertisement

Next Story