మంత్రి పొంగులేటితో బరాబర్ టచ్‌లో ఉంటా.. BRS ఎమ్మెల్యే తెల్లం కీలక వ్యాఖ్యలు

by GSrikanth |
మంత్రి పొంగులేటితో బరాబర్ టచ్‌లో ఉంటా.. BRS ఎమ్మెల్యే తెల్లం కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: పార్టీ మార్పు వార్తలపై భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు స్పందించారు. మంగళవారం ఆయన ఓ మీడియా ప్రతినిధితో మాట్లాడారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డితో బరాబర్ టచ్‌లో ఉంటా అని స్పష్టం చేశారు. ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో తాను టచ్‌లో లేను అని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డిని ఎవరెవరు కలుస్తున్నారో కూడా తనకు తెలియదని కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్ పరిణామాల బట్టి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. కేవలం నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసమే తాను సీఎం రేవంత్ రెడ్డిని కలిశానని అన్నారు. ఈ నెల 11వ తేదీన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయబోతున్న ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవంలోనూ పాల్గొనబోతున్నట్లు ప్రకటించారు.

నా నియోజకవర్గ అభివృద్ధి నిధులు కావాలని.. నా మదిలో ఒక్క ఆలోచనే ఉందని చెప్పారు. అభివృద్ధి కోసం దేనికైనా సిద్ధమని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగత పనుల కారణంగా నిన్న కేసీఆర్ నిర్వహించిన ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల విస్తృత స్థాయి సమావేశానికి హాజరు కాలేకపోయానని అన్నారు. తాను బీఆర్ఎస్‌కు విధేయుడిగా ఉన్నానని తెలిపారు. పార్టీ కార్యక్రమాలపై తనకు ముందస్తు సమాచారం ఇస్తే బాగుంటుందని అధిష్టానానికి హితవు పలికారు. అయితే, ఇటీవల వరుసగా రెండు సార్లు సీఎం రేవంత్ రెడ్డి కలవడం, బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలు, సమావేశాలకు హాజరు కాకపోవడంతో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్‌లో చేరబోతున్నారని వార్తలు విస్తృతమయ్యాయి. తాజాగా.. ఈ వార్తలపై స్పందించిన ఆయన క్లారిటీ ఇచ్చారు.

Advertisement

Next Story