BRS నాలెడ్జి సెంటర్‌కు లైన్ క్లియర్.. రెండు రోజుల్లో శంఖుస్థాపన చేయనున్న కేసీఆర్!

by Satheesh |   ( Updated:2023-06-04 04:38:16.0  )
BRS నాలెడ్జి సెంటర్‌కు లైన్ క్లియర్.. రెండు రోజుల్లో శంఖుస్థాపన చేయనున్న కేసీఆర్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ పార్టీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎక్సెలెన్స్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్ సెంటర్ కోసం రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేట్‌లో 11 ఎకరాల భూమిని కేటాయిస్తూ మే 18న జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ స్థలాన్ని వెంటనే పార్టీకి అప్పగించేలా రెవెన్యూ శాఖ నుంచి ఉత్తర్వులు సైతం జారీ అయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ రెవెన్యూ శాఖకు మంత్రిగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆ స్థలంలో భవన నిర్మాణానికి అవసరమైన అన్ని శాఖల నుంచి అనుమతులు మంజూరయ్యాయి. దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్న టైమ్‌లోనే ఈ నెల 5న కేసీఆర్ శంకుస్థాపన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.

11 ఎకరాలు కేటాయింపు

‘టీఎస్ బి-పాస్’ విధానం ద్వారా భవన నిర్మాణానికి అవసరమైన అన్ని విభాగాల నుంచి అనుమతులు లభించాయి. కోకాపేట్‌లో 11 ఎకరాలను బీఆర్ఎస్ పార్టీకి ఇవ్వాలని పార్టీ తరఫున ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్‌రెడ్డి చేసిన విజ్ఞప్తికి భూపరిపాలన విభాగం (సీసీఎల్ఏ) సానుకూలంగా స్పందించి కేబినెట్ సమావేశం ముందు ప్రతిపాదన పెట్టగా మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

విపక్షాల నుంచి విమర్శలు

ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి సైతం బోయిన్‌పల్లిలో 10.15 ఎకరాల స్థలాన్ని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ లెవల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్ ఏర్పాటుకు కేటాయించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి ఈ స్థలం బదిలీ అయింది. బీఆర్ఎస్ పార్టీకి సైతం ఇలాంటి సెంటర్ కోసం 11 ఎకరాలను (సర్వే నెం. 239, 240) కేటాయించాల్సిందిగా సీసీఎల్ఏ ప్రతిపాదనను మంత్రివర్గ సమావేశానికి తీసుకొచ్చింది.

మంత్రివర్గం నిర్ణయించే ధరను చెల్లించడానికి బీఆర్ఎస్ సిద్ధంగా ఉన్నట్లు ఆ నోట్‌లో సీసీఎల్ఏ పేర్కొన్నది. కోకాపేట్‌లో ఇటీవల జరిగిన భూముల వేలంపాటలో ఒక్కో ఎకరం రూ.50 కోట్లకు అమ్ముడుపోయింది. ప్రస్తుత మార్కెట్ రేటు ఆ ప్రాంతంలో ఒక్కో ఎకరానికి రూ.3.41 కోట్లుగా ఉన్నది. ఆ ప్రకారం 11 ఎకరాల భూమి విలువ సుమారు రూ.37.53 కోట్లు అవుతుంది. కానీ మార్కెట్ రేటు ప్రకారం దాదాపు రూ.600 కోట్లు పలుకుతుంది. ఇంతటి విలువైన భూమిని కేవలం రూ.37 కోట్లకే కట్టబెట్టడంపై విపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి.

Read More: ఎలక్షన్ టీమ్‌ను సిద్ధం చేస్తోన్న KCR సర్కార్.. రంగంలోకి హరీష్ రావు, మహిళా IAS ఆఫీసర్..!

కేసీఆర్ సారూ..దశాబ్దపు హామీలకు దారి చూపుతారా..!

Advertisement

Next Story