ఆ ప్రోగ్రామ్ ఫెయిలైతే ప్రజల్లో రాంగ్ మెసేజ్ వెళ్లడం ఖాయం.. ఇప్పటికే అసంతృప్తిలో నేతలు

by Gantepaka Srikanth |
ఆ ప్రోగ్రామ్ ఫెయిలైతే ప్రజల్లో రాంగ్ మెసేజ్ వెళ్లడం ఖాయం.. ఇప్పటికే అసంతృప్తిలో నేతలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: దీక్షాదివస్‌ను విజయవంతం చేసి బలప్రదర్శన చేయాలని బీఆర్ఎస్ భావిస్తున్నది. తద్వారా కేడర్ లో జోష్ నింపవచ్చని అనుకుంటున్నది. అందుకోసం జిల్లా కేంద్రాల్లో నిర్వహించే కార్యక్రమాలకు పదివేల మందికి తగ్గకుండా ఉండేలా చూసుకోవాలని నాయకులకు దిశా నిర్దేశం చేసింది. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి కనీసం రెండువేల మందిని, గ్రేటర్ పరిధిలోని నియోజకవర్గాల నుంచి మూడువేల మందిని ప్రోగ్రామ్స్ కు తరలించాలని సూచించినట్లు తెలిసింది. అయితే పార్టీ కమిటీల్లో చోటు కల్పించకపోవడంపై పలువురు నాయకుల్లో అసంతృప్తి నెలకొన్నది. దీంతో జనం తరలింపు డౌట్ గానే కనిపిస్తున్నది.

జిల్లాల వారీగా ఇన్ చార్జిలు

కేసీఆర్ 2009 నవంబర్ 29న ఆమరణ నిరాహార దీక్ష మొదలుపెట్టడంతోనే డిసెంబర్ 9న కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణ ప్రకటన చేసిందని బీఆర్ఎస్ పేర్కొంటున్నది. దీంతో నవంబర్ 29ను దీక్షా దీక్షాదివస్ గా నిర్వహించేందుకుసిద్ధమైంది. ప్రతిపక్షంలో వచ్చాక ఇంతపెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. దీక్షా దివస్ కోసం అన్ని జిల్లాలకు ఇన్ చార్జిలను సైతం నియమించింది. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి రెండువేల మంది, గ్రేటర్ లోని నియోజకవర్గాల నుంచి మూడువేల మందిని తరలించే బాధ్యతను వారికి అప్పగించింది. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వస్తున్న తరుణంలో దీక్షదివస్ ద్వారా వారిని తమవైపునకు తిప్పుకోవచ్చని బీఆర్ఎస్ భావిస్తున్నది. ప్రోగ్రామ్ ఫెయిల్ అయితే ప్రజల్లో రాంగ్ మెస్సేజ్ వెళ్తుందని భావించి దీక్షాదివస్‌ను విజయవంతం చేయడానికి సర్వశక్తులూ ఒడ్డుతున్నది. వారం రోజులుగా భేటీలు నిర్వహిస్తూ కార్యక్రమంపై ప్రచారం చేపడుతున్నది.

అసంతృప్తిలోనే నేతలు

అసెంబ్లీ, పార్లమెంట్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు నెగెటివ్ ఫలితాలు వచ్చాయి. ప్రజలు సైతం పార్టీకి దూరమయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇంకా ప్రజల్లో వ్యతిరేకత కనిపించడం లేదని ఆ పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు. ఇంత జరుగుతున్నా పార్టీ బలోపేతంపై అధిష్టానం దృష్టి సారించలేదని, కేవలం మీడియా వేదికగానే విమర్శలు చేస్తున్నారని పేర్కొంటున్నారు. పార్టీ కమిటీల్లో తమకు చోటు కల్పించడం లేదని, ప్రాధాన్యం ఇవ్వడం లేదని పలువురు నేతలు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. పార్టీ పదవులు ఇవ్వకుండా కార్యక్రమాలను ఎలా విజయవంతం చేయాలని ఏ హోదాతో ప్రజలను సమీకరించాలని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రజలు తమను విశ్వసించాలంటే పార్టీ బాధ్యతలు అప్పగించాలని కోరుతున్నారు. అంతేగాకుండా నియోజకవర్గ ఇన్ చార్జిలు సైతం కలుపుకొని పోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ సమావేశాలకు సైతం అనుచరులను మాత్రమే పిలుస్తున్నారని, పార్టీ సీనియర్ గా ఉన్న తమను పట్టించుకోవడం లేదని పేర్కొంటున్నారు. పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడానికి దృష్టిసారించడంతో పాటు పార్టీ కమిటీలపైనా ఫోకస్ పెట్టాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.

సన్నాహాక సమావేశాలకూ దూరం

దీక్షా దివస్ విజయవంతం కోసం పార్టీ అధిష్టానం మంగళవారం సన్నాహక సమావేశాలు నిర్వహించి నేతలంతా పాల్గొనాలని పార్టీ ఆదేశించింది. అయినప్పటికీ సన్నాహక సమావేశాలకు కొంతమంది ఎమ్మెల్యేలు, మాజీ, సీనియర్ నేతలు గైర్హాజరు అయ్యారు. అయితే వారికి ఇష్టం లేకనా? లేకుంటే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే చర్చ నేతల్లో జరుగుతున్నది. రంగారెడ్డి జిల్లా సన్నాహక సమావేశంలో పార్టీ మారిన గౌడ సామాజిక వర్గ నేత ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ టార్గెట్‌గా విమర్శలు చేయడంతో కొంత మంది కార్యకర్తలు స్టేజీపై ఉన్న నేతలను నిలదీసినట్లు సమాచారం. పార్టీమారిన ఇతర ఎమ్మెల్యేలను వదిలి ప్రకాశ్ గౌడ్ పైనే విమర్శలు చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. మేడ్చల్ జిల్లా సమావేశానికి మాజీ మంత్రి మల్లారెడ్డి సమయానికి రాకపోవడంతో ఆయన వచ్చేవరకు సమావేశం నిర్వహించలేదని తెలిసింది. మల్లారెడ్డి వచ్చిన తర్వాతేనే సమావేశం కొనసాగించడంతో కొంతమంది నేతలు అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా పార్టీ నేతల తీరు మారడం లేదని పలువురు బహిరంగానే విమర్శలు చేస్తుండటం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed