ఏపీలో విస్తరణకు BRS భారీ స్కెచ్.. సంక్రాంతి టూర్‌‌కి వెళ్ళేవారు ఆ పని చేయాలని సూచన..!!

by Satheesh |   ( Updated:2023-01-15 05:12:49.0  )
ఏపీలో విస్తరణకు BRS భారీ స్కెచ్.. సంక్రాంతి టూర్‌‌కి వెళ్ళేవారు ఆ పని చేయాలని సూచన..!!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ విస్తరణకు బీఆర్ఎస్ భారీ స్కెచ్ వేసింది. సంక్రాంతి పండుగను దానికి అనువుగా మార్చుకోవాలని చూస్తున్నది. ప్రతీ సంవత్సరం సంక్రాంతి పండుగకు హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు పట్టణాల నుంచి భారీ సంఖ్యలో ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళడం ఆనవాయితీ. ఈ రద్దీకి అనుగుణంగానే తెలంగాణ, ఏపీ రాష్ట్రాల రవాణా సంస్థలు స్పెషల్ బస్సులు నడుపుతుంటాయి. రైల్వే సైతం ప్రత్యేక సర్వీసులను నడుపుతుంది. ఈ ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ సీనియర్ నేత ఒకరు ఇక్కడి కుల సంఘాలతో వారం రోజులుగా మంతనాలు జరుపుతున్నారు. సంక్రాంతికి వెళ్ళినప్పుడు అక్కడి కుల సంఘాల నేతలతో మాట్లాడి భారీ సంఖ్యలో బీఆర్ఎస్‌లో కార్యకర్తలుగా చేర్పించాలన్నది ఈ చర్చల సారాంశం. ఇందుకు పార్టీ తరఫున ప్రతిఫలం కూడా ఉంటుందని నచ్చచెప్తున్నారు.

రాష్ట్రంలో అధికారంలోకి వస్తే కమ్యూనిటీ హాళ్లను కట్టిస్తామని, కులవృత్తులను ప్రోత్సహించడంతో పాటు ఆ కులాలకు భవన్‌లను కట్టిస్తామని తెలంగాణ ఉదాహరణలను వివరిస్తున్నారు. ఇక్కడి కుల సంఘాల నేతలు ప్రత్యేకంగా చొరవ తీసుకుని ఆంధ్రప్రదేశ్‌‌లోని సంఘాలతో, వాటి నేతలతో సంప్రదింపులు జరిపి ప్లాన్ వర్కవుట్ అయ్యేలా చూడాలని సూచించారు. ఎక్కువగా బీసీ సంఘాలపైనే బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. కాపు సామాజికవర్గానికి తెలంగాణలో పెద్దపీట వేయడం ద్వారా ఆ ప్రభావం ఆంధ్రప్రదేశ్‌లో ఉంటుందని భావించింది. ఆ అంచనాకు తగినట్లుగానే కొంత పాజిటివ్ ఎఫెక్టు కనిపించిందని బీఆర్ఎస్ నాయకులు అభిప్రాయపడుతున్నారు. అక్కడి నుంచి ఒక కులానికి చెందిన విద్యాధికులు ఇప్పటికే ఇక్కడకు వచ్చి కలవడాన్ని గుర్తుచేస్తున్నారు.

కుల సంఘాలకు పలు రాష్ట్రాల్లో ఉన్న శాఖలను బీఆర్ఎస్ కోసం వినియోగించుకునే ప్లాన్ ముమ్మరంగా జరుగుతున్నది. ఏయే రాష్ట్రాల్లో బీఆర్ఎస్ పోటీ చేయాలనుకుంటున్నదో వాటిపై తెలంగాణ నేతలు ఫోకస్ పెట్టారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని స్వగ్రామాలకు వెళ్ళేవారు అక్కడి కుటుంబ సభ్యులు, బంధువులతో మాట్లాడి బీఆర్ఎస్‌లో చేర్చించడంపైనే వారం రోజులుగా తెలంగాణలో కుల సంఘాల నేతలతో జరుగుతున్న చర్చల్లోని కీలకమైన అంశం. కేసీఆర్‌కు సన్నిహితంగా ఉన్న ఒక సీనియర్ నేత ఈ వ్యవహారాన్ని చక్కదిద్దుతున్నారు. తెలంగాణలో ప్రతీ కులానికి సంక్షేమ, ఆత్మగౌరవ భవన్‌లను నిర్మించిన తరహాలోనే అక్కడ కూడా ఉంటాయన్న భరోసాను కల్పిస్తున్నారు. చేరినవారికి, చేర్పించినవారికి బీఆర్ఎస్ తరఫున తగిన ప్రోత్సాహకం ఉంటుందని హామీ ఇస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా ప్యాకేజీల చర్చలు జరుగుతున్నట్లు అంతర్గత వర్గాల నుంచి అందిన సమాచారం.

ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ సభ్యత్వాన్ని పెంచుకోవడం, గుర్తింపు పొందడం కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్న బీఆర్ఎస్ ఈ అవకాశాన్నీ విస్తృతంగా వాడుకోవాలనుకుంటున్నది. ఇక్కడి కుల సంఘాలకు అక్కడి సంఘ నేతలతో ఉన్న పరిచయాలను వాడుకుంటున్నది. ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ కులాల చుట్టూ తిరుగుతుండడంతో ప్రధాన కులాలు ఇప్పటికే ఏదో ఒక పార్టీ పక్కన చేరిపోయాయన్నది బీఆర్ఎస్ భావన. బీసీ కులాలను ఆకట్టుకోవడం ద్వారా అక్కడి రాజకీయాల్లో కింగ్ మేకర్ పాత్ర పోషించి బీఆర్ఎస్ విస్తరణకు వాడుకోవచ్చనేది ప్లాన్. జాతీయ స్థాయికి పార్టీని విస్తరింపజేయడంలో విఫలం కాలేదని ప్రూవ్ చేయడానికి ఏపీలో నిలదొక్కుకున్నదన్న గుర్తింపుతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు బ్యాంకును కైవశం చేసుకోవడం కీలకంగా మారింది.

ఇక్కడి కుల సంఘాలను ప్రసన్నం చేసుకోవడం ద్వారా అక్కడ ఎలాంటి ప్రభావం ఉంటుందన్నది రానున్న కాలంలో తేలుతుంది. కానీ బీఆర్ఎస్ వైపు నుంచి ప్రయత్నాలు మాత్రం సీరియస్‌గా జరుగుతున్నాయి. ఇలాంటి ప్రయత్నాల్లో భాగంగా కాపు సామాజికవర్గంలో చేసిన ప్రయోగం ఆశించిన ఫలితాలనే ఇస్తున్నదని, మిగిలిన బీసీ కులాల విషయంలోనూ ఇలాంటి ఆశాజనకమైన ఫలితాలే వస్తాయని బీఆర్ఎస్ బలంగా నమ్ముతున్నది. కోడిపందాలకు ఇక్కడి నుంచి వెళ్ళేవారితోనూ బీఆర్ఎస్ నేతలు సంప్రదింపులు జరుపుతున్నారు. గత వారం రోజులుగా జరుగుతున్న ప్రయత్నాల రిజల్ట్ ఈ నెల చివరికల్లా సూచనప్రాయంగా వస్తాయని భావిస్తున్నారు. ఆంధ్రుల పండుగగా చెప్పుకునే సంక్రాంతిని సైతం బీఆర్ఎస్ పొలిటికల్‌గా మల్చుకుంటున్నది.

Read more:

BRS తొలి ''పాన్ ఇండియా'' సభకు KTR దూరం.. మంత్రి వరుస డుమ్మాలకు కారణమేంటి..?

Advertisement

Next Story