అప్పుడు వంచ‌న‌.. ఇప్పుడు ఖూనీరాగాలు: మంత్రి సీతక్క

by Mahesh |
అప్పుడు వంచ‌న‌.. ఇప్పుడు ఖూనీరాగాలు: మంత్రి సీతక్క
X

దిశ, తెలంగాణ బ్యూరో: అధికారం కోల్పోయామ‌నే దుర్భుద్దితో మాజీ మంత్రి కేటీఆర్ దూష‌ణ‌ల‌కు దిగితే స‌హించేది లేద‌ని, త‌గిన రీతిలో స‌మాధానం చెప్పాల్సి వ‌స్తుందని మంత్రి సీత‌క్క ఓ ప్రకటనలో హెచ్చరించారు. ప‌దేండ్లు మంత్రిగా వెల‌గ‌బెట్టిన కేటీఆర్..ఇప్పుడు స‌భ్యతా, సంస్కారాలు మర‌చి సీఎం కుర్చీని అవ‌మాన ప‌రిచేలా వ్యవహరిస్తున్నారని మండిప‌డ్డారు. ఆదిలాబాద్ లో రామ్‌లీలా మైదానంలో సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను జిల్లా ఇంచార్జ్ మంత్రి సీత‌క్క ఖండించారు. ప్రజలను రెచ్చగొట్టి ప‌బ్బం గ‌డుపుకోవ‌డమే కేటీఆర్ ప‌ని అని ఎద్దేవా చేసారు. కేటీఆర్ ఆట‌లను అన్నదాతలు సాగ‌నివ్వరని వెల్లడించారు. అధికారంలో ఉన్నప్పుడు అన్నదాతలను వంచించి.. ఇప్పుడు ఖూనీ రాగాలు తీస్తున్నార‌ని సీత‌క్క మండిప‌డ్డారు.

ఏక‌కాలంలో పంట రుణ మాఫీ చేయ‌లేని అస‌మ‌ర్ధ బీఆర్ఎస్ ను గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నిక‌ల్లో రైతులు త‌రిమికొట్టినా, కేటీఆర్ కు బుద్ది రాలేద‌ని సీత‌క్క వ్యాఖ్యానించారు. గ‌తంలో విడ‌త‌ల వారిగా, అర‌కొర‌గా చేసిన రుణ మాఫీ వ‌డ్డీల‌కు కూడా స‌రిపోక రైతుల‌కు బ్యాంకులు కొత్త రుణాలు మంజూరు చేయ‌లేదన్నారు. తద్వారా 61.5 శాతం మంది రైతుల‌కు ప్రైవేటు రుణాలు దిక్కైన‌ట్లు తెలంగాణ సామాజిక అభివృద్ది నివేదిక‌లో గత ప్రభుత్వమే ఒప్పుకుంద‌ని సీత‌క్క గుర్తు చేశారు. కానీ త‌మ ప్రభుత్వం రైతుల కోసం ఏక‌కాలంలో రూ. రెండు ల‌క్షల వ‌ర‌కు పంట‌ రుణ మాఫీకి పూనుకుంద‌ని తెలిపారు. ఇప్పటి వ‌ర‌కు రూ. 18 వేల కోట్లను మాఫీ చేసి 23 లక్షల మంది రైతుల‌ను రుణ విముక్తుల‌ను చేసింద‌ని గుర్తు చేశారు.

రైతుల‌కు ఉచిత ఎరువులు, సన్న వ‌డ్లకు బోన‌స్ వంటి హ‌మీలను ఇచ్చిన బీఆర్ఎస్..వాటిని విస్మరించి రైతుల‌ను వంచించింద‌ని సీత‌క్క ఆగ్రహం వ్యక్తం చేశారు. వ‌రి వేస్తే ఊరే అని అన్నదాతలను ఆగం చేసిన‌ చరిత్ర బీఆర్ ఎస్ దన్నారు. గతంలో ఆకాల వ‌ర్షాల‌తో పంట న‌ష్టపోతే క‌నీసం ప‌రిహారం, ఇన్ పుట్ స‌బ్సిడీ ఇవ్వలేదన్నారు. పంటల భీమా ప‌థ‌కం లేని ఏకైక రాష్ట్రంగా తెలంగాణ‌ను మార్చిన చరిత్ర బీఆర్ ఎస్ దన్నారు.

కానీ వాస్తవ సాగుదారుల‌కే ప్రయోజనం చేకూర్చే విధంగా త‌మ ప్రభుత్వం పంట బోన‌స్ ప‌థ‌కాన్ని అమ‌లు ప‌రుస్తుంద‌ని మంత్రి సీత‌క్క తెలిపారు. సన్న వ‌డ్లకు క్వింటాకు రూ. 500 బోనస్ ను ప్రకటించిన త‌మ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 7248 కొనుగోలు కేంద్రాల‌ను ప్రారంభించేందుకు సిద్ధపడిందన్నారు. ఇప్పటికే 2539 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి కొనుగోళ్ల ప్రక్రియను చేప‌ట్టిన‌ట్లు చెప్పారు. ఎంత ఉప్పు తింటే అంత దూపు అన్నట్లు, గత ప్రభుత్వం అప్పులకు కిస్తీలు, వడ్డీలు చెల్లించుకుంటూ పోవాల్సి వస్తుందని సీతక్క క్లారిటీ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed