ఆ సమస్యను అస్త్రంగా మలుచుకునేందుకు బీఆర్ఎస్ ప్లాన్.. కేటీఆర్ నాయకత్వంలో ముందుకు!

by Gantepaka Srikanth |
ఆ సమస్యను అస్త్రంగా మలుచుకునేందుకు బీఆర్ఎస్ ప్లాన్.. కేటీఆర్ నాయకత్వంలో ముందుకు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతలు పండించిన ధాన్యం చేతికి వచ్చే సమయాన్ని బీఆర్ఎస్ అధిష్టానం అస్త్రంగా మలుచుకునేందుకు ప్లాన్ వేస్తోంది. ధాన్యం కొనుగోళ్లలో సమస్యలు, మద్దతు ధరపై గళం ఎత్తేందుకు సిద్ధమైంది. అందులో భాగంగానే నియోజకవర్గ కేంద్రాల్లో ‘రైతుధర్నా’ నిర్వహించేందుకు ప్రణాళికలు సైతం సిద్ధం చేసింది. ఈ నెల 19న వికారాబాద్ జిల్లా మోమిన్ పేటలో, 24న ఆదిలాబాద్ లో ధర్నాలకు తేదీని ఫిక్స్ చేసింది. మిగిలిన నియోజకవర్గాల్లోనూ విడతల వారీగా ధర్నాలకు ప్లాన్ చేస్తోంది. ఈ ధర్నాల్లో రైతులతో పాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని ప్రభుత్వ విధానాలపై గళమెత్తనున్నారు.

రైతుబంధును బీఆర్ఎస్ ప్రభుత్వం ఏటా రెండు సీజన్లలో ఎకరాకు 10వేల చొప్పున వేసింది. రాష్ట్రంలో 68.99 లక్షల మందికి రైతుబంధు వేసినట్లు గత ప్రభుత్వం అధికారిక లెక్కలు వెల్లడించింది. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎకరాకు రూ.7500 చొప్పున రూ.15వేలు వేస్తామని హామీ ఇచ్చింది. అయితే ఆ హామీ రాష్ట్రంలో అమలుకు నోచకపోవడంతో దీనిపై ఇప్పటికే బీఆర్ఎస్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తోంది. దీనిపై రైతుల్లో కూడా చర్చ జరుగుతుండటంతో ఈ అంశాన్ని ప్రజల్లో లేవనెత్తాలని, చైతన్యం చేయాలని భావిస్తోంది. ఇదే అంశంపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సమయత్తం చేయడానికి ప్రస్తుతం సమయం అనుకూలంగా ఉందని ఆపార్టీ అధిష్టానం భావిస్తోంది. అదే విధంగా పంటల బీమాపైనా ప్రభుత్వం క్లారిటీ ఇవ్వడం లేదని ఇప్పటికే ఆరోపణలకు పదునుపెట్టింది.

త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్న నేపథ్యంలో రుణమాఫీని ప్రధాన అస్త్రంగా చేసుకోవాలని బీఆర్ఎస్ భావిస్తోంది. గత బీఆర్ఎస్ పాలనలో చేసిన రుణమాపీ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక చేస్తున్న రుణమాఫీ లెక్కలను పోల్చుతూ చర్చ లేపేందుకు సిద్ధమైంది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ధాన్యానికి క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించి, ఆ తర్వాత సన్నధాన్యానికి మాత్రమే బోనస్ అంటూ పేర్కొనడంతో రైతులు సైతం నైరాశ్యంలో ఉన్నారు. అయితే ప్రస్తుతం వరికోతలు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ అవుతున్నాయి. దీంతో దొడ్డు ధాన్యానికి సైతం బోనస్ పై ఒత్తిడి పెంచాలని బీఆర్ఎస్ భావిస్తోంది. రైతుధర్నాలను స్థానిక రైతులతో స్వచ్ఛందంగా నిర్వహించేలా ప్లాన్ చేస్తోంది.

గత అసెంబ్లీ ఎన్నికల్లో రుణమాఫీ ఎఫెక్ట్ బీఆర్ఎస్ పార్టీపై పడింది. లక్షలోపు రుణమాఫీ చేస్తామని చెప్పినప్పటికీ అందరికీ కాలేదన్న ఆరోపణలున్నాయి. రెండు విడతలుగా అందరికీ రుణమాఫీ చేశామని చెబుతున్నప్పటికీ రైతులు నిరాశతో ఉన్నారు. అదే విధంగా రైతు కొనుగోలు కేంద్రాల్లోనూ మౌలిక సమస్యలు కొరవడటం, కొనుగోళ్లలో సైతం ఆలస్యం, తడిసిన ధాన్యంపై కొర్రీలు, రైతులు నిరసనలు చేపట్టిన ఘటనలు బీఆర్ఎస్ పై ఎఫెక్ట్ పడింది. అయితే ప్రస్తుత ప్రభుత్వంలో సైతం అవే పునరావృతం అవుతుండటంతో వాటిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని బీఆర్ఎస్ భావిస్తోంది. వరికోతల సమయంలోనే ప్రభుత్వ వైఫల్యాలను వివరించి పార్టీవైపు మొగ్గుచూపేలా ప్లాన్ చేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల నాటికి రైతులను మరింత చైతన్యం చేసి వారి మద్దతును కూడగట్టే పనిలో బీఆర్ఎస్ పార్టీ నిమగ్నమైంది. పార్టీ స్కెచ్ ఏమేరకు కలిసి వస్తుందనేది చూడాలి.

Advertisement

Next Story

Most Viewed