- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైసీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం
దిశ, ఏపీ బ్యూరో/ మంగళగిరి: వైసీపీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ సీఎం సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైంది. గత ప్రభుత్వ హయాంలో చక్రం తిప్పిన సజ్జల అప్పటి ప్రభుత్వ నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించారు. వైసీపీ కార్యకలాపాలను ముందుండి నడిపించారు. టీడీపీ పార్టీ నేతలపై అక్రమ కేసులు నమోదు దాడులను నేరుగా పర్యవేక్షించేవారని ఆరోపణలు ఎదుర్కొన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం, ఉండవల్లి సీఎం చంద్రబాబు నివాసంపైనా దాడుల విషయంలో కూడా సజ్జల తెర వెనుక సూత్రధారిగా ఆరోపణలు వచ్చాయి. టీడీపీ ఈ విషయమే ఫిర్యాదు చేసినప్పటికీ అప్పట్లో పోలీసులు కేసుల నమోదుకు శ్రద్ధ చూపలేదు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత పోలీసుల వైఖరి మారింది.
బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, యువ నాయకులు దేవినేని అవినాశ్, విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య సహా 70మందికి పైగా కేసులు నమోదు చేశారు. నందిగం సురేశ్ అరెస్ట్ తో వైసీపీలో కలకలం రేగింది. ఆ వెంటనే లేళ్ళ అప్పిరెడ్డి, దేవినేని అవినాష్ బెయిల్ తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అజ్ఞాతంలో ఉన్న చైతన్య నాలుగు రోజుల కింద కోర్టులో లొంగిపోయారు. ఈ కేసులో వరుస అరెస్టులు, విచారణలు వేగవంతం కావడం కేసును సీఐడి కి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయించిన నేపథ్యంలో సజ్జలను విచారణకు రావాలంటూ నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ నోటీసులు రాకముందే సజ్జల దేశం విడిచి వెళ్లే ప్రయత్నం చేయడం లుక్ అవుట్ నోటీసులు జారీ కావడంతో ఆయనను ఢిల్లీ ఎయిర్ పోర్టులో అడ్డుకున్న విషయం తెలిసిందే. గురువారం సాయంత్రం వరకు విచారణ కొనసాగింది. ఈ క్రమంలో రాత్రికి లేదా శుక్రవారం అరెస్టు చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
విచారణకు సజ్జల సహకరించలేదు : మంగళగిరి సీఐ శ్రీనివాసరావు
కార్యాలయంపై దాడి కేసులో సజ్జలను విచారించామని, విచారణకు సజ్జల రామకృష్ణారెడ్డి సహకరించలేదని మంగళగిరి సీఐ శ్రీనివాసరావు పేర్కొన్నారు. ముందుగా సిద్ధం చేసుకున్న 38 ప్రశ్నలు అడిగామని, చాలా ప్రశ్నలకు గుర్తు లేదనే సమాధానం ఇచ్చారన్నారు. మా వద్ద ఉన్న ఆధారాలతో సజ్జలను ప్రశ్నించామని, సజ్జలను ఫోన్ అడిగినా ఇవ్వలేదని పేర్కొన్నారు. మా ప్రశ్నలకు వ్యతిరేక ధోరణిలో సమాధానాలు ఇచ్చారని, ఘటన జరిగిన రోజు తాను అక్కడలేనని చెప్పారన్నారు. ఈ కేసులో సజ్జల పాత్ర ఉన్నట్లు మా వద్ద ఆధారాలున్నాయని సిఐ తెలిపారు. మూడు నెలలుగా ఈ కేసును విచారించామని, కేసు దర్యాప్తు దాదాపు చివరకు వచ్చిందన్నారు. చాలా మంది నిందితులు కోర్టుల ద్వారా రక్షణ పొందారని, దీనివల్ల కేసు విచారణ వేగంగా జరగట్లేదన్నారు. నిందితులను అరెస్ట్ చేస్తే విచారణ త్వరగా పూర్తవుతుందని, కేసును ప్రభుత్వం సీఐడీకి ఇచ్చిందని పేర్కొన్నారు. ఉత్తర్వులు రాగానే విచారణ దస్త్రాలను సీఐడీకి ఇస్తామని శ్రీనివాసరావు పేర్కొన్నారు.
కోర్టులో తేల్చుకుంటాం: సజ్జల రామకృష్ణారెడ్డి
పోలీసుల విచారణ అనంతరం సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రజా సమస్యలను టీడీపీ గాలికొదిలేసిందని వైసీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. వైసీపీ శ్రేణులను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, టీడీపీ ఆఫీసుపై దాడి ఘటనలో కేసులన్నీ అక్రమమే అన్నారు. ఘటన జరిగినప్పుడు నేను బద్వేల్‌లో ఉన్నానని తెలిపారు. ఈ కేసులు వైసీపీ నేతల్లో ధైర్యాన్ని మరింత పెంచుతాయన్నారు. కేసులపై కోర్టులో తేల్చుకుంటామని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.