కేటీఆర్ అరెస్ట్ ప్రచారం.. నిద్రలేని రాత్రులు గడుపుతున్న గులాబీ దండు!

by karthikeya |
కేటీఆర్ అరెస్ట్ ప్రచారం.. నిద్రలేని రాత్రులు గడుపుతున్న గులాబీ దండు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తారంటూ జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో బంజారాహిల్స్ నందినగర్‌లో మూడు, నాలుగు రోజులుగా నిద్రలేని రాత్రులు సాగుతున్నాయి. కేటీఆర్‌ను ఏ క్షణమైనా అరెస్ట్ చేయవచ్చన్న సమాచారం ఉండడంతో ఆయన అరెస్ట్‌ను ప్రతిఘటించడానికి పార్టీ శ్రేణులు జాగారం చేశారు. వికారాబాద్ జిల్లా లగచర్లలో అధికారులపై దాడి కేసులో ఏ1గా ఉన్న పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్‌లో కేటీఆర్ పేరు ప్రస్తావించినట్లుగా పోలీసులు చెబుతున్నారు. దీంతో గత నాలుగు రోజులుగా కేటీఆర్‌ను ఏ క్షణమైనా అరెస్ట్ చేస్తారనే ప్రచారం జోరందుకుంది. బీఆర్ఎస్ ముఖ్య నాయకులు సైతం కేటీఆర్‌ను అరెస్టు చేస్తారనే తమకు సమాచారం ఉందని, ఆయనకు రక్షణగా నిలుద్దామని, జీహెచ్ఎంసీకి చెందిన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీలో కీలక నేతగా ఉన్న కేటీఆర్ అరెస్ట్ సమయంలో పార్టీ కేడర్ ఎవరూ లేకపోతే ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళతాయని, కింది స్థాయి కేడర్‌లో ఆత్మస్థైర్యం దెబ్బతింటుందన్న అంచనాతో జాగారం వ్యూహన్ని పన్నినట్లుగా సమాచారం.

మూడు జిల్లాల నేతల జాగారం..

హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు చెందిన నేతలు నందినగర్ లోని కేటీఆర్ ఇంటి వద్ద జాగారం చేసినట్లు సమాచారం. మూడు రోజుల పాటు కేటీఆర్ కూడా వారితో పాటే అక్కడే ఉన్నారు. వారితో పిచ్చపాటిగా మాట్లాడుకుంటూ కాలం గడిపారు. వాస్తవంగా కేటీఆర్ గచ్చిబౌలిలోని విల్లాలో నివాసం ఉంటున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులందరూ నందినగర్ లోనే ఉంటున్నారు.

అర్ధరాత్రి అరెస్టు చేస్తారని..

లగచర్ల దాడి ఘటనలో కేటీఆర్ ను ఆర్థరాత్రి వేళల్లోనే అరెస్ట్ చేస్తారనే అంచనాతో పార్టీ శ్రేణులు రాత్రి వేళల్లో జాగారం చేస్తున్నారని పార్టీ నాయకులు చెబుతున్నారు. మొదటి రెండు రోజులు ఆయనను నిత్యం వెన్నంటి ఉండే నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, రాష్ట్ర స్థాయి నేతలు ఉన్నారు. బుధవారం ఆర్థరాత్రి సమయంలో ఇంటి అవరణలోకి వచ్చి వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. రెండో రోజు కూడా పార్టీ నాయకులు నందినగర్ ఇంటికి వచ్చి జాగారం చేశారు. అరెస్టు చేసేందుకు పోలీసు యంత్రాంగం ఎప్పుడు వస్తుందంటూ తమకు తెలిసిన పోలీసు మిత్రులకు ఫోన్ చేసి మరీ తెలుసుకున్నారు. మూడో రోజు కూడా ఇదే తంతు కొనసాగింది. అయితే మూడో రోజు ఎక్కువగా నగర శివారు ప్రాంతాలకు చెందిన నాయకులు వచ్చినట్లుగా సమాచారం.

తప్పుడు సమాచారమా? తప్పుదోవ పట్టించారా?

మూడు రోజులుగా ఇదంతా జరుగుతున్నా కూడా కేటీఆర్ అరెస్టు ఉంటుందా..? ఉండదా...? ప్రభుత్వ స్ట్రాటజీ ఏమిటంటూ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆరా తీయడం ప్రారంభించారు. తమకు అధికార పార్టీలోని కొందరు నాయకులు, పోలీసు ముఖ్యుల ద్వారా కేటీఆర్ అరెస్ట్ పై సమాచారం ఉందన్న నేతలు మూడు రోజులైనా అరెస్ట్ కాకపోవడంతో తమకు తప్పుడు సమాచారం అందించారా లేక తప్పుదోవ పట్టించారా...? అనే అంతర్మథనం మొదలైంది. తమకు సమాచారం అందించింది కూడా ముఖ్య పోలీసులేనని, వారిని అనుమానించాలా లేక అయోమయానికి గురి చేయడానికి ఇలాంటి ప్రచారాన్ని తీసుకవచ్చారా? అంటూ గులాబీ కీలక నేతల్లో చర్చ మొదలైంది. అరెస్టుపై కేటీఆర్ కూడా ఒకింత అసహనానికి గురైనట్లుగా సమాచారం. అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేసుకోనివ్వండి కానీ ప్రతి రోజు ఇలా అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ చేస్తారంటూ ప్రచారం జరగడంపై ఆయన పార్టీ ముఖ్య నేతలతో అసహానాన్ని వ్యక్తం చేసినట్లుగా సమాచారం. ప్రభుత్వం తనపై రాజకీయ కక్ష తీర్చుకోవడానికే అరెస్టు డ్రామా అడుతోందని, అరెస్టుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆయన ప్రకటించారు. కానీ ప్రభుత్వం వైపు నుంచి మాత్రం అందుకు భిన్నంగా వ్యూహం పన్నడంతో గులాబీ శ్రేణులు కొంత అయోమయోనికి గురవుతున్నారని సమాచారం.

Advertisement

Next Story

Most Viewed