Netanyahu: నెతన్యాహు ఇంటిపై బాంబుల దాడి.. తీవ్రంగా ఖండించిన ఇజ్రాయెల్

by vinod kumar |   ( Updated:2024-11-17 10:01:37.0  )
Netanyahu: నెతన్యాహు ఇంటిపై బాంబుల దాడి.. తీవ్రంగా ఖండించిన ఇజ్రాయెల్
X

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమాసియా (Middle East)లో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ మరో ఆందోళనకర ఘటన చోటు చేసుకుంది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు (Benjamin nethanyahu) ఇంటిపై బాంబు దాడి జరిగింది. ఉత్తర ఇజ్రాయెల్ నగరమైన సిజేరియా (Caesarea)లోని నెతన్యాహు ఇంటి ఆవరణలో ఉన్న గార్డెన్‌లో రెండు ఫ్లాష్ బాంబులు పడినట్టు పోలీసులు, ఇంటర్నల్ సెక్యూరిటీ ఏజెన్సీ షిన్ బెట్ సంయుక్తంగా వెల్లడించాయి. ఘటన సమయంలో నెతన్యాహు, ఆయన కుటుంబ సభ్యులు ఆ ప్రాంతంలో లేకపోవడంతో ఎటువంటి నష్టం జరగలేదు. అయితే దాడి ఎక్కడి నుంచి జరిగింది, ఎవరు చేశారనే వివరాలు ఇజ్రాయెల్ వెల్లడించలేదు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్టు షిన్ బెట్ తెలిపింది.

నెతన్యాహు ఇంటిపై జరిగిన దాడిని ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ (Isaac Herzog) సహా దేశంలోని రాజకీయ పార్టీలన్నీ తీవ్రంగా ఖండించాయి. ‘ఈ ఘటన చాలా తీవ్రమైనది. బాధ్యులైన వారిని వీలైనంత త్వరగా గుర్తిస్తాం. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని హెర్జోగ్ ఎక్స్‌లో పోస్టు చేశారు. అలాగే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష నాయకులు యైర్ లాపిడ్, బెన్నీ గాంట్జ్‌లు డిమాండ్ చేశారు. హద్దులు దాటిపోయారని రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ (Israel katz) తెలిపారు. ఈ విషయంలో భద్రతా సంస్థలు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.

కాగా, అక్టోబర్19న కూడా ఇదే నివాసంపై హిజ్బుల్లా (Hezbollah) దాడి చేసింది. నెతన్యాహు ఇంటికి సమీపంలోని భవనంపై డ్రోన్ పడింది. అయితే ఆ సమయంలోనూ నెతన్యాహు, ఆయన భార్య సారా ఇంట్లో లేకపోవడంతో ప్రమాదం తప్పింది. నెల రోజుల వ్యవధిలోనే రెండో సారి దాడి జరగడంతో ఆందోళన నెలకొంది. సెప్టెంబర్ 23 నుంచి లెబనాన్‌లోని హిజ్బుల్లా లక్ష్యాలపై ఇజ్రాయెల్ దాడులను తీవ్రతరం చేసిన విషయం తెలిసిందే.


Read More..

Khamenei: అలీ ఖమేనీ వారసుడిగా మోజ్తాబా.. రహస్యంగా ప్రకటించిన ఇరాన్ !

Advertisement

Next Story