అదానీ‌పై బీఆర్ఎస్ దూకుడు!

by Sathputhe Rajesh |   ( Updated:2023-02-02 09:23:35.0  )
అదానీ‌పై బీఆర్ఎస్ దూకుడు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: అదానీ గ్రూప్ కంపెనీలపై హిండెన్ బర్గ్ నివేదిక అంశంపై తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేయబోతున్నామని బీఆర్ఎస్ ఎంపీలు తెలిపారు. ఈ విషయంలో అన్ని రాష్ట్రాల అసెంబ్లీలు కౌన్సిల్‌లో తీర్మానాలను తీసుకుని కేంద్రంపై సమిష్టి పోరాటం చేస్తామన్నారు. అదానీ షేర్ల అంశంపై గురువారం పార్లమెంట్‌లో బీఆర్ఎస్ ఎంపీలు వాయిదా తీర్మానం ఇచ్చారు.

అనంతరం లోక్ సభ సభ్యుడు నామా నాగేశ్వర్ రావు, కేకే, కొత్త ప్రభాకర్ రెడ్డిలు మాట్లాడుతూ.. అదానీ కంపెనీ గ్రూప్‌లపై జ్యుడిషియల్ ఎంక్వయిరీ లేదా జేపీసీ వేసి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ అంశం దేశ సమస్య అని ఇందులో ప్రజల డబ్బు ఇన్వాల్వ్ అయి ఉందన్నారు. ఏ సమస్య అయినా చర్చకు సిద్ధం అని చెప్పుకునే కేంద్రం.. అదానీ సంస్థల విషయంలో చర్చకు ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు. ఎల్ఐసీ డబ్బులపై ఇంత చర్చ జరుగుతున్నా ప్రభుత్వం నుంచి కనీసం ప్రకటన లేదని చర్చ జరిగేందుకు మా పోరాటం కొనసాగుతోందన్నారు.

ఎల్‌ఐసీతో సంబంధం లేని కుటుంబం లేదని దీనిపై కచ్చితంగా చర్చ జరగాలన్నారు. సభ ఆర్డర్‌లో లేదని వాయిదా వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది దేశ ఆర్ధిక వ్యవస్థకు సంబంధించిన చాలా ముఖ్యమైన విషయం అని అదానీ షేర్స్ 27 శాతం పడిపోయాయన్నారు. క్రోని కేపిటలిజం దేశాన్ని రూల్ చేస్తుందని ఆరోపించారు. వ్యాపారస్తులు ప్రభుత్వ స్నేహితులుగా ఉన్నారని అందువల్లే ఈ అంశంలో ప్రభుత్వం స్పందించడం లేదని ధ్వజమెత్తారు. అన్ని ప్రతిపక్ష పార్టీలు వాయిదా తీర్మానం ఇచ్చినా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. ముడుపుల కోసం, గుజరాతీ వ్యాపారస్తుల కోసం ప్రధాని మోడీ ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు.

Advertisement

Next Story

Most Viewed