జై శ్రీరామ్ నినాదంపై బీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన మల్లారెడ్డి

by Prasad Jukanti |
జై శ్రీరామ్ నినాదంపై బీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన మల్లారెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో:ఎంపీ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయం మరోసారి జై శ్రీరామ్ నినాదం చుట్టూ తిరుగుతోంది. జై శ్రీరామ్ నినాదం కడుపు నింపదని, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలు చేయగా మేము మారీచుడి నోటి నుంచి అయినా.. నీచుడి నోటి నుంచి అయినా శ్రీరామ నామం గొప్పతనం చెప్పింగలం అంటూ బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. ఈ నినాదం విషయంలో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్య మాటల యుద్దం నడుస్తోంది. రాజకీయంగా ఇరు పార్టీల మధ్య శ్రీరాముడి నినాదం విషయంలో హాట్ హాట్ గా రాజకీయం సాగుతున్న వేళ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత మల్లారెడ్డి అయోధ్య రామ మందిర దర్శనం పొలిటికల్ సర్కిల్స్ లో చర్చకు దారి తీసింది. ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుతో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలతో మల్లారెడ్డి అయోధ్య టూర్ ఆసక్తిని రేపుతున్నది. ఈ టూర్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మల్లారెడ్డి బృందం దైవదర్శనం విషయం అలా ఉంచితే ఈ టూర్ వెనుక పొలిటికల్ టచ్ ఉందనే కామెంట్స్ సోషల్ మీడియాలో గుప్పుమంటున్నాయి.

మల్లన్న టు బీజేపీ వయా అయోధ్య:

మల్లారెడ్డి ఇటీవల పార్టీ మారుతారనే ప్రచారం జోరుగా వినిపిస్తోంది. కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నం చేసినా కుదరకపోవడంతో ఇక బీజేపీ వైపు చూస్తు్న్నారనే చర్చ జరుగుతోంది. తాను పార్టీ మారడం లేదని పైకి చెబుతున్నా ఏదో ఒక అనువైన సమయంలో కండువా మార్చుడు ఖాయం అనే పొలిటికల్ కారిడార్ లో వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఓ వైపు అయోధ్య రాముడి విషయంలో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా వ్యవహారం సాగుతున్న సమయంలో మల్లారెడ్డి అయోధ్య టూర్ కు వెళ్లడం వెనుక పొలిటికల్ ఇంటెన్షన్ ఎదైనా ఉందా అనే చర్చ జరుగుతోంది. మల్లారెడ్డి ఫోటోలపై స్పందిస్తున్న నెటిజన్లు త్వరలోనే మల్లారెడ్డి బీజేపీలోకి చేరుతారని అందులో భాగంగానే అయోధ్య టూర్ కు వెళ్లారని కామెంట్స్ చేస్తే, మల్లన్నా, శంభీపూర్ రాజు త్వరలోనే బీజేపీ గూటికి చేరుతారని మరొక నెటిజన్ కామెంట్ చేశారు. జైశ్రీరామ్ నినాదం అన్నం పెట్టదన్న కేటీఆర్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అయోధ్య రాముడి దర్శనానికి వచ్చారని సమజ్ అయిందా కేటీఆర్ అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. మరి మల్లారెడ్డి పార్టీ మారుతారా లేక ఇది కేవలం దైవదర్శనం టూరేనా అనేది కాలమే సమాధానం చెబుతుందని మరికొంత మంది చెబుతున్నారు.

Advertisement

Next Story