మహారాష్ట్రలో అవినీతి రహిత పాలనందించడమే BRS లక్ష్యం: CM కేసీఆర్

by Satheesh |   ( Updated:2023-05-01 17:17:43.0  )
మహారాష్ట్రలో అవినీతి రహిత పాలనందించడమే BRS లక్ష్యం: CM కేసీఆర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: మహారాష్ట్రలో అతినీతి రహిత, నీతివంతమైన పాలన అందించటమే బీఆర్ఎస్ లక్ష్యం అని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. దేశంలో ప్రజాప్రతినిధులకు నియోజకవర్గాల్లో ప్రభుత్వ నిధులతో ఆఫీసులు కట్టించిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది అని స్పష్టం చేశారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ గాలి వీస్తుందని వెల్లడించారు. తెలంగాణ భవన్‌లో సోమవారం మహారాష్ట్రకు చెందిన పలువురు నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మహారాష్ట్రలో పార్టీ నిర్మాణం, బలోపేతంపై చర్చించారు. పార్టీకి అనుబంధంగా పలు కమిటీల నిర్మాణంతో పాటు 288 నియోజకవర్గాల పరిథిలోని గ్రామాలు, రాష్ట్రవ్యాప్తంగా తాలూకాలు జిల్లాల వారీగా బీఆర్ఎస్ శాఖలను ఏర్పాటు చేసి పార్టీని నిర్మాణాత్మకంగా మరాఠా ప్రజల్లోకి తీసుకుపోయే దిశగా కార్యాచరణపై మహారాష్ట్ర నుంచి వచ్చిన ముఖ్యనేతలతో అధినేత సీఎం కేసీఆర్ చర్చించారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తాను ఎమ్మెల్యేగా వున్న తొలినాళ్లలో మహారాష్ట్ర గురించి గొప్పగా చెప్పుకునే వాల్లమని.. బాబాసాహెబ్ అంబేద్కర్ నుంచి అన్నా హజారే దాకా గొప్ప చైతన్యాన్ని ఈ దేశానికి అందించిన మహారాష్ట్ర నుంచి తాను చాలా నేర్చుకున్నానని కానీ నేడు మహారాష్ట్రకు తానే నేర్పుతున్నానని, నేర్చుకోవడం నేర్పడం జ్జాన సముపార్జనలో భాగమని అన్నారు. నాడు తలఎత్తుకుని చూసిన మహారాష్ట్రను ఇటువంటి పరిస్తితుల్లో చూడాల్సి రావడానికి ఇన్నాళ్లుగా అక్కడి ప్రభుత్వాలు అనుసరించిన బాధ్యతారాహిత్య నిర్లక్ష్యపూరిత ధోరణులే కారణమని సీఎం అన్నారు.

‘గొప్ప సామాజిక సాంస్కృతిక రాజకీయ చైతన్యం కలిగిన మహారాష్ట్ర లో పరిపాలన రోజు రోజుకూ దిగజారి పోతున్నది. మహారాష్ట్ర ప్రజలు గొప్ప చైతన్యవంతులు. వాల్ల జీవితాల్లో గుణాత్మాకాభివృద్ధిని తీసుకురావడానికి బీఆర్ఎస్ పార్టీ అహర్నిషలు కృషి చేస్తుందన్నారు. ఇప్పటికే.. మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ అక్కడి ప్రజల ఆదరాభిమానాలను రోజు రోజుకూ చూరగొంటున్నది. అక్కడ పల్లెల్లో బీఆర్ఎస్ గురించి చర్చిస్తున్నారు. ఇన్నాల్లూ ప్రభుత్వాలను నడిపిన అక్కడి పార్టీలు వారి అభివృద్ధిని నిర్లక్ష్యం చేశాయనే విషయాన్ని మరాఠా ప్రజలు గ్రహించారు.

అదే సందర్భంలో తెలంగాణ ప్రగతి మోడల్ వారిని అమితంగా ఆకట్టుకుంటున్నదన్నారు. బీఆర్ఎస్ నిర్వహించిన ప్రతి సభను విజయవంతం చేస్తూ పార్టీ పిలుపులో భాగస్వాములౌతూ వారు కనబరుస్తున్న ఉత్సాహం గొప్పగా వున్నది. నాడు తెలంగాణ ఉద్యమ సమయం మాదిరి నేడు మహారాష్ట్రలో ప్రజా స్పందన స్పష్టంగా కనిపిస్తున్నదన్నారు. ఇప్పుడు.. మహారాష్ట్రలో బీఆర్ఎస్ గాలి వీస్తున్నది’ అని అధినేత సీఎం కేసీఆర్ అన్నారు.

మహారాష్ట్రలో మొదటి దశలో నాలుగు ముఖ్యపట్టణాలైన నాగపూర్, ఔరంగాబాద్, పూనే, ముంబైల్లో పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 288 అసెంబ్లీ నియోజకవర్గాల పరిథిలోని స్థానిక నేతలు ప్రతిరోజు గ్రామ గ్రామానికి వెళ్లి గ్రామ శాఖలను ఏర్పాటు చేయడం వంటి పార్టీ నిర్మాణ కార్యక్రమాలు చేపడుతూ పార్టీని ప్రజల్లోకి తీసుకుపోయేందుకు సంబంధించి అన్ని రకాల ప్రచార సామాగ్రిని సిద్ధం చేసి ఏర్పాట్లు పూర్తి చేసినట్టు అధినేత తెలిపారు.

మహారాష్ట్రంలో ఏ పార్టీతోని కూడా పొత్తు ఉండదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర కు చెందిన పలువురు నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి అధినేత పార్టీలోకి ఆహ్వానించారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్‌కు విశేష ఆదరణ వస్తుంది. మహారాష్ట్ర నలుమూలల నుంచి ఎంతోమంది బీఆర్ఎస్ విధానాలకు ఆకర్షితులు అవుతున్నారన్నారు.

నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, నిత్యావసర వస్తువుల ధరలు, గ్యాస్ ధర ఇలా అన్ని రంగాల్లో దేశం దివాళా తీసిందని, మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మే 5 నుంచి జూన్ 5 వరకు పార్టీ విస్తరణకు కార్యచరణ చేపట్టాలన్నారు. గ్రామ గ్రామాన పార్టీ కమిటీలు వేయాలి. వీటితోపాటు రైతు, విద్యార్థి, యువజన, మహిళా, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఇలా 9 కమిటీలు వేయాలని, ఈ కమిటీల ద్వారా తెలంగాణ మోడల్‌ను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. రోజుకు కనీసం 5 గ్రామాల చొప్పున తిరగాలి. ఈ సమయంలో రైతుబంధు, రైతుబీమా, దళితబంధు పథకాలను కచ్చితంగా అమలు చేస్తామని వివరించారు.

పార్టీ ప్రచార సామాగ్రి సిద్ధం అవుతుంది. మరాఠీ భాషలో పాటలు సిద్ధం అయ్యాయని, బీఆర్ఎస్ మహారాష్ట్రలో ప్రభజంనం సృష్టించబోతున్నది. అందులో ఎవరికీ అనుమానం అక్కరలేదన్నారు. సమావేశంలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న, బోథ్ ఎమ్మెల్యే బాపూరావు రాథోడ్, ఎంపీ బి బి పాటిల్, మాజీ కేంద్రమంత్రి వేణుగోపాలచారి తదితరులతో మాహారాష్ట్ర బిఆర్ఎస్ ముఖ్యనేతలు మాణికం కదం, శంకరన్నడోంగే, సుధీర్ సుధాకార్ రావు బిందు, మాజీ ఎంపీ హరిబావు రాథోడ్, మాజీ ఎమ్మల్యేలు చరణ్ వాగ్మారే, దీపక్ ఆత్రం, రాజు తొడసం, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed