BREAKING: విష ప్రచారం, తప్పుడు హామీలే కాంగ్రెస్‌ను గెలిపించాయ్: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Shiva |   ( Updated:2024-07-12 07:44:33.0  )
BREAKING: విష ప్రచారం, తప్పుడు హామీలే కాంగ్రెస్‌ను గెలిపించాయ్: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌‌డెస్క్: ఇటీవల జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో విష ప్రచారం, తప్పుడే హామీలే కాంగ్రెస్ పార్టీని గెలిపించాయని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం హైదరాబాద్‌లో శంషాబాద్ మల్లికా కన్వేన్షన్‌లో బీజేఎల్పీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌తో పాటు ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో విపక్షాలు రాజ్యాంగాన్ని మార్చేస్తారని, ప్రస్తుతం అమలు అవుతోన్న అన్ని రిజర్వేషన్లను ఎత్తి వేస్తారంటూ బీజేపీపై విషం చిమ్మారంటూ మండిపడ్డారు.

అయినా, తెలంగాణలో కమలం పార్టీ అసాధారణ విజయాలను నమోదు చేసిందని పేర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా తమ విజయాన్ని ఆపలేకపోయారని తెలిపారు. అదేవిధంగా రాష్ట్రంలో బీజేపీ ఓటింగ్ శాతం ఊహించని విధంగా పెరిగిందని అన్నారు. దేశ భద్రతను, ప్రజల అవసరాలను దృష్టి పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాను గుర్తు పెట్టుకుని బీజేపీకి ఓటు వేసిన తెలంగాణ జనానికి సెల్యూట్ చేస్తున్నానని కిషన్‌రెడ్డి అన్నారు. మరోవైపు లోక్‌సభ ఎన్నికల్లోనూ తమ పార్టీకి మంచి విజయాలే లభించాయని పేర్కొన్నారు. 17 లోక్‌సభ స్థానాలకు గాను 8 స్థానాల్లో తమ అభ్యర్థులను గెలిపించారని అన్నారు. చాలా స్థానాల్లో బీజేపీని ప్రజలు రెండో స్థానంలో నిలబెట్టారని తెలిపారు.

ముఖ్యంగా కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ చారిత్రాత్మక విజయం సాధించిందని అన్నారు. అక్కడ మాజీ సీఎం కేసీఆర్, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డిని ఓడించి బీజేపీ అభ్యర్థి వెంకటరమణా రెడ్డి పట్టం కట్టారని గుర్తు చేశారు. రేవంత్ సొంత ఉమ్మడి జిల్లా అయిన మహబూబ్‌నగర్‌లోనూ కమలం వికసించడం ఆనందదాయకమని కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో పదేళ్లు అధికారం వెలగబెట్టిన బీఆర్ఎస్ ఒక్కటంటే ఒక్క ఎంపీ సీటు గెలవలేక చతికిలబడిందని ఎద్దేవా చేశారు. మొత్తం 44 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు రెండో స్థానంలో ఉన్నారని తెలిపారు. ఈ పరిణామం రానున్న రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారాన్ని చేపట్టేందుకు శుభ సూచికమని పేర్కొన్నారు. వంద రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ మోసం చేసిందని, ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు గడుస్తున్నా.. హామీలు అమలు కావడం లేదని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed