BREAKING: కాంగ్రెస్ నేతలు పరాన్నజీవుల్లా ప్రవర్తిస్తుండ్రు: మాజీ మంత్రి హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు

by Shiva |
BREAKING: కాంగ్రెస్ నేతలు పరాన్నజీవుల్లా ప్రవర్తిస్తుండ్రు: మాజీ మంత్రి హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ నేతలు పరాన్న జీవులుగా ప్రవర్తిస్తున్నారని, వారి ప్రవర్తనతో ప్రజలు నవ్వుకుంటున్నారని మాజీ హరీశ్‌రావు ఫైర్ అయ్యారు. ఇవాళ హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీతారామ ఎత్తిపోతల పథకం కేసీఆర్‌కు చాలా ఇష్టమైన ప్రాజెక్ట్ అని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 90 శాతం పనులు పూర్తయిన ప్రాజెక్ట్‌ను కాంగ్రెస్ నేతలు తామే కట్టినట్లుగా చెప్పుకోవడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోపే సీతారామ ప్రాజెక్ట్ కాంగ్రెస్ సర్కార్ పూర్తి చేసిందా.. అంటూ సెటైర్లు వేశారు. హస్తం పార్టీ నేతలు పరాన్న జీవులుగా తయారయ్యారని, వారి ప్రవర్తన చూసి జనం కూడా నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా.. ఖమ్మం జిల్లాను కరువు కోరల్లోంచి బయటకు తీసుకొచ్చేందుకు సీతారామ ప్రాజెక్ట్ కట్టాలని కేసీఆర్ ఆనాడే సంకల్పించారని గుర్తు చేశారు. జిల్లాలో ఇవాళ అన్ని పనులు పూర్తయ్యాక మంత్రులు పోటీపడి మరీ పర్యటనలు చేస్తున్నారని ఆరోపించారు. ఇలా ఒక్కటి కాదు.. తాము పరీక్షలు నిర్వహించిన ఉద్యోగాలను సైతం కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చిందని ఆ పార్టీ నేతలు గొప్పలు చెప్పుకోవడ హాస్యాస్పదంగా ఉందన్నారు. కేసీఆర్ కాకుండా సీతారామ ప్రాజెక్టును వేరే వారు రూపకల్పన చేసి ఉంటే అంత బాగా ఫలితం వచ్చేదా అని ప్రశ్నించారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఖమ్మం జిల్లాకు చుక్కనీరు కూడా ఇవ్వలేదని, ఇవాళ అదే జిల్లాలో రెండు పంటలు పండేలా కేసీఆర్ ఆ ప్రాజెక్టును రూపకల్పన చేశారని పేర్కొన్నారు. వందేళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా ప్రాజెక్టును నిర్మించామని పేర్కొన్నారు. మొత్తం 8 ప్యాకేజీల్లో 5 బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందని, మరో మూడు ప్యాకేజీల్లో 80 శాతం పనులు తమ ప్రభుత్వమే పూర్తి చేసిందని హరీశ్‌రావు స్పష్టం చేశారు.

Advertisement

Next Story