కుంభకోణాలకు కేరాఫ్ కాంగ్రెస్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాట్ కామెంట్స్

by Shiva |   ( Updated:2024-04-29 08:32:36.0  )
కుంభకోణాలకు కేరాఫ్ కాంగ్రెస్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: కుంభకోణాలకు కేరాఫ్ కాంగ్రెస్ పార్టీ అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ కొత్తగూడెంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో దేశానికి ఒరిగిందేమి లేదని ఆరోపించారు. పదేళ్ల నరేంద్ర మోడీ పాలనలో ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోయేలా అభివృద్ధి జరగలన్నారు. ఎస్టీల అభివృద్ధి కోసం బీజేపీ సర్కార్ కృషి చేస్తోందని అన్నారు. అదేవిధంగా గిరిజనుల సంక్షేమం కోసం అనేక పథకాలు చేపట్టామని పేర్కొన్నారు. 500 ఏళ్ల దేశ ప్రజల కల రామమందిరాన్ని నిర్మించామని తెలిపారు. అదేవిధంగా ఆర్టికల్ 370ని రద్దు చేశామని పేర్కొన్నారు.

ముస్లిం మహిళల అభ్యున్నతి దృష్టిలో పెట్టుకుని ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేశామని అన్నారు. మేకిన్ ఇండియా పేరుతో దేశంలో సెల్‌ఫోన్లు తయారు చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ అద్భుతంగా ఉందని, ఆ విషయంలో మన దేశం 11వ స్థానం నుంచి 5 స్థానానికి ఎగబాకిందని అన్నారు. దేశంలో తయారైన వివిధ ఔషధాలు ప్రపంచ దేశాకు కూడా వెళ్తున్నాయని గుర్తు చేశారు. రాబోయే రెండేళ్లలో మన దేశం రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారబోతోందని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా 80 కోట్ల మందికి ఉచితం రేషన్ అందజేస్తున్న ఘటన బీజేపీకే దక్కుతోందని అన్నారు. పదేళ్ల పాలనలో 4 కోట్ల మందికి ఇండ్లు కట్టించి ఇచ్చామని, మరో 3 కోట్లు ఇండ్లు కట్టించి ఇవ్వబోతున్నాయని తెలిపారు.

ప్రస్తుతం కాంగ్రస్ సర్కార్ అసమర్థ పాలనను కూడా చూస్తున్నాయని తెలిపారు. మతం ఆధారంగా రిజర్వేషన్లు కల్పించకూడదనేదే తమ అభిమతమని అన్నారు. తమ వారసుల కోసం ఆయా పార్టీలు ఇండియా కూటమి పెట్టారని విమర్శించారు. ఆ కూటమి నేతలు కూడా అనేక కుంభకోణాలకు పాల్పడ్డారని ఆరోపించారు. రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో అన్ని రంగాల్లో అవినీతి రాజ్యమేలిందని ఆరోపించారు. కేసీఆర్ కుమార్తె కవిత ఢిల్లీ మద్యం కేసు కుంభకోణంలో ఇరుక్కున్నారని స్పష్టం చేశారు. పదేళ్లు ప్రజా సేవకే అంకితమైన ఎన్డీఏ ప్రభుత్వంలో ఓ చిన్న మరక కూడా లేదని తెలిపారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్‌రావు అత్యధిక మెజారిటీతో గెలిపించాలని జేపీ నడ్డా పిలుపునిచ్చారు.

Advertisement

Next Story