కేసీఆర్ ఇంటి పక్కన క్షుద్రపూజల కలకలం

by Prasad Jukanti |   ( Updated:2024-04-16 08:01:21.0  )
కేసీఆర్ ఇంటి పక్కన క్షుద్రపూజల కలకలం
X

దిశ, డైనమిక్ బ్యూరో:మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటి పక్కన క్షుద్రపూజలు కలకలం రేపాయి. హైదరాబాద్ నందినగర్ లోని కేసీఆర్ ఇంటి పక్కన ఉన్న ఖాళీ ప్రదేశంలో క్షుద్రపూజలు చేసిన ఆనవాళ్లు కనిపించాయి. అక్కడ ఓ బొమ్మ, నిమ్మకాయలు, మిరపకాయలు, కవర్ లో నల్ల కోడి దాని ఈకలు, కుంకుమ వంటి ఆనవాళ్లు అక్కడ ఉండటం కలకలంగా మారింది. గత రాత్రి ఈ క్షుద్రపూజలు చేయగా ఈ విషయాన్ని గమనించిన స్థానికులు, కేసీఆర్ సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. తమకు అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. అయితే కేసీఆర్ నివాసానికి అత్యంత సమీపంలో ఈ క్షుద్రపూజలు చేసింది ఎవరు? అనేది సంచలనంగా మారింది. అయితే ప్రస్తుతం కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉన్నట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలో అధికారం కోల్పోవడం, కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండటం, కవిత అరెస్ట్ వంటి అంశాలు బీఆర్ఎస్ కు ఎదురుదెబ్బలుగా మారాయి. ఈ నేపథ్యంలో ఇటీవల తెలంగాణ భవన్ కు వాస్తు మార్పులను సైతం చేపట్టారు. ఇంతలో కేసీఆర్ నివాసానికి అత్యంత సమీపంలో క్షుద్రపూజల అనవాళ్లు కనిపించడం హాట్ టాపిక్ గా మారింది. ఇది ఎవరు చేశారు?ఎందుకు చేశారు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రముఖులు నివాసం ఉంటే ఈ ప్రాతంలో క్షుద్రపూజల అనవాళ్లు కనిపించడంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పని చేసిందెవరూ అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story