పార్లమెంట్ ఎన్నికలకు బీజేపీ ప్రణాళిక.. ‘అసెంబ్లీ’ తప్పిదాలు జరగకుండా ప్లాన్!

by GSrikanth |
పార్లమెంట్ ఎన్నికలకు బీజేపీ ప్రణాళిక.. ‘అసెంబ్లీ’ తప్పిదాలు జరగకుండా ప్లాన్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: పార్లమెంట్ ఎన్నికలకు కాషాయ పార్టీ పక్కా ప్రణాళికను ఫిక్స్ చేస్తున్నది. తెలంగాణలో డబుల్ డిజిట్ సీట్లే లక్ష్యంగా పావులు కదుపుతున్నది. గల్లీలో ఎవరున్నా.. ఢిల్లీలో ప్రధానిగా మోడీ ఉండాలనే నినాదంతో జనానికి చేరువ కావాలని చూస్తున్నది. అందులో భాగంగా 90 డేస్ యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నది. ముందుగా బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతంపై చేయడంపై దృష్టి సారించింది. పార్లమెంట్ సెగ్మెంట్లతో పాటు అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా రివ్యూలు నిర్వహించేందుకు సిద్ధమైంది.

పార్లమెంట్ స్థానాల వారీగా సమీక్షలు

పార్టీ బలోపేతం, నేతల పనితీరుపై పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా హై కమాండ్ సమీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే పార్టీ రాష్ట్ర సంస్థాగత ఇన్ చార్జి సునిల్ బన్సల్ పలు సెగ్మెంట్లపై రివ్యూలు కూడా జరిపినట్లు సమాచారం. కాగా, బుధవారం హైదరాబాద్ లోక్ సభ స్థానంపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. ఆ తర్వాత అన్ని స్థానాలకు ఈ రివ్యూ కొనసాగనున్నది. ఆయా సెగ్మెంట్లలో పార్టీ, నేతల పనితీరు, గతంలో వచ్చిన ఓట్లు, ఈసారి పరిస్థితిపై పార్టీ ఒక అంచనాకు వచ్చేందుకు ముందుగానే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది. పార్లమెంట్ రివ్యూల అనంతరం అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా సమీక్షలు నిర్వహించి విజయబావుటా ఎగరేయాలని బీజేపీ భావిస్తున్నది.

‘అసెంబ్లీ’ తప్పిదాలు జరగకుండా..

అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పిదాలను మరోసారి జరగకుండా జాతీయ నేతలు రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేయనున్నట్లు తెలిసింది. అలాగే ‘వికసిత్ భారత్ సంకల్ప యాత్ర’ పేరిట కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన యాత్రను 2024 లోక్ సభ ఎన్నికలకు వినియోగించుకోవాలని భావిస్తున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటుకే పరిమితమైన బీజేపీ లోక్ సభ ఎన్నికల్లో 4 సీట్లు సాధించింది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లు గెలుపొందగా, దానికి అనుగుణంగానే డబుల్ డిజిట్ లోక్ సభ స్థానాల్లో గెలవాలని ప్లాన్ చేసుకున్నది.

Next Story

Most Viewed