ఈ నెల 11న నల్లగొండలో బీజేపీ సభ

by Javid Pasha |   ( Updated:2023-08-03 14:29:04.0  )
ఈ నెల 11న నల్లగొండలో బీజేపీ సభ
X

దిశ, తెలంగాణ బ్యూరో : డబుల్ బెడ్రూం ఇండ్లను లబ్ధిదారులకు కేటాయించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. అందులో భాగంగా ఈనెల 11వ తేదీన నల్లగొండ జిల్లాలో ఆందోళనలకు రాష్ట్ర పార్టీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. అదే రోజు నల్లగొండ జిల్లా కేంద్రంలో సభకు ప్లాన్ చేసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఈమేరకు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి.. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన నేతలతో భేటీ అయ్యారు. ఆందోళనలు, సభ నిర్వహణపై చర్చించారు.

నిరుపేదలకు సొంతింటి కల నిజం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల్లో హామీ ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు లబ్ధిదారులకు ఇండ్లు కేటాయించకపోవడంపై పోరాడాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం పిలుపునిచ్చింది. ఇప్పటికే బాటసింగారం డబుల్ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించేందుకు కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. కానీ పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం మహబూబ్ నగర్ జిల్లాలో డబుల్ ఇండ్లను ఇటీవల కిషన్ రెడ్డి పరిశీలించారు. సభ నిర్వహించారు.

అదే తరహాలో నల్లగొండలోనూ డబుల్ ఇండ్లను పరిశీలించడంతో పాటు సభ నిర్వహించాలని బీజేపీ డిసైడ్ అయింది. అంతేకాకుండా బీఆర్ఎస్ కు చెందిన పలువురు నేతలను పార్టీలోకి చేర్చుకోవాలని చూస్తోంది. ఇప్పటికే పలువురు నేతలతో చర్చలు పూర్తయినట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే అదే రోజు వారు చేరే అవకాశం ఉంది.

Advertisement

Next Story