కీలక హామీలతో బీజేపీ తెలుగు మేనిఫెస్టో విడుదల

by Prasad Jukanti |
కీలక హామీలతో బీజేపీ తెలుగు మేనిఫెస్టో విడుదల
X

దిశ, డైనమిక్ బ్యూరో:సమాజంలోని అట్టడుగున ఉన్న యువకులు, మహిళలు, పేదలు, రైతుల అభ్యున్నతికి పాటుపడుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నేతలతో కలిసి బీజేపీ లోక్ సభ ఎన్నికల మేనిఫెస్టో తెలుగు వెర్షన్ 'మన మోడీ గ్యారంటీ 2024' పేరుతో విడుదల చేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. పంటల బీమా మరింత సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు భారతదేశాన్ని మిల్లెట్ హబ్ గా మర్చుతామని అన్నారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలోనే అతి పెద్ద మూడవ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు. నాణ్యమైన విద్య, అందరికీ ఆరోగ్యం, పేదలకు పక్కా ఇళ్లు గ్యారంటీతో పాటు మరో ఐదేళ్ల వరకు ఉచిత బియ్యం ఇచ్చే కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు. పేపర్ లీకేజీ అరికట్టే విషయంలో కఠిన చట్టాలు తీసుకొచ్చామని, పోస్టాఫీసులను మినీ బ్యాంక్ లుగా మార్చేస్తున్నామని, భారత్ ను సర్వీస్ సెక్టార్ హబ్ గా విస్తరిస్తామని అన్నారు. మత్స్యకారులను అన్ని రకాలుగా ఆదుకుంటామని దేశ భవిష్యత్ కోసమే వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఆలోచన అన్నారు.

ఇది ప్రజల మానిఫెస్టో అన్న కిషన్ రెడ్డి.. మోడీ గ్యారంటీ అంటే కచ్చితంగా అమలుచేసేస్తారని చెప్పారు. 2047 వికసిత భారత్ పేరుతో బీజేపీ ముందుకెళ్తోందన్నారు. అవినీతి, బంధుప్రీతిని కాంగ్రెస్ పూర్తిగా వదిలిపెట్టలేదని విమర్శించారు. కాగా మోడీ గ్యారెంటీ, 2047 నాటికి వికసిత భారత్ థీమ్ తో బీజేపీ రూపొందించిన జాతీయ మేనిఫెస్టోను వారం ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్ తదితరులు కలిసి విడుదల చేయగా తాజాగా ఇవాళ తెలంగాణలో తెలుగు మేనిఫెస్టోను రాష్ట్ర నేతలు విడుదల చేశారు. కాగా బీజేపీ ప్రకటించిన మేనిఫెస్టోలో 14 అంశాలను చేర్చారు. మూడు కోట్ల ఇళ్ల నిర్మాణం, మరో ఐదేళ్లు ఉచిత రేషన్, పైప్ లైన్ ద్వారా ఇంటింటికీ వంట గ్యాస్, ముద్ర రుణాల పరిమితి రూ. 20 లక్షల వరకు పెంపు, ఎప్పటికప్పుడు పంటల మద్దతు ధర పెంపు వంటి ముఖ్యమైన హామీలు ఉన్నాయి.

ఇండియా ఎన్డీఏ మధ్య తేడా అదే: లక్ష్మణ

కాంగ్రెస్ ప్రవేశపెట్టిన న్యాయ పత్రం విభజన రాజకీయాలు చేస్తున్నట్లుగా ఉంటే బీజేపీ సంకల్ప పత్రం చూస్తే వికసిత భారత్ కనిపిస్తుందని ఇదే ఈ రెండు పార్టీల మేనిఫెస్టోలకు ఉన్న తేడా అని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డా.కె. లక్ష్మణ్ అన్నారు. తెలుగు మేనిఫెస్టో విడుదల సందర్భంగా మాట్లాడిన ఆయన.. గత యూపీఏ ప్రభుత్వాన్ని చూసిన ప్రజలే మోడీకి అవకాశం ఇచ్చారని గత పదేళ్లుగా మోడీ ప్రభుత్వం పని తీరును ప్రజలు చూశారన్నారు. గతంలో అనేక కుంభకోణాలు, అవినీతికి పాల్పడిన యూపీఏ పేరు మార్చుకుని ఇండియా కూటమిగా ఏర్పడ్డారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఆస్తులను వారు ఎలా దోచుకున్నారో ప్రజలకు తెలుసని న్యాయ పత్రం బ్రిటీష్ యొక్క వారసత్వాన్ని గుర్తు చేస్తున్నదని విమర్శించారు. విభజించి పాలించే విధానాలు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్నాయని అందులో ప్రజల అభివృద్ధికి సంబంధించిన అంశాలు మచ్చుకైనా కనిపించడం లేదని విమ్రశించారు. ప్రజల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని బీజేపీ సంకల్ప పత్రం తయారు చేశామన్నారు. మైనారిటీ ముసుగులో మెజారిటీ ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా కాంగ్రెస్ పని చేస్తోందని తెలంగాణాలో కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల పేరుతో మోసం చేసిందని ధ్వజమెత్తారు. తెలంగాణాలో మహిళలకు ఇస్తానన్న 4 వేల ఆర్థిక సాయం ఇవ్వలేని కాంగ్రెస్ దేశంలో ఉన్న మహిళలందరికీ లక్ష రూపాయలు ఎలా ఇస్తారో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. అమలుకు సాధ్యం అయ్యే గ్యారెంటీలే మోది గ్యారెంటీలు అని చెప్పారు.

Advertisement

Next Story