కేసీఆర్ సర్కార్‌పై పోరు.. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నిరసనలు

by Sathputhe Rajesh |   ( Updated:2022-04-19 23:31:00.0  )
కేసీఆర్ సర్కార్‌పై పోరు.. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నిరసనలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఖమ్మం జిల్లాలో బీజేపీ కార్యకర్త సాయిగణేష్‌ ఆత్మహత్యపై అధిష్ఠానం ఆరా తీసింది. ఆయన ఆత్మహత్యకు గల కారణాలను బాధిత కుటుంబసభ్యులకు నేరుగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​ షా ఫోన్ ​చేసి మాట్లాడి భరోసానిచ్చారు. ఇదిలా ఉండగా బుధవారం తెలంగాణకు కేంద్ర ఐటీ, స్కిల్​ డెవలప్​మెంట్​శాఖ సహాయ మంత్రి రాజీవ్​ చంద్రశేఖర్​ రానున్నారు. ఖమ్మం జిల్లాలో మృతి చెందిన కార్యకర్త సాయి గణేశ్​ కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు. తొలుత స్థానిక నేతలతో కలిసి గవర్నర్​తో ఆయన భేటీ అయి రామాయంపేట, ఖమ్మం జిల్లా ఆత్మహత్యలపై తమిళిసైతో చర్చించనున్నారు. ఇదిలా ఉండగా అధికార పార్టీ ఆగడాలపై బీజేపీ సమరశంఖం పూరించింది. అత్యాచారాలు, హత్యలు, ఆత్మహత్యలు సహా టీఆర్ఎస్ నాయకులు చేస్తున్న దాష్టికాలను అడ్డుకోవడమే లక్ష్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, బండి సంజయ్ కుమార్(బీఎస్‌కే) రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ప్రజా సంగ్రామయాత్రలో భాగంగా గద్వాల జిల్లాలో పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్ మంగళవారం సాయంత్రం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇంచార్జ్ లు, రాష్ట్ర నాయకులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఖమ్మం టౌన్ లో టీఆర్ఎస్ నేతలు, పోలీసుల వేధింపులకు తాళలేక సూసైడ్ చేసుకున్న బీజేపీ కార్యకర్త సాయిగణేష్ తోపాటు కొత్తగూడెంలో స్థానిక ఎమ్మెల్యే తనయుడు వనమా రాఘవేందర్ వేధింపులకు ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకున్న రామకృష్ణ దంపతుల ఉదంతాన్ని సంజయ్ ఈ సందర్భంగా వివరించారు. దీంతోపాటు రామాయంపేటలో టీఆర్ఎస్ మున్సిపల్ ఛైర్మన్ సహా ఆ పార్టీ నేతల బెదిరింపులకు భయపడి సూసైడ్ చేసుకున్న గంగం సంతోష్, అతని తల్లి లాడ్జీలో ఉరేసుకుని చనిపోయిన అంశాన్ని ప్రస్తావించారు. అట్లాగే కూకుట్ పల్లిలో స్థానిక టీఆర్ఎస్ ఎమ్మెల్యే అనుచరుడు లైంగికంగా వేధిస్తున్నాడంటూ.. చర్యలు తీసుకోకపోతే చావే శరణ్యమంటూ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడాన్ని బండి సంజయ్ వివరించారు. సూర్యాపేట జిల్లా కోదాడలో స్థానిక టీఆర్ఎస్ కౌన్సిలర్ కుమారుడు, మైనారిటీ యువకుడు తన స్నేహితులతో కలిసి అమాయక యువతికి మత్తు మందు ఇచ్చి రోజుల తరబడి సామూహిక అత్యాచారం చేస్తూ చిత్రహింసలకు గురైన ఉదంతంపై పోరాడాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. సీఎం కేసీఆర్.. పేపర్లలో, టీవీల్లో వార్తలొస్తే పబ్లిసిటీ కోసం చర్యలు తీసుకుంటున్నట్లు నటిస్తారే తప్ప పబ్లిక్ కోసం ఏమాత్రం పనిచేయడం లేదని ఫైరయ్యారు. సీఎం తమనేమీ అనడం లేదని భావించి కొందరు టీఆర్ఎస్ నేతలు మరింత రెచ్చిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ దాష్టీకాలు, హత్యలు, అత్యాచారాలకు నిరసనగా బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నల్లజెండాలతో నిరసన చేపట్టాలని బండి సంజయ్​దిశానిర్దేశం చేశారు.

Advertisement

Next Story