కేసీఆర్ కు సీఎంగా ఉండే అర్హత లేదు.. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ

by Javid Pasha |
కేసీఆర్ కు సీఎంగా ఉండే అర్హత లేదు.. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ
X

దిశ, తెలంగాణ బ్యూరో : పేపర్ లీకేజీ చేసి నిరుద్యోగుల జీవితాలను నాశనం చేసిన కేసీఆర్ కు ముఖ్యమంత్రిగా ఉండే అర్హత లేదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శలు చేశారు. ధర్నా చౌక వద్ద బీజేపీ తలపెట్టిన నిరుద్యోగ మహాధర్నాకు ఆమె హాజరై మాట్లాడారు. కేసీఆర్, కేటీఆర్ ఇదిగో నోటిఫికేషన్లు అంటూ 8 ఏళ్లుగా ఊరించారని, వారి మాటలను నమ్మి కోచింగ్ తీసుకున్న నిరుద్యోగులంతా ఇప్పుడు నష్టసోయారని ఆమె మండిపడ్డారు. పేపర్ లీకేజీలో కల్వకుంట్ల కుటుంబం ఉన్నా తమ ప్రమేయం లేదని చెప్పడం విడ్డూరంగా ఉందని చురకలంటించారు. తప్పు చేసినవాళ్లను వదిలి.. పోరాడుతున్న బండి సంజయ్ కు సిట్ నోటీసులివ్వడంపై ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. కేసీఆర్ సర్కార్ ను తరిమికొట్టే వరకు ఐక్యంగా పోరాడుదామని ఆమె పిలుపునిచ్చారు. నీళ్లు-నిధులు-నియామకాల పేరుతో తెచ్చుకున్న తెలంగాణ ప్రజల ఉసురు కేసీఆర్ పోసుకుంటున్నాడని ఫైరయ్యారు. లిక్కర్ దందా చేసి అడ్డంగా దొరికిన కవితను ఈడీ విచారణ చేస్తే కక్ష సాధింపా? అని డీకే అరుణ సూటిగా ప్రశ్నించారు.

ఈడీ బీజేపీ సంస్థ అంటున్నారని, మరి ఇక్కడున్న సిట్, సీఐడీ సంస్థలు కూడా కేసీఆర్ సంస్థలేనా? అని ఆమె విమర్శలు చేశారు. ప్రజల పక్షాన గళం విప్పే వారిపై కక్ష సాధింపు చర్యలు, అరెస్టులా? అని ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. కవిత లిక్కర్ దందాపై కేసీఆర్ నోరెందుకు మెదపడం లేదని, తెలంగాణ ప్రభుత్వాన్ని మొత్తం ఢిల్లీకి ఎందుకు తీసుకుపోయినట్లని ఆమె ప్రశ్నించారు. పేపర్ లీకేజీపై అడ్డగోలుగా మాట్లాడుతూ విచారణను తప్పుదోవ పట్టిస్తున్న కేసీఆర్ కు, కేటీఆర్ కు, హరీష్ రావుకు నోటీసులివ్వాలే తప్ప బండి సంజయ్ కు నోటీసులిస్తారా? అని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ కు రోజులు దగ్గర పడ్డాయని, ప్రజా తీర్పును ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు.

బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనలో లీకేజీ పేరుతో వ్యాపారం జరుగుతోందని, లీకేజీ బయటపడేసరికి తమకు సంబంధం లేదని తండ్రీకొడుకులు తప్పించుకుంటున్నారని ఆమె పేర్కొన్నారు. సాధారణ ఉద్యోగులు చైర్మన్ చాంబర్ కు వెళ్లి లీకేజీ చేయగలరా? అని ఆమె ప్రశ్నించారు. సీఎం అంటే క్రిమినల్ మినిస్టర్ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలో గ్లోబరీనా సంస్థ నిర్వాకంవల్ల చనిపోయిన పిల్లల ప్రాణాలు తీసుకురాగలరా అని విజయశాంతి ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో విద్యారంగం సర్వనాశనమైందని విరుచుకుపడ్డారు. నిరుద్యోగుల భవిష్యత్ ను నాశనం చేసిన కేసీఆర్ కు సిగ్గు లేదని ఆమె విమర్శించారు. కచరా ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు వద్దని, అందరూ పోరాడాలని ఆమె పిలుపునిచ్చారు.

తమిళనాడు సహ ఇన్ చార్జీ పొంగులేటి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధులకు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చిన మరుక్షణమే ఎంపీ, ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని ఆనాడు చెప్పిన కాంగ్రెస్ నేతలు ఈరోజు సిగ్గు లేకుండా రాహుల్ గాంధీ అనర్హతను వ్యతిరేకించడం సిగ్గుచేటని విమర్శలు చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరుద్యోగుల పక్షాన ఆందోళన చేస్తున్న బీజేపీ నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేయడాన్ని ఆయన ఖండించారు. నిరుద్యోగులందరికీ బీజేపీ అండగా ఉంటుందని, వారికి ఉద్యోగాలిచ్చే వరకు పోరాడతామని ఆయన పేర్కొన్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. లీకేజీతో న్యూజిలాండ్ సహా విదేశాల నుండి వచ్చిన వారికి అత్యధిక మార్కులొచ్చాయని, ఈ అంశంపై మంత్రి కేటీఆర్ మెడలు వంచాల్సిందేనని విమర్శలు చేశారు. హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. కేసీఆర్ సర్కార్ భరతం పట్టే సమయం వచ్చిందని, చెంప చెళ్లుమన్పించే రోజు అతి దగ్గర్లోనే ఉందని మండిపడ్డారు. కేసీఆర్ సర్కార్ కూలిపోవడానికి ఎంతో దూరంలో లేదని పేర్కొన్నారు.

బండి సంజయ్ నాయకత్వంలో పేపర్ లీకేజీ, నియామకాలపై చేస్తున్న పోరాటానికి మద్దతివ్వాలని ఆయన కోరారు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడుతూ.. లీకేజీపై సిట్ అధికారులు నాలుగో తరగతి ఉద్యోగులనే ఎందుకు విచారణ చేస్తోందని, టీఎస్పీఎస్సీ సెక్రటరీ వద్దకు ఇప్పటి వరకైనా సిట్ ఎందుకు వెళ్లలేదని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ కాంగ్రెస్ ను బాగా పొగుడుతున్నాడని, కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే.. కాంగ్రెస్ తో కలిసి బీఆర్ఎస్ ఎంపీలను రాజీనామా చేసి సంఘీభావం తెలిపాలని సవాల్ విసిరారు. ఆ తర్వాత ప్రజాక్షేత్రంలోకి వస్తే తేల్చుకుందామన్నారు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. పేపర్ లీకేజీలో కేటీఆర్, ఆయన పీఏ పాత్ర ఉందని ఆరోపించారు. నిరుద్యోగులంతా మరో మిలియన్ మార్చ్ కోసం చూస్తున్నారని, కేసీఆర్ తీరుతో మరో ఉద్యమం తప్పేలా లేదని ఆయన పేర్కొన్నారు. మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చాక కూడా నిరుద్యోగులు ఉద్యమ బాట పట్టాల్సిన అవసరం ఎందుకొచ్చిందని ఆయన ప్రశ్నించారు.

కేసీఆర్ భయస్తుడని, ప్రజలు అడ్డుకుని నిలదీస్తారని సెక్యూరిటీని పెట్టుకున్నాడని విమర్శలు చేశారు. మునుగోడులో అమిత్ షా అడుగుపెడితే భయంతో వణికిపోయి పైసలు వెదజల్లి అక్రమంగా గెలిచారని ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణ ఉద్యమంలో లేని కోన్ కిస్కా రేవంత్ రెడ్డి అప్పులపాలైన తెలంగాణను ఎట్లా కాపాడతాడని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి చంద్రబాబు డైరెక్షన్ లో పనిచేస్తున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎక్కడ చూసినా లిక్కర్ క్వీన్, లీకేజీ అంశాలపై చర్చించుకుంటున్నారని, తప్పుచేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. దోషులకు శిక్షపడే వరకు పోరాడతామని పేర్కొన్నారు.

Advertisement

Next Story