MP Laxman: ఒక్క సీటుతో అధికారం కోల్పోయాం.. అయినా ఫిరాయింపులకు పాల్పడలేదు

by Gantepaka Srikanth |
MP Laxman: ఒక్క సీటుతో అధికారం కోల్పోయాం.. అయినా ఫిరాయింపులకు పాల్పడలేదు
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ కీలక నేత, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ విమర్శలు చేశారు. సోమవారం ఆయన హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాయలంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అసమర్థ పాలన సాగుతోందని విమర్శించారు. సీఎం, మంత్రులు ఢిల్లీకి పరుగులు పెట్టడం తప్పితే ప్రజలకు ఏమీ చేయడం లేదని అన్నారు. ఢిల్లీ నాయకులకు గులాంలుగా మారారని మండిపడ్డారు. వర్షాలు పడినా, వ్యాధులు ప్రబలుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు. గురుకులాల్లో విద్యార్థులు మరణిస్తున్నా కాంగ్రెస్ నేతలకు చీమ కొట్టినట్లు కూడా లేదని అన్నారు. ప్రతిరోజు వార్తల్లో నిలవాలని హైడ్రా పేరిట హడావుడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డైవర్ట్ పాలిటిక్స్‌కు తెరదీశారని అన్నారు. డెంగ్యూ జ్వరాలతో ఆస్పత్రులు నిండిపోయాయి.. వారికి వైద్య చర్యలు చేపట్టకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. గ్యారంటీల పేరిట అమలు కాని హామీలు ఇచ్చి మోసం చేస్తున్నారని తెలిపారు.

రైతుల పాలిట కాంగ్రెస్ భస్మాసుర హస్తంగా మారిందని అన్నారు. ‘రుణమాఫీ అవ్వక, రైతు భరోసా అందక ఇబ్బందులు పడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి 450 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అవినీతి, అక్రమాలకు కాంగ్రెస్ పెట్టింది పేరు. నీటి మీద రాతలుగా కాంగ్రెస్ హామీలు మారాయి. 15 నుంచి 20 లక్షల పంట నష్టం జరిగిందని ప్రభుత్వం చెబుతోంది. మరి వారిని ఎప్పుడు ఆదుకుంటారు. రాష్ట్రంలో టీచర్ల కొరత కారణంగా 1800 స్కూళ్ళు మూతపడ్డాయి. 600 మందికి పైగా విద్యార్థులు ఆస్పత్రి పాలయ్యారు. 40 మందికి పైగా విద్యార్థులు చనిపోయారు. బీసీ డిక్లరేషన్ ఏమైంది.. కులగణన లేదు.. సర్వే లేదు. 200కు పైగా హత్యలు, 1900 కు పైగా లైంగిక దాడులు జరిగాయి. బీఆర్ఎస్ వద్దని కాంగ్రెస్ కు అధికారం ఇస్తే ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారు. ఎమ్మెల్యేల ప్లేటు ఫిరాయింపులపై కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. ఒక పార్టీ గుర్తుపై గెలిచి.. మరో పార్టీలోకి వెళ్లడం సిగ్గుచేటు. వాజ్ పేయి.. ఒక్క సీటుతో అధికారం కోల్పోయారు.. అది తెలిసి కూడా మేము ఫిరాయింపులకు పాల్పడలేదు. సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న పార్టీ బీజేపీ’ అని లక్ష్మణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Next Story