తెలంగాణలో తెరపైకి కొత్త డిమాండ్.. మరింత ఆలస్యంగా పంచాయతీలు..?

by srinivas |
తెలంగాణలో తెరపైకి కొత్త డిమాండ్..  మరింత ఆలస్యంగా పంచాయతీలు..?
X

దిశ, ప్రతినిధి నిజామాబాద్: స్థానిక ఎన్నికల్లో సత్తా చూపేందుకు అన్ని రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్న వేళ.. పంచాయతీ ఎన్నికలు కుల గణన తర్వాతే నిర్వహించాలనే డిమాండ్ తెరపైకి రావడం.. ప్రభుత్వం కూడా ఆ దిశలో ఆలోచనలో పడటాన్ని బట్టి చూస్తే తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు మరి కొన్ని నెలలు ఆలస్యమయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇది వరకే స్థానిక సంస్థల ఎన్నికలకు కసరత్తు మొదలు పెట్టింది. ముసాయిదా ఓటర్ల జాబితాను కూడా ఈనెల 12న విడుదల చేసింది. ఎన్నికలకు ముందు చేపట్టాల్సిన పనులన్నీ చకచకా చేస్తోంది. ఇందులో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితాను కూడా పంచాయతీ రాజ్ శాఖ రిలీజ్ చేసింది. తాజాగా టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పదవీ ప్రమాణ స్వీకార మహోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలపై ఇచ్చిన హింట్ ఆశావహుల్లో మరింత టెన్షన్ క్రియేట్ చేస్తోంది.


అధికార పార్టీ నేతల్లోనే ఇబ్బడి ముబ్బడిగా ఆశావహులు

అధికార పార్టీ కాంగ్రెస్ నుండి ఆశావహులు ఇబ్బడి ముబ్బడిగా పుట్టుకొస్తున్నారు. ఈ సారి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటం స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపును ప్రభావితం చేస్తుందనే ధీమాతో చాలా మంది ఎంతైనా ఖర్చుకు వెనకాడకుండా బరిలో నిలిచేందుకు ఉబలాట పడుతున్నారు. మరో పక్క బీజేపీ‌లో కూడా ఆశావహుల సంఖ్య పెరిగే అవకాశాలున్నప్పటికీ, బీఆర్ఎస్ పరిస్థితి కొంచెం మిగతా పార్టీల కన్నా వెనకబడి ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. గ్రామస్థాయిలో పదవిని దక్కించుకున్నా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటంతో గెలిచినా ఆశించిన విధంగా అభివృద్ధి చేయలేమని, ఎన్నికల్లో ఖర్చు చేసిన నిధులు కూడా రాబట్టుకోవడం కష్టమనే ఆలోచనతో వెనకంజ వేస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీల పరిస్థితి ఇలా ఉంటే ఏ పార్టీకి సంబంధం లేని యువకులు, విద్యావంతులు కూడా పోటీలో ఉండాలని ఉబలాటపడుతున్నారు. ఈ లెక్కన స్థానిక ఎన్నికలు ఎప్పుడు జరిగినా పోటీ మాత్రం మెండుగా ఉండేలా ఉందని గ్రామాల్లో పరిస్థితిని బట్టి తెలుస్తోంది.

మహిళా ఓటర్లే కీలకంగా మారబోతున్నారు..

ఎప్పటిలాగే ఈ సారి కూడా ఎన్నికల్లో గెలుపోటములు ప్రభావితం చేయడంలో మహిళా ఓటర్లే కీలకంగా మారబోతున్నారు. ఎందుకంటే అధికారులు విడుదల చేసిన ఓటర్ల ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని నిజామాబాద్ జిల్లాలోని 545 గ్రామ పంచాయతీల్లో మొత్తం ఓటర్ల సంఖ్య 8,29,463 మంది ఉంటే, వీరిలో మహిళా ఓటర్లు 4,42,955 మంది ఉన్నారు. పురుషులు మహిళల కన్నా తక్కువ సంఖ్యలో 3,86,493 మంది ఉన్నారు. కామారెడ్డి జిల్లాలోని 526 గ్రామ పంచాయతీల్లో మొత్తం ఓటర్లు 6,36,300 మంది కాగా, వీరిలో మహిళా ఓటర్లు 3,29,747 మంది, పురుషులు 3,06,538 మంది ఉన్నారు. నిజామాబాద్ జిల్లాలో పురుషుల కన్నా మహిళల సంఖ్య 56,462 మంది, కామారెడ్డి జిల్లాలో 23,209 మంది అధికంగా ఉన్నారు.

కుల గణన తర్వాతే స్థానిక ఎన్నికలుంటాయా?

స్థానిక సంస్థల ఎన్నికలకు కుల గణన అడ్డంకిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక వేళ రాష్ట్రంలో కుల గణన తర్వాతే లోకల్ బాడీ ఎన్నికలు జరగాలని ప్రభుత్వం గనక నిర్ణయం తీసుకుంటే పంచాయతీ ఎన్నికలు మరింత ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. కుల గణన విషయంపై ప్రభుత్వం పక్కాగా ఇంకా ఏ నిర్ణయాన్ని వెల్లడించలేదు. కానీ, కుల గణన తర్వాతే పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ పార్టీలో వీహెచ్ లాంటి సీనియర్లు కూడా సలహా ఇస్తున్నారు. దీంతో సీఎం రేవంత్ సీనియర్ల సలహాలతో పాటు ప్రజల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకునే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇదే గనక జరిగితే పంచాయతీ ఎన్నికల కోసం మరికొద్ది నెలలు ఆగాల్సిందే.

Advertisement

Next Story

Most Viewed