త్వరలో బదిలీలు.. అంతా రెడీ.. ఉత్తర్వులే బాకీ!

by karthikeya |
త్వరలో బదిలీలు.. అంతా రెడీ.. ఉత్తర్వులే బాకీ!
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ పంచాయతీరాజ్ శాఖలో బదిలీలకు రంగం సిద్ధమైనట్టు తెలిసింది. అందుకు సంబంధించిన నివేదిక సైతం ప్రభుత్వానికి చేరినట్టు సమాచారం. త్వరలో ఇందుకు సంబంధించిన ఆదేశాలు సైతం జారీ అవుతాయని అధికారులు చెబుతున్నారు. అయితే, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం 4 రకాల కమిటీలను ఇదివరకే ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. పార్లమెంటు ఎన్నికలకు ముందే ఈ ప్రక్రియ జరగాల్సి ఉన్నా జరగలేదు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో రాష్ట్రస్థాయి, మల్టీ జోనల్‌, జోనల్‌, జిల్లాస్థాయిలో లోక్‌సభ ఎన్నికలకు ముందు భారీగా బదిలీలు జరిగాయి. అందుచేత, సాధారణ బదిలీల్లో అవకాశం కల్పించాలని ఎంపీడీవోలు, ఆఫీసర్లు ప్రభుత్వాన్ని కోరుతున్న విషయం విదితమే. ఎన్నికల నిబంధనతో ఎక్కడికో బదిలీ అయ్యామని, మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 317 జీవో బాధిత ఉద్యోగులు సాధారణ బదిలీల్లో తమకు అవకాశం రావడం లేదని, తమకు కూడా అవకాశం కల్పించాలని కోరుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కమిటీలు వేసిన ప్రభుత్వం అందుకు సంబంధించిన నివేదిక తెప్పించుకున్నది. త్వరలో ఈ ప్రక్రియను చేపట్టే అవకాశం ఉందని ఆ శాఖ వర్గాలు గుసగుసలాడుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed