రూటు మార్చిన సైబర్ నేరగాళ్లు.. ఫోన్ నెంబర్లకు పోలీసు అధికారుల డీపీలు

by Mahesh |
రూటు మార్చిన సైబర్ నేరగాళ్లు.. ఫోన్ నెంబర్లకు పోలీసు అధికారుల డీపీలు
X

దిశ, మక్తల్: సైబర్ నేరగాళ్లు రూటు మారుస్తున్నారు. ప్రజలను మోసం చేసి డబ్బులను కొల్లగొట్టేందుకు ఎప్పటికప్పుడు ఎత్తుగడలు వేస్తూ నేరాలకు పాల్పడుతున్నారు. గత రెండు మూడు నెలలుగా మక్తల్ నియోజకవర్గంలోని పలువురికి మేము సీబీఐ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాం. మీరు/ మీ వాళ్ళు ఫలానా కేసులో ఉన్నారు. మిమ్మల్ని అరెస్టు చేయడానికి మా బృందం వస్తోందంటూ నేరగాళ్లు పలువురిని భయపెడుతూ సైబర్ నేరాలకు తెరలేపుతున్నారు. పోలీసు ఉన్నతాధికారుల డీపీతో ఉన్న ఆ ఫోన్ నెంబర్ల పై ఆరా తీస్తే అవి పాకిస్థాన్, ఇతర ఆఫ్రికా దేశాల నెంబర్లుగా తేలుస్తున్నారు. కొంతమంది సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి డబ్బులను కోల్పోతే.. మరి కొంతమంది సైబర్ నేరగాళ్ల ఎత్తుగడలను పసిగట్టి వారికి దిమ్మతిరిగే సమాధానాలు ఇస్తున్నారు. గత కొన్ని నెలలుగా సిబిఐ పేరుతో సైబర్ నేరగాళ్లు పలువురికి ఫోన్లు చేశారు. అందుకు సంబంధించిన వివరాలు.

- రెండు నెలల క్రితం ఒక ఉపాధ్యాయురాలికి ఫోన్ చేసి మీ పేరిట థాయిలాండ్ దేశానికి డ్రగ్ పార్సిల్ అవుతుండగా కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఈ కేసులో నుంచి బయటపడాలంటే మీరు వెంటనే ముంబై రావాల్సి ఉంటుందని చెప్పడంతో ఆ ఉపాధ్యాయురాలు భయపడి విషయాన్ని తమ బంధువులకు తెలుపడంతో.. వారు రంగ ప్రవేశం చేసి ఘాటుగా సమాధానం ఇవ్వడంతో నేరగాళ్లు మళ్లీ ఫోన్ చేయలేదు.

- మక్తల్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడికి ఫోన్ చేసి నీ పైన డ్రగ్స్ కేసు నమోదు అయింది. ఆ కేసు నుంచి బయటపడకుంటే పీడీ కేసు పెడతాం. వెంటనే సమస్యను పరిష్కరించుకోండి అని చెప్పడంతో ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న ఆ యువకుడు భయపడి మాయగాళ్లు మాయమాటలలో పడి లక్షా 30 వేల రూపాయలు కోల్పోయినట్లు సమాచారం.

- మక్తల్ పట్టణంలో ఓ వ్యాపారికి నేరగాళ్లు ఫోన్ చేసి మీ కుమారుడు హైదరాబాదులో త్రిబుల్ రైడింగ్ చేస్తూ పట్టుబడ్డాడు. కేసు నమోదైందని చెప్పడంతో అప్పటికే ఆ వ్యాపారి కొడుకు హైదరాబాద్ లో కాకుండా మక్తల్ లో ఉన్న కారణంగా ఇందులో ఏదో మోసం ఉందని గ్రహించి ఫోన్ చేసిన వ్యక్తులకు ఘాటుగా సమాధానాలు చెప్పారు.

- మరో వ్యాపారికి ఫోన్ చేసి మీ కుమారుడు రేప్ కేసులో ఇరుక్కున్నారు. కేసు మాఫీ చేసుకోవాలి అంటే డబ్బులు పంపాలి అంటూ బెదిరింపులకు పాల్పడినట్లు తెలిసింది. వెంటనే ఆ వ్యక్తి జాగ్రత్తపడి గట్టిగా సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది.

- ఇటీవల రైతుల ఖాతాలలో రుణమాఫీ కి సంబంధించిన డబ్బులు పడడంతో పలువురు రైతులకు ఫోన్ చేసి మీ పేరిట పెద్ద మొత్తంలో లోన్ కు సంబంధించి డిఫాల్ట్ అయ్యారు. మీ రుణమాఫీ డబ్బులను ప్రధాన నెంబర్ కు పంపాలని కోరడం తో కొంతమంది రైతులు ఆందోళన చెంది తమకు సంబంధించిన కొంతమందిని సంప్రదించి వచ్చిన ఫోన్లు నేరగాళ్లవి అని భావించి కొత్తగా వచ్చిన ఫోన్లు ఎత్తడం మానివేశారు.

ఇలా ప్రతిరోజూ అధికారుల పేరుతో ఫోన్లో వస్తుండడంతో ఆ ఫోన్లను ఎత్తితే ఎటువంటి నష్టం జరుగుతుందో అన్న భయం ప్రజలలో నెలకొంది. ఇటువంటి ఫోన్లపై జిల్లా పోలీస్ అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించి సైబర్ నేరగాళ్ల భరతం పట్టాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎస్పీ ఆదేశాలతో సైబర్ నేరాలపై పోలీసు కళాబృందాలతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. నేరగాళ్లు పోలీస్ అధికారుల ప్రొఫైల్ తో ఫోన్ కాల్స్ వచ్చినా భయపడొద్దు. అలా వచ్చిన కాల్స్ కు సంబంధించి వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లలో వివరాలు తెలపండి. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటాం.-లింగయ్య, డీఎస్పీ, నారాయణపేట

Advertisement

Next Story

Most Viewed