BRS కాళ్ల బేరానికి బీజేపీ లొంగదు.. KCR ఎత్తులు పనిచేయవ్: MP లక్ష్మణ్ ఆసక్తికర వ్యాఖ్యలు

by Satheesh |   ( Updated:2024-02-19 15:28:49.0  )
BRS కాళ్ల బేరానికి బీజేపీ లొంగదు.. KCR ఎత్తులు పనిచేయవ్: MP లక్ష్మణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీతో పొత్తు పెట్టుకోడానికి బీఆర్ఎస్ తహతహలాడుతున్నట్లు వార్తలు వస్తున్నాయని, కేసీఆర్ ఎత్తులు పని చేయవని, ఆ పార్టీతో కలిసి పనిచేసే ప్రసక్తే లేదని ఎంపీ లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ కాళ్ళ బేరానికి బీజేపీ లొంగదన్నారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పొత్తుతోనే బీఆర్ఎస్, బీజేపీ పోటీ చేస్తాయనే వార్తలను ఆయన తోసిపుచ్చారు. బీజేపీ ఒంటరిగానే మొత్తం 17 స్థానాల్లో పోటీ చేస్తుందని, గతంలో వచ్చిన స్థానాలకంటే ఈసారి ఎక్కువే వస్తాయన్నారు. బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి దయనీయంగా ఉన్నదని, ఆ పార్టీ మునిగిపోతున్న నావ అని, అందులో చాలా మంది ఇమడలేక బీజేపీలో చేరబోతున్నారని, ఇప్పటికే చాలా మంది సిట్టింగ్‌లు టచ్‌లోఉన్నారని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ పై కామెంట్లు చేశారు.

లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని, ఒంటరిగానే పోటీ చేస్తున్నామని, ఇది పార్టీ కేంద్ర నాయకత్వం తీసుకున్న నిర్ణయమని, ఆ పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడిగా తాను ఈ క్లారిటీ ఇవ్వదల్చుకున్నట్లు తెలిపారు. బీఆర్‌ఎస్‌ పార్టీ కాళ్ల బేరానికి వచ్చినా బీజేపీ లొంగబోదన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య స్నేహ సంబంధాలు ఉన్నాయని, రహస్యంగా దోస్తీలో ఉన్నాయని వస్తున్న వార్తల్లో ఏ మాత్రం వాస్తవం లేదన్నారు. నిజానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యనే లోపాయకారీ ఒప్పందం ఉన్నదని, అందువల్లనే బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్ల కాలంలో అవినీతికి పాల్పడిందని కాంగ్రెస్ ప్రభుత్వం పదేపదే ఆరోపిస్తున్నా, డాక్యుమెంట్లను ప్రదర్శిస్తున్నా, శ్వేతపత్రాల్లో గణాంకాలు వివరిస్తున్నా చర్యలు తీసుకోడానికి మాత్రం వెనకాడుతున్నదన్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌‌లో కవిత పేరు వచ్చిన తర్వాత ఆమెను అరెస్టు చేస్తామంటూ బీజేపీ అగ్రనేతలు పలువురు తెలంగాణలోనే చేసిన కామెంట్లను మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా.. ఈ కేసులో విచారణ పురోగతిలో ఉన్నదని, సీబీఐ లేదా ఈడీ తీసుకునే చర్యలపై రాజకీయ పార్టీగా బీజేపీకి ఏం సంబంధమని ఎదురు ప్రశ్నించారు. విచారణకు అనుగుణంగా దర్యాప్తు సంస్థలు వ్యవహరిస్తాయని, ఆ కార్యాచరణపై తాము ఏమీ జోస్యం చెప్పలేమన్నారు.

Advertisement

Next Story