MLA Katipalli: నిజాంను పొగిడే సీఎం అవసరమా

by Gantepaka Srikanth |
MLA Katipalli: నిజాంను పొగిడే సీఎం అవసరమా
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ ప్రభుత్వ హడావుడి కారణంగానే వారు ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ధరణి ఫెయిలయిందని, దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి విమర్శలు చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద శుక్రవారం ఆయన మాట్లాడారు. ప్రభుత్వం గత ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోయడం తప్ప ఈ సమావేశాల్లో ఎలాంటి సంస్కరణలు చేయలేదని మండిపడ్డారు. ధరణిపై షార్ట్ డిస్కషన్‌పై తమకు ఒక్కరికే మాట్లాడే అవకాశం ఇచ్చారని, అదే అక్బరుద్దీన్ కి చాలా టైం ఇచ్చారని పేర్కొన్నారు. ఆన్ లైన్ పహాణీ ఏటా చేయాలని ఆయన సూచించారు. కబ్జా కాలం కూడా పహాణీలో ఉంచాలన్నారు. మాజీ సీఎం కేసీఆర్ కబ్జా కాలం తొలగించారని, దీంతో భూమి ఎవరిది? ఎప్పటి నుంచి వారు కబ్జాలో ఉండే వారనే వివరాలు లేకుండా పోయాయని పేర్కొన్నారు. సాదాబైనామాలు కూడా చాలా ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చే కొత్త పోర్టల్ లో బై నంబర్స్ సర్వే చేయాలని కాటిపల్లి డిమాండ్ చేశారు. ప్లాట్ లో మాదిరిగానే నాలుగు దిక్కులు ఎవరు ఉన్నారు అనేది ఎంట్రీ చేసి బౌండ్రీ ఫిక్స్ చేయాలన్నారు.

బీఆర్ఎస్ హయాంలో తొలగించిన వీఆర్ఏ, వీఆర్వో వ్యవస్థను తిరిగి తీసుకురావాలని కాటిపల్లి వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. ధరణిలో తప్పుల సవరణను ఉచితంగా చేపట్టాలన్నార. రిజిస్ట్రేషన్ పవర్ ఎమ్మార్వోలకు ఇచ్చారని, అయితే ఎమ్మార్వో రిజిస్ట్రేషన్ చేశాక ఆర్డీవోకు ట్రాన్స్ ఫర్ చేయాలని పేర్కొన్నారు. అసైన్ ల్యాండ్ కు కలెక్టర్లు ఎల్ వోసీ ఇచ్చారన్నారు. కామారెడ్డి కలెక్టర్ కొన్ని ఎకరాలకు ఎల్ వోసీ ఇచ్చారన్నారు. అటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని కాటిపల్లి వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు.

ఆడవాళ్ళ వివస్త్రలను చేసి బతుకమ్మ ఆడించిన నిజాం ను పొగుడుతున్న సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణకు అవసరమా? అని కాటిపల్లి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. హైదరాబాద్ ను నిజాం అభివృద్ధి చేశారని సీఎం రేవంత్ పొగుడుతున్నారని ఫైరయ్యారు. రైతుల రక్తపు చుక్కలతో భవనాలు కట్టారన్నారు. పొగడ్తలతో పాటు నిజాం నవాబు చేసిన తప్పులు కూడా సీఎం చెప్పాలన్నారు. మెట్రోకి పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెడుతున్నారని, దీని ద్వారా రూ.వందల కోట్ల స్కాం జరుగుతోందని కాటిపల్లి ఆరోపించారు. దీని రెవెన్యూ జీహెచ్ఎంసీకి కూడా రావడం లేదని, గతంలో కేసీఆర్ బావమరిది లీడ్స్ యాడ్ కంపెనీ ఉండేదని, ఇప్పుడు సీఎం బంధువు కంపెనీ హోర్డింగ్స్ ను నిర్వహిస్తోందన్నారు. ఇకపోతే రిటైర్ అయ్యాక కూడా ఉద్యోగులు కొనసాగుతున్నారని వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. ఏపీకి చెందిన రిటైర్డ్ ఉద్యోగులు శ్రీనివాస్ రాజ్, ఆదిత్య నాథ్ దాస్ సీఎంవోలో పనిచేస్తున్నారని కాటిపల్లి తెలిపారు. వారికి పెన్షన్ తో పాటు జీతం కూడా ఇస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. మంత్రి పేషీల్లో 20 మంది పనిచేస్తున్నారని, వారి బంధవులు తప్పితే క్వాలిఫికేషన్ ఉన్న యువత అక్కడ ఉండటంలేదన్నారు. ఓఎస్డీలుగా 25 నుంచి 35 ఏళ్ల వ్యక్తులను నియమిస్తున్నారని, వారు కార్ లో వస్తే 25 ఏండ్ల అనుభవం ఉన్న వ్యక్తి సెల్యూట్ కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. సీఎంవో నుంచే ఈ ప్రక్షాళన జరగాలని, ఆపై సెక్రటేరియట్, అసెంబ్లీలోనూ జరగాలని ఆయన పేర్కొన్నారు.

ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. ఉద్యోగ క్యాలెండర్ లో స్పష్టత లేదని విమర్శించారు. అందులో ఉద్యోగ్యాల సంఖ్య పెట్టలేదని మండిపడ్డారు. సీఎం ఉద్యోగ నోటిఫికేషన్ అనౌన్స్ చేస్తారని నిరుద్యోగులు వెయిట్ చేస్తే.. అది ప్రకటించకుండా ఉసూరుమనిపించారని ఎద్దేవాచేశారు. రాబోయే రోజుల్లో నిరుద్యోగులు కాంగ్రెస్ కి తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. 8 మంది ఎమ్మెల్యేలున్న తమకు ఎంఐఎం కంటే తక్కువ సమయం ఇచ్చారన్నారు. సభలో తమ నోరు నొక్కినా.. తాము ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామని పాయల్ శంకర్ స్పష్టంచేశారు.

Advertisement

Next Story