మెడికల్ విద్యార్థులపై పని ఒత్తిడి పెరిగింది: విజయశాంతి

by GSrikanth |
మెడికల్ విద్యార్థులపై పని ఒత్తిడి పెరిగింది: విజయశాంతి
X

దిశ, తెలంగాణ బ్యూరో: మెడికల్ కాలేజీల్లో పీజీ విద్యార్థులపై పనిభారం, ఒత్తిడి పెరిగిందని బీజేపీ సీనియర్ నేత విజయశాంతి తెలిపారు. పీజీ స్టూడెంట్స్‌కు వారానికి 48 పని గంటలే ఉండాలన్న జాతీయ వైద్యమండలి మార్గదర్శకాలకు భిన్నంగా వారిపై పనిభారం మోపుతున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. పైగా వేధింపులు, ర్యాగింగ్‌లు, ఆత్మహత్యాయత్నాలు, గుండెపోట్లు వంటి రకరకాల బాధాకరమైన పరిస్థితులు మెడికల్ విద్యార్థులకు చోటు చేసుకుంటున్నాయని వెల్లడించారు. తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మక వైద్య విద్యా సంస్థగా పేరున్న వరంగల్ కేఎంసీలో జూనియర్ మెడికోల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇప్పుడు ప్రాణాలతో పోరాడుతున్న మెడికో ప్రీతి కాల్ డేటా స్పష్టం చేస్తోందన్నారు.

కేఎంసీలో ఆమెకు ఎదురైన వేధింపులపై హెచ్‌వోడీ, ప్రిన్సిపాల్ తదితరులకు ఫిర్యాదులు వెళితే.. ఎదురయ్యే పరిణామాల గురించి తన తల్లిదండ్రులతో మాట్లాడిన కాల్స్‌ను బట్టి అక్కడి పరిస్థితులను అర్థం చేసుకోవచ్చన్నారు. కాలేజీల్లో తగినంత మంది ప్రొఫెసర్లను నియమించడం లేదన్నారు. ఈఎస్ఐ మెడికల్ కాలేజీలో పీజీ విద్యార్థులకి ఐదు నెలలుగా స్టయిఫండ్ అందడం లేదన్నారు. ఈ పరిస్థితులపై తెలంగాణ సర్కారు ఏనాడూ దృష్టిపెట్టిన పాపాన పోలేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం చేసే అప్పులన్నీ అభివృద్ధి కోసమేనంటున్న పాలకులు ఈ పరిణామాలకు ఏం జవాబు చెబుతారు? అని విజయశాంతి ప్రశ్నించారు.

Advertisement

Next Story

Most Viewed