Alleti Maheshwar Reddy: సీఎం రేవంత్‌, డిప్యూటీ సీఎం భట్టికి మధ్య విభేదాలు

by Gantepaka Srikanth |
Alleti Maheshwar Reddy: సీఎం రేవంత్‌, డిప్యూటీ సీఎం భట్టికి మధ్య విభేదాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేబినెట్‌లో విభేదాలు, కాంగ్రెస్‌లో కుమ్ములాటలను కట్టడిచేయలేని అసమర్థ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి(Alleti Maheshwar Reddy) ఘాటు విమర్శలు చేశారు. వారి లోపాలను, వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్‌తో కలిసి బీజేపీ కూల్చేందుకు ప్రయత్నిస్తోందంటూ తప్పుడు ఆరోపణలు చేయడం ముఖ్యమంత్రి దివాళాకోరు రాజకీయాలకు నిదర్శనమని సోమవారం ఒక ప్రకటనలో ఫైరయ్యారు. పలు రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చిన చరిత్ర కాంగ్రెస్ దేనని బీఆర్ఎస్‌తో కుమ్మక్కయింది కాంగ్రెస్సేనని ఏలేటి విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటయ్యాయని మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) అవగాహన లేకుండా నిరాధార ఆరోపణలు చేశారని ఏలేటి చురకలంటించారు. మధ్యప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్రలో కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలతో ప్రభుత్వాలు కూలిపోయాయని, అందులో బీజేపీ ప్రమేయం లేదన్నారు. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చిన పాపపు చరిత్ర కాంగ్రెస్ దేనని మహేశ్వర్ రెడ్డి విమర్శలు చేశారు.

కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను మార్చిన చరిత్ర కూడా ఆ పార్టీదేనని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌కు, మంత్రి భట్టికి మధ్య విభేదాలు ఉన్నమాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. మూసీ ప్రక్షాళన వ్యయం లక్షన్నర కోట్లు అని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటిస్తే.. అలాంటిదేమీ లేదని డీపీఆర్ సిద్ధం కాలేదని భట్టి చెప్పింది వాస్తవం కాదా? అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలకు పార్టీ కండువా కప్పే కార్యక్రమాల్లో సీఎం రేవంత్ వెంట మంత్రి పొంగులేటి మినహా మరో మంత్రిలేనిది మరిచారా? అంటూ చురకలంటించారు. ఫిరాయింపుల అంశంలో ఇతర మంత్రులతో సీఎంకు విభేదాలున్నది వాస్తవం కాదా? అని ఏలేటి ప్రశ్నించారు.

కేబినెట్‌లో మొదటి నుంచి కాంగ్రెస్‌లో ఉన్న మంత్రులు ఒక గ్రూపుగా.. సీఎంతో పాటు టీడీపీ, బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారు ఒక వర్గంగా విడిపోయింది నిజం కాదా? అని ఏలేటి నిలదీశారు. కాంగ్రెస్‌లో ఉన్న కుమ్ములాటలను కప్పి పుచ్చేందుకు బీజేపీపై నిరాధార ఆరపణలు చేయడంపై మంత్రి శ్రీధర్ బాబుపై ఏలేటి విరుచుకుపడ్డారు. అధికారంలోకి రాగానే కేసీఆర్ కుటుంబ అవినీతిని కక్కిస్తానని చెప్పి.. వారిని కాపాడుతున్నది వాస్తవం కాదా? అని ప్రవ్నించారు. అరెస్టు చేయకపోవడం వెనుకు ఆంతర్యమేంటన్నారు.

Advertisement

Next Story

Most Viewed