Maheshwar Reddy: రాహుల్ నీది ఏ మతం, ఏ కులం

by Gantepaka Srikanth |
Maheshwar Reddy: రాహుల్ నీది ఏ మతం, ఏ కులం
X

దిశ, తెలంగాణ బ్యూరో: కులగణనపై మాట్లాడే ముందు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) మతం, కులమేంటో చెప్పాలని, ఆ తర్వాత ఆయన కులగణనపై మాట్లాడాలని బీజేఎల్పీ(BJLP) నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి(Alleti Maheshwar Reddy) ఘాటు విమర్శలు చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ తాత ఎవరో తనకు తెలుసని, మరి రాహుల్ గాంధీ తాత ఎవరని ఏలేటి ప్రశ్నించారు. రాహుల్ గాంధీ తాత పేరు ఫిరోజ్ జహంగీర్ అని, ఫిరోజ్ జహంగీర్ మనవడు రాహుల్ జహంగీర్(Jahangir) కావాలని.. మరి గాంధీ ఎలా అయ్యారని ఆయన ప్రశ్నించారు. ఆయనకు దేశంలో ఉన్న సంస్కృతి సంప్రదాయాలు తెలుసా? అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ కులం, మతం గురించి మాట్లాడిన వారిపై కర్ణాటకలో కేసులు పెట్టారని, ఇప్పుడు తాను మాట్లాడుతున్నానని, తనపై ఎన్ని కేసులు పెట్టుకున్నా తాను భయపడనని స్పష్టం చేశారు. రాహుల్ రాజకీయాల్లో ఉన్నారని, అందుకే ఆయన కులం, మతమేంటో తెలియజేయాలని ఏలేటి డిమాండ్ చేశారు.

కులగణనకు బీజేపీ వ్యతిరేకం కాదని ఏలేటి వ్యాఖ్యానించారు. కామారెడ్డిలో కాంగ్రెస్ నేతలు చేసిన బీసీ డిక్లరేషన్ ద్వారా ఇచ్చిన 21 హామాలు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన ద్వారా కాలయాపన చేస్తోందని విమర్శలు చేశారు. కేసీఆర్.. సమగ్ర కుల సర్వే వివరాలు ఎందుకు బయటపెట్టడం లేదని నిలదీశారు. కులగణన ద్వారా బీసీలకు ఏవిధంగా న్యాయం చేస్తారో చెప్పాలన్నారు. కోర్టు ఆదేశాల ప్రకారం బీసీ రిజర్వేషన్ల అమలుకు 50 శాతం నిబంధనలు ఉన్నాయని చెప్పి తప్పించుకుంటే ఊరుకోబోమని ఏలేటి హెచ్చరించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుచేసి తీరాల్సిందేనంటూ నొక్కిచెప్పారు. పది మంది మంత్రుల్లో కేవలం ఇద్దరు బీసీలకు మాత్రమే కాంగ్రెస్ అవకాశం కల్పించిందని, మంత్రివర్గంలో 42 శాతం బీసీలకు ఇవ్వాలని ఆయన పట్టుపట్టారు. బీసీ డిక్లరేషన్ చేసిన కామారెడ్డి అసెంబ్లీ సీటును కూడా బీసీలకు ఇవ్వలేదని మహేశ్వర్ రెడ్డి విరుచుకుపడ్డారు. మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చి కాంగ్రెస్ బీసీలను మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో 31 మంది బీసీ రిజర్వేషన్లతో మైనార్టీలు గెలిచారని ఏలేటి వ్యాఖ్యానించారు. అలాంటిది మైనార్టీల రిజర్వేషన్లు ఎత్తివేయకుండా బీసీలను కుల గణన పేరుతో మోసం చేస్తున్నారని విమర్శలు చేశారు.

కుల గణనతో బీసీలకు ఎలాంటి లబ్ధి జరుగుతోందో శ్వేతపత్రం విడుదల చేయాలని ఏలేటి డిమాండ్ చేశారు. కులగణన పేరుతో మహారాష్ట్రలో లబ్ధి పొందే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తోందని మహేశ్వర్ రెడ్డి చురకలంటించారు. జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు పెరుగుతున్నాయని, కానీ బీసీల రిజర్వేషన్లు తగ్గుతున్నాయని వ్యాఖ్యానించారు. రూ.20 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు ఏమైందని ఏలేటి ప్రవ్నించారు. ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఏదని నిలదీశారు. ఇదిలా ఉండగా ఇటీవల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటిపై ఈడీ దాడులు జరిగాయని, ఆయన్ను బీజేపీ కాపాడుతోందని బీఆర్ఎస్ చేసిన విమర్శలపై ఏలేటి మండిపడ్డారు. పొంగులేటిని కాపాడుతున్నది బీజేపీ కాదని, బీఆర్ఎస్ అని పేర్కొన్నారు. పొంగులేటిపై విచారణ ఇప్పటికే జరుగుతోందని, అవినీతి చేసిన వారెవరూ తప్పించుకోలేరని ఏలేటి మహేశ్వర్ రెడ్డి హెచ్చరించారు. గతంలో కవిత విషయంలో ఏమైందో కేటీఆర్ తెలుసుకుని మాట్లాడాలని బదులిచ్చారు. కవిత విషయంలో సైతం విచారణ పూర్తయ్యాకే చర్యలు తీసుకున్నారన్న సంగతి మరిచిపోవద్దని ఏలేటి పేర్కొన్నారు.

Advertisement

Next Story