భువనగిరిలో బీజేపీకే మొగ్గు!.. తాజా సర్వేలో ఆసక్తికర విషయాలు

by Prasad Jukanti |
భువనగిరిలో బీజేపీకే మొగ్గు!.. తాజా సర్వేలో ఆసక్తికర విషయాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఏ పార్టీ వైపు గెలుపు అవకాశాలు ఎవరివైపు ఉన్నాయనే దానిపై పలు సర్వేలు ఆసక్తికర విషయాలు వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో భువనగిరి పార్లమెంట్‌లో ఎవరు గెలవబోతున్నారనేది హాట్ టాపిక్‌గా మారింది. ఇక్కడ కాంగ్రెస్ నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి, బీజేపీ నుంచి బూర నర్సయ్య గౌడ్, బీఆర్ఎస్ నుంచి క్యామ మల్లేశ్ అభ్యర్థులుగా ఖరారయ్యారు. అయితే భువనగిరి సెగ్మెంట్ ఓటర్లు బీజేపీ వైపే మొగ్గు చూపుతున్నారని తాజాగా జన్ లోక్ పోల్ సర్వే తేల్చింది. అలాగే ఈ సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

ఒక్క ఎమ్మెల్యే లేకున్నా..

ఈసారి భువనగిరి ఖిల్లాపై బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ జెండా పాతడం ఖాయం అని జన్ లోక్ పోల్ సర్వే అంచనా వేసింది. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోటీ ఉండే అవకాశాలు ఉన్నాయని, బీజేపీకి 34.90 శాతం, కాంగ్రెస్‌కు 33.05 శాతం, బీఆర్ఎస్‌కు 26.12 శాతం, ఇతరులకు 5.93 శాతం ఓట్ షేర్ దక్కబోతున్నదని సర్వే వెల్లడించింది. భువనగిరి నియోజకవర్గంలో మార్చి 5 నుంచి ఏప్రిల్ 5 వరకు 2 శాతం ఓట్లను శాంపిల్ సైజ్ సేకరించి విశ్లేషించినట్లు తెలిపింది. భువనగిరి ఎంపీ పరిధిలో ఇబ్రహీంపట్నం, మునుగోడు, భువనగిరి, ఆలేరు, జనగామ, తుంగతుర్తి నియోజకవర్గాలు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఎంపీ సెగ్మెంట్‌లోని మొత్తం నియోజకవర్గాల్లో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఒకరు బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే ఉన్నా లోక్ సభ ఎన్నికల విషయానికి వచ్చేసరికి బీజేపీ అభ్యర్థికే ఓటర్లు పట్టం కట్టేందుకు మొగ్గు చూపుతున్నారని అంచనా వేసింది.

ఇద్దరికీ నో ఎక్స్‌పీరియన్స్..

అభ్యర్థుల విషయానికి వస్తే బూర నర్సయ్య గౌడ్‌కు గతంలో ఎంపీగా పని చేసిన అనుభవం, నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో విస్తృతమైన పరిచయాలు, సామాజిక కార్యక్రమాలతోపాటు నరేంద్ర మోడీ చరిష్మా సానుకూలంగా మారే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ నియోజకవర్గంలో గౌడ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉండటం అదనపు ప్రయోజనం అనే టాక్ వినిపిస్తోంది. కాంగ్రెస్‌ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఎంపీ, ఎమ్మెల్యేగా చేసిన అనుభవం లేకపోవడం, నియోజకవర్గంలో పూర్తిస్థాయిలో పరిచయాలు లేకపోవడంతోపాటు కోమటిరెడ్డి కుటుంబ సభ్యుల సహకారంపైనా చర్చ నడుస్తోంది. బీసీ ఓటర్లను ఆకర్షించడం ఆయనకు సవాలు అనే టాక్ వినిపిస్తోంది. ఇక కురుమ సామాజిక వర్గానికి చెందిన బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేశ్‌కు సైతం గతంలో ఎమ్మెల్యే, ఎంపీగా పని చేసిన అనుభవం లేకపోవడంతోపాటు ప్రస్తుతం ఆ పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు పెద్ద మైనస్‌గా మారే అవకాశాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది.

Advertisement

Next Story