BJP: కాంగ్రెస్‌కు చిత్తశుద్ది ఉంటే ఆ వివరాలు బయటపెట్టాలి.. బండి సంజయ్ డిమాండ్

by Ramesh Goud |
BJP: కాంగ్రెస్‌కు చిత్తశుద్ది ఉంటే ఆ వివరాలు బయటపెట్టాలి.. బండి సంజయ్ డిమాండ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కులగణనపై కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ది లేదని, ఇదంతా కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగమేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన అలయ్ బలయ్ కార్యక్రమానికి బండి సంజయ్ హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కులగణన విషయంలో కాంగ్రెస్ పార్టీపై సంచలన ఆరోపణలు చేశారు. కులగణన విషయంలో రాష్ట్రప్రభుత్వం ఆలోచన దుర్మార్గమైనదని, చిత్తశుద్దితో చేసే ప్రయత్నం చేయట్లేదని, కేవలం స్థానిక సంస్థల ఎన్నికలను ఆలస్యంగా నిర్వహించేందుకు తప్పించుకునే దోరణిలో వ్యవహరిస్తుందని మండిపడ్డారు. గతంలో కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే జరిపిన విషయాన్ని కాంగ్రెస్ పార్టీ మర్చిపోయిందా? కేసీఆర్ నిర్వహించిన సర్వే రిపోర్టులు ఏమయ్యాయని ప్రశ్నించారు.

అటు ఆయన బయటపెట్టలేదని.. వీళ్లు కూడా బయటపెట్టట్లేదని వీరిద్దరి మధ్య ఉన్న చీకటి ఒప్పందమేమిటో చెప్పాలని నిలదీశారు. అప్పటి సర్వేతో ఏం లాభం చేకూరిందని, మళ్లీ ఈ రోజు కాంగ్రెస్ కులగణన పేరుతో 150 కోట్ల రూపాయలు కేటాయించి, 60 రోజుల సమయం ఇచ్చి సర్వే చేయిస్తుందన్నారు. మనుషుల కులాలు మారాయా లేక కుటుంబసభ్యులు ఏమైనా మారారా? దీనిలో ఉన్న ఉద్దేశం ఏంటో చెప్పాలని అన్నారు. కులగణన ఒక్ ఫేక్ అని, దానికి 150 కోట్లు కేటాయించడం కూడా ఫేక్ అని, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోతామని, ప్రజల్లో కాంగ్రెస్ పార్టీపై ఉన్న వ్యతిరేఖతను గుర్తించి ఇదంతా చేస్తున్నారని దుయ్యబట్టారు. ఆరు గ్యారెంటీలను అమలు చేయలేదని ప్రజలు నిలదీస్తారని, రుణమాఫీ విషయంలో రైతులు సీరియస్ గా ఉన్నారని భయపడి కాంగ్రెస్ పార్టీ తప్పించుకునే దోరణిలో భాగంగానే కులగణన పేరుతో కాలయాపన చేస్తుందని ఆరోపించారు. ఇదంతా కాంగ్రెస్ పార్టీ డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగమేనని, వారికి చిత్తశుద్ది ఉంటే కేసీఆర్ చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలు బయటపెట్టాలని బీజేపీ తరుపున డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed