BJP: అబద్దాల్లో కాంగ్రెస్‌కు ఆస్కార్.. వాజ్‌పేయి శతజయంతి వేడుకల్లో బండి సంజయ్

by Ramesh Goud |
BJP: అబద్దాల్లో కాంగ్రెస్‌కు ఆస్కార్.. వాజ్‌పేయి శతజయంతి వేడుకల్లో బండి సంజయ్
X

దిశ, వెబ్ డెస్క్: రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌(Dr. BR Ambedkar)ను అడుగడుగునా అవమానించిన కాంగ్రెస్ పార్టీ(Congress Party).. ఆయనపై మొసలి కన్నీరు కార్చడం విడ్డూరమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్(Union Minister Bandi Sanjay) విమర్శించారు. నాంపల్లి బీజేపీ కార్యాలయంలో(Nampally BJP Office) ఏర్పాటు చేసిన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి(Atal Bihari Vajpayee) శతజయంతి ఉత్సవాల్లో బండి సంజయ్ పాల్గొని వాజ్‌పేయి కి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాజీ ప్రధానమంత్రి, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి సందర్భంగా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. అలాగే వాజ్‌పేయి భారతదేశ వైభవాన్ని, నైతిక విలువలను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పారని, దేశ ప్రజలకు స్పూర్తి ప్రదాతగా నిలిచారని, ప్రోక్రాన్ అణుపరీక్షలు, స్వర్ణ చతుర్భుజీ, గ్రామీణ సడక్ యోజన వారి చలువేనని కొనియాడారు. అంతేగాక పార్లమెంట్‌లో బలనిరూపణ విషయంలో అనేక మంది ఇతర పార్టీలో ప్రభుత్వానికి మద్దతిచ్చేందుకు సిద్ధంగా ఉన్నా, నీతి, నిజాయితీగా వ్యవహరించి పదవిని కోల్పోయిన మహనీయుడు వాజ్ పేయి అని కీర్తించారు.

ఇక అంబేద్కర్ స్పూర్తితో వాజ్ పేయి నడిచారని, వాజ్ పేయి అడుగుజాడల్లో ఆయన ఆశయాలను తూచ తప్పకుండా అమలు చేస్తున్న వ్యక్తి ప్రధాని నరేంద్రమోదీ అని తెలిపారు. నాటి కేసీఆర్(KCR), నేటి రేవంత్ రెడ్డి(Revanth Reddy) తెలంగాణ ప్రజలకు 70 ఎంఎం సినిమాలు, గ్రాఫిక్స్ చూపుతూ ప్రజలను మోసం చేస్తోందే తప్ప, ఇచ్చిన హామీలను మాత్రం అమలు చేయడం లేదని ఆరోపించారు. అబద్దాలను ప్రచారం చేయడంలో కాంగ్రెస్ గోబెల్స్ ను మించి పోయిందని, అబద్దాల్లో ఆస్కార్ అవార్డు ఇవ్వాల్సి వస్తే.. అది కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. నేడు అంబేద్కర్ గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్.. అధికారంలో ఉన్నప్పుడు అంబేద్కర్‌కు భారతరత్న ఎందుకు ఇవ్వలేదో సమాధానం చెప్పాలన్నారు. 1954 నుండి 1988 వరకు నెహ్రూ, ఇందిరా, కామరాజ్ సహా 21 మందికి భారతరత్న అవార్డును ప్రకటించారు. కానీ రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ కు మాత్రం ఇవ్వలేదని, ఆయన ఎందులో తక్కువ.. ఆయన చేసిన తప్పేంది? అని ప్రశ్నించారు. అంబేద్కర్ ఆశయాలను తూచ తప్పకుండా అమలు చేస్తున్న పార్టీ బీజేపీ అని, అంబేద్కర్ పంచ్ తీర్థ్‌లను ఏర్పాటు చేసి ఆయన ఖ్యాతిని దశదిశలా చాటి చెబుతున్నామని, వారికి భారత రత్న అవార్డు ఇచ్చి గౌరవించిన పార్టీ బీజేపీ అని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed