మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలి.. బండి సంజయ్

by Javid Pasha |
మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలి.. బండి సంజయ్
X

దిశ, వెబ్ డెస్క్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వంపై మరోసారి విరుచుపడ్డారు. టీఎస్పీస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో మంత్రి కేటీఆర్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇందిరాపార్కు వద్ద నిర్వహించిన బీజేపీ మహాధర్నాలో బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువకులు కష్టపడి కోచింగ్ తీసుకుంటుంటే పేపర్ లీకేజీతో వారి భవిష్యత్ ను అంధకారంలోకి నెట్టారని మండిపడ్డారు. పేపర్ లీకేజీ వ్యవహారంలో రాష్ట్ర మంత్రలు, బీఆర్ఎస్ నేతలకు పాత్ర ఉందని ఆరోపించారు.

తాను ఇంట్లోలేని సమయం చూసి సిట్ వాళ్లు తన ఇంటికి వచ్చారని అన్నారు. కానీ ఇవాళ సిట్ అధికారులను తానే పిలిచానని సంజయ్ తెలిపారు. దొంగలను వదిలిపెట్టి ప్రతిపక్ష నేతలకు నోటీసులు ఇవ్వడమేంటని ప్రశ్నించారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం బయటకు వచ్చి ఇన్ని రోజులు అవుతున్నా టీఎస్పీఎస్సీ చైర్మన్ ను ఎందుకు అరెస్ట్ చేయలేదని నిలదీశారు. ఈ వ్యవహారంపై మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు ఇవ్వాలని అన్నారు. టీఎస్పీస్సీ పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రభుత్వానికి భయమేంటో చూపిస్తామని బండి సంజయ్ హెచ్చరించారు.

Advertisement

Next Story